నూతిలో జారిపడి..
నూతిలో జారిపడి..
Published Thu, Dec 26 2013 4:04 AM | Last Updated on Wed, Jul 10 2019 7:55 PM
కష్టసుఖాల్లో తోడుగా ఉంటామని ప్రమాణం చేసి వివాహ బంధంతో ఒక్కటయ్యే దంపతులు ఎంతమంది ఆ ప్రమాణానికి కట్టుబడి ఉంటారో కానీ ఈ గిరిజన దంపతులు అక్షరాలా కట్టుబడ్డారు. ఏడాదికోసారి వచ్చే క్రిస్మస్ సంబరాన్ని ముత్యాల్లాంటి ముగ్గురు పిల్లలతో కలిసి సంతోషంగా చేసుకున్న ఈ దంపతులు ఆ తర్వాత మృత్యుప్రయాణంలోనూ ఒకరివెంట ఒకరు నడిచారు. నూతిగట్టుపై సంతోషంగా కూర్చుని మాట్లాడుకుంటున్న భార్యాభర్తలు ఒకరిని కాపాడబోయి మరొకరు నూతిలో జారిపడి మంగళవారం రాత్రి మృతి చెందారు.
వలెసల మడ (పాచిపెంట), న్యూస్‌లైన్: పాచిపెంట మండలంలోని కొటికిపెంట పంచాయతీ వలెసెల మడ గ్రామానికి చెంది న సొయ్యారి అప్పలస్వామి (40), సోంబ్రూ (35) భార్యాభర్తలు. ఆ గిరిజన దంపతులు ప్రమాదవశాత్తు నూతిలో జారిపడ్డారు. జరిగిన సంఘటనపై స్థానికులు, పాచిపెంట ఎస్.ఐ సి.హెచ్. స్వామినాయుడు తెలిపినవివరాలిలా ఉన్నాయి. ఈ గిరిజన గ్రామంలో కేవలం 11 ఇళ్లు ఉన్నాయి. ఇళ్లన్నీ దూరదూరంగా ఉంటాయి. చీకటి పడిపోగానే ఈ గ్రామస్తులు ఎవరింటికి వారే పరిమితమవుతారు. ఒకరి సమాచారం మరొకరికి తెలియదు.అయితే పిల్లలు నిద్రపోయాక అప్పలస్వామి దంపతులు పక్కనే ఉన్న నూతి గట్టుపై కూర్చుని మాట్లాడుకుంటున్నారు.
పొరపాటున ఒకరు నూతిలో జారి పడడంతో కాపాడబోయిన మరొకరు కూడా జారిపడి మృతిచెందారు. ఈ దంపతులు మంగళవారం మృతిచెందినప్పటికీ ఇళ్లు దూరదూరంలో ఉండడంతో సమాచారం ఎవరికీ తెలియరాలేదు. బుధవారం ఉదయం నూతికి వెళ్లిన స్థానికులు మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం మేరకు పాచిపెంట ఎస్.ఐ స్వామినాయడితో పాటు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని నూతిలోని మృతదేహాలను బయటికి తీయించారు. గ్రామంలో శవపంచనామా జరిపించి పోస్టుమార్టం నిమిత్తం సాలూరు సీహెచ్‌సీకి తరలించారు. ప్రమాద సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
అనాథలైన పిల్లలు
అప్పలస్వామి,సోంబ్రూ మృతితో వారి ముగ్గురు పిల్లలు సీతమ్మ (11)లక్ష్మణ (9) లచ్చమ్మ(6)లు అనాథలయ్యారు. అభంశుభం తెలియని గిరిజన పిల్లలను చూసిన ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చాయి. సంఘటనా స్థలం దగ్గర పిల్లలు ఏడుస్తుంటే చూస్తున్న పలువురు బాధను ఆపుకోలేకపోయారు. మృతుల కుమారుడు లక్ష్మణ పాచిపెంటలోని గిరిజన బాలుర వసతి గృహంలో చదువుతున్నాడు. అనాథలైన ఈ పిల్లలను ప్రభుత్వం ఆదు కోవాలని ఆ గ్రామస్తులు కోరుతున్నారు.
Advertisement
Advertisement