గుడుపల్లె, న్యూస్‌లైన్: మండలంలోని అటవీ సమీప గ్రా మాల్లో శనివారం రాత్రి ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పంట పొలాలను తొక్కి సర్వనాశనం చేశాయి. బోరు పైపులను ధ్వంసం చేశాయి. గ్రామాల మీదకొచ్చి ప్రాణాలు తీస్తాయేమోనని పలువురు భయాందోళనకు గురవుతున్నారు. 20 రోజులుగా మల్లప్పకొండ అటవీ ప్రాంతంలో 24 ఏనుగులు తిష్టవేశాయి. అందులో 15 ఏనుగులు ఓ గ్రూపుగా విడిపోయి కర్ణాటక రాష్ర్టం లోని అటవీ ప్రాంతాలకు వెళ్లిపోయాయి. మిగిలిన ఏనుగులు అక్కడే ఉంటూ అడపాదడపా సమీప గ్రామాల మీదకు దూసుకొస్తున్నాయి. రాత్రి పూట పంట పొలాలను తొక్కి నాశనం చేస్తున్నాయి. శనివారం రాత్రి అటవీ సమీప గ్రామాలైన కోడిగానిపల్లె నుంచి వూలవానికొత్తూరు వరకు సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేశాయి.
అయ్యువార్లగొల్లపల్లె సమీపంలోకి రావడంతో కుక్కలు అడ్డుపడ్డాయి. ఓ కుక్కపిల్ల ను తొక్కి చంపేశాయి. అక్కడి నుంచి వూలవానికొత్తూరుకు చేరుకుని రైతు నారాయుణప్ప రాగికుప్పలను ఆరగించాయి. తిమ్మయ్యకు చెందిన బోరు పైపులు, కేసింగ్ పైపు, డ్రిప్ పరికరాలను ధ్వంసం చేశాయి. పక్కనే ఉన్న టమాట పంటనూ తొక్కి నాశనం చేశాయి. *2 లక్షల మేర నష్టం వాటిల్లినట్టు రైతు ఆవేదన చెందాడు. బోరులో రాళ్లు పడి ఉంటే మోటారు పనిచేయదని వాపోయాడు. విషయం తెలుసుకున్న కుప్పం అటవీశాఖ ఎఫ్‌ఆర్‌వో రెడ్డెప్ప, డీఆర్వో వెంకటరవుణ ధ్వంసమైన పంటలు, బోరును పరిశీలించారు. నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
ఏనుగుల బీభత్సం
Published Mon, Dec 16 2013 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 AM
Advertisement
Advertisement