బాబుకు గుణపాఠం చెప్పండి
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ
సాక్షి, హైదరాబాద్ : ‘‘200 ఏళ్ల పరిపాలనలో నిజాంలు హైదరాబాద్‌ను అభివృద్ధి చేయలేదని, తొమ్మిదేళ్ల పాలనలో తానే హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానని మతిభ్రమించిన విధంగా ముస్లింలపై విషం గక్కుతున్న చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. ఆదివారం మజ్లిస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన దారుస్సలాం మైదానంలో జరిగిన మిలాద్-ఉన్-నబీ మహిళల సభలో ఆయన ప్రసంగించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ముస్లింల వ్యతిరేకి అని, అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చలో నిజాంపై వ్యాఖ్యలు చేసి ఆయన నిజ స్వరూపాన్ని బహిర్గతం చేసుకున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ముస్లింల శత్రుపక్షమైన బీజేపీతో కలసి పోటీ చేసేందుకు సిద్ధమవుతోందన్నారు. మతోన్మాద బీజేపీ, తెలుగుదేశం పార్టీలకు ఎన్నికల్లో ఓటు ద్వారా తగిన గుణపాఠం తప్పదన్నారు.
గుజరాత్‌లో సుమారు 300 మంది ముస్లింలను పొట్టనపెట్టుకొని వేలాది మందిని అనాథలను చేసిన మతోన్మాద నరేంద్ర మోడీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టేందుకు హిందుత్వ శక్తులు కలలు కంటున్నాయని ఆరోపించారు. ఓటు ద్వారా మోడీని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో అరాచకం సాగుతున్నా.., ముస్లిం ప్రజాప్రతినిధులు 65 మంది ఉండి కూడా నోరు విప్పే ధైర్యం చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ముస్లింల పక్షాన గళం విప్పేది మజ్లిస్ పార్టీ ఒక్కటేనన్నారు. బాధిత ప్రాంతాల పర్యటనకు వెళ్లిన తమను అడ్డుకోవడం అప్రజాస్వామికమని, ఎన్నివిధాలుగా అడ్డుకున్నా.. బాధితులను ఆదుకొంటామని స్పష్టం చేశారు.