► సర్వజనాస్పత్రిలో గంటన్నర పాటు కరెంట్ కట్
► నానా అవస్థలు పడిన రోగులు
► టార్చ్‌లైటు వెలుతురులోనే ప్రసవాలు
అనంతపురం మెడికల్ : జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిలో కరెంటు కష్టాలు మొదలయ్యాయి. శనివారం వర్షం కారణంగా కరెంటు కట్ చేశారు. దాదాపు గంటన్నర పాటు కరెంటు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వైద్య సేవలకు తీవ్ర అంతరాయం కల్గింది. ఎమర్జెన్సీ, ఏఎంసీ, ఈఓటీ తప్ప మిగిలిన అన్ని వార్డుల్లో రోగులు చీకట్లో మగ్గారు. లేబర్ వార్డులోని ఆరోగ్యశ్రీ యూనిట్‌లో సర్జరీ చేయించుకుని వచ్చిన వారు ఉక్కపోతతో అల్లాడిపోయారు. వారికి కుటుంబ సభ్యులు పేపర్లతో గాలి ఊపి సేదతీర్చారు.
కొంత మంది వార్డుల్లో ఉండలేక బయటకు వచ్చేశారు. గుత్తికు చెందిన షకీల, కూడేరు మండలం నారాయణపురానికి చెందిన యశోదకు గుడ్డి మబ్బులోనే డెలివరీ చేశారు. ఎమర్జెన్సీ కేసులను ఈఓటీకు తరలించాల్సి వచ్చింది. స్పెషల్‌కేర్ నియోనెటాల్ యూనిట్(ఎస్‌ఎన్‌సీయూ)లోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ 34 మంది పసికందులున్నారు. కరెంటు పోవడంతో ఏసీలు ఆగిపోయాయి. పసికందులకు ఏమైనా జరుగుతుందేమోనన్న భయంతో తల్లిదండ్రులు అల్లాడిపోయారు.
స్టాఫ్‌నర్సులు దగ్గరుండి పసికందులకు సేవలందించారు. టార్చ్‌లైట్ వెలుతురులో పాలు పట్టించారు. ఇంజెక్షన్లు వేశారు. ఆస్పత్రిలో జనరేటర్ సౌకర్యమున్నా..పూర్తి స్థాయిలో పని చేయడం లేదు. లేబర్ వార్డు, ఐసీసీయూ, ఎస్‌ఎన్‌సీయూ వార్డుల్లో వెంటిలేటర్‌పై కేసులున్నప్పుడు కరెంటు పోతే పరిస్థితి దారుణంగా ఉంటుందని సిబ్బంది చెబుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్య తలెత్తకుండా చూడాలని కోరుతున్నారు.
నరకయాతన
Published Sun, May 17 2015 2:29 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement