వ్యవసాయ విద్యుత్ సరఫరా నూతన వేళల షెడ్యూలుపై జిల్లా రైతులు కన్నెర్ర చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ పంపుసెట్లకు రాత్రిపూట విద్యుత్ సరఫరా సమయం పెంచుతూ ఆదేశించి రైతుల ప్రాణాలు ఫణంగా పెట్టడంపై మండిపడుతున్నారు. గతంలో ఒక్క మోపిదేవి మండలంలోనే మూడేళ్ల కాలంలో తొమ్మిది మంది రైతులు రాత్రిపూట కరెంట్‌కు బలైన విషయాన్ని గుర్తుచేసుకుని ఆందోళనకు గురవుతున్నారు.
చల్లపల్లి/ ఉయ్యూరు : వ్యవసాయ విద్యుత్ సరఫరా వేళల్లో మార్పులపై రైతులు మండిపడుతున్నారు. రాత్రి వేళల్లో వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ సరఫరా చేయాలన్న విద్యుత్ శాఖ నిర్ణయంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. సోమవారం నుంచి అమలులోకి వచ్చిన సరఫరా వేళల మార్పులతో అన్నదాతపై మరో పిడుగు పడినట్లయింది. సుమారు 2.50 లక్షల ఎకరాలు ఈ విద్యుత్ బోర్లపై ఆధారపడి సాగులో ఉన్నాయి. ప్రధానంగా చెరుకు, పసుపు, కంద, అరటి, తమలపాకు, మామిడి, మిరప, పత్తి వంటి వాణిజ్య పంటలతో పాటు కూరగాయ పంటలు సాగవుతున్నాయి. వీటితో పాటు రెండో పంటగా మాగాణి భూముల్లో మినుము, పెసర, మొక్కజొన్న సాగవుతున్నాయి. డిసెంబర్ మొదలుకుని వ్యవసాయమంతా బోర్లపైనే ఆధారపడి ఉంటుంది.
ప్రస్తుతం వ్యవసాయానికి ఇస్తున్న ఏడు గంటల విద్యుత్ సరఫరా నిరంతరాయంగా చేస్తేనే ఓ మాదిరిగా పంటలను రక్షించుకోవడం సాధ్యపడుతుంది. విడతల వారీగా ఇస్తే తడిసిన పొలమే మళ్లీ తడవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ తాజాగా వ్యవసాయ వేళల్లో మార్పులను అమలులోకి తేవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. పగటివేళ విద్యుత్ సరఫరా సమయాన్ని తగ్గించి రాత్రిపూట సరఫరా సమయాన్ని పెంచడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్ సరఫరా నూతన వేళలు ఇవీ..
డిసెంబర్ ఒకటో తేదీ నుంచి నూతన విద్యుత్ వేళలు అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వుల ప్రకారం ప్రాంతాలనుబట్టి రాత్రివేళలో 9.30 నుంచి 12.30 వరకు, 12.30 నుంచి 3.30 వరకు, 3.30 నుంచి తెల్లవారుజామున 5.30 వరకు 3 గంటలపాటు రాత్రివేళ కరెంటు సరఫరా చే స్తారు. చివరి విడత వారికి రెండు గంటలే షెడ్యూలులో కేటాయించిన నేపథ్యంలో వారికి వర్క్ లోడ్ ప్రకారం మరో గంట వేరే సమయాల్లో సరఫరా చేయనున్నారు.
పగలు తెల్లవారుజామున 5.30 నుంచి 9.30 వరకు, 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు, మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 5.30 వరకు నాలుగు గంటలపాటు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేస్తారు. గతంలో పగటివేళ ఐదు గంటలు, రాత్రివేళ ఒక గంట వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ సరఫరా చేసేవారు. ప్రాంతాలను బట్టి ఒక గంట అటూ ఇటూగా వ్యత్యాసం ఉండేది. ప్రస్తుతం రాత్రి సరఫరా వేళలు మూడు గంటలకు పెంచుతూ ఇచ్చిన ఆదేశాలతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
చీకట్లో సాగు
Published Tue, Dec 2 2014 4:55 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement