కె.గంగవరం (రామచంద్రపురం): మండల కేంద్రమైన కె.గంగవరంలో శుక్రవారం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేంద్రానికి లైసెన్సు తీసుకున్న రెండు నెలలకే ప్రమాదం జరగటం కలకల రేగింది. బాణసంచా కేంద్రం వద్ద రక్షణ చర్యలు తీసుకోకపోవటం మూలంగానే ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. కె.గంగవరానికి చెందిన పెంటపాటి ప్రకాశ్ రెండు నెలల క్రితం మణికంఠ ఫైర్ వర్క్స్ పేరుతో లైసెన్స్ పొందాడు. స్థానిక టేకి డ్రైన్ వద్ద ఇటీవలనే నూతనంగా బాణసంచా తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతిరోజు సుమారుగా 30 మంది వరకు పని చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. అయితే ప్రమాదం జరిగే సమయానికి కరప మండలం గొర్రిపూడికి చెందిన కటకం తాతాజీ, పల్లేటి సత్తిబాబు, పలవెల నాగులు పని చేస్తున్నారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందనేది ప్రాథమికంగా నిర్థారణ కాలేదు.
సంఘటన స్థలాన్ని ఆర్డీఓ ఎన్.రాజశేఖర్, డీఎస్పీ జేవీ సంతోష్ పరిశీలించారు. బాణసంచా తయారీ కేంద్రం వద్ద రక్షణ చర్యలకు తీసుకోకపోవటం మూలంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోందని ఆర్డీఓ రాజశేఖర్ తెలిపారు. పోలీసులు విచారణ అనంతరం యజమానిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రమాదంలో గాయాలపాలైన కరప మండలం గొర్రిపూడికి చెందిన కటకం తాతాజీ, పల్లేటి సత్తిబాబు, పలవెల నాగులును చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ముగ్గురిలో కటకం తాతాజీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు కాకినాడ ప్రభుత్వ వైద్యులు తెలిపారు. వంద శాతం గాయాలతో ఉన్న కటకం తాతాజీ(35), 80 శాతం గాయాలతో పల్లేటి భసవయ్య, పల్లేటి సత్తిబాబు చికిత్స పొందుతున్నారు.రామచంద్రపురం డీఎస్పీ జేవీ సంతోష్, ఆర్డీఓ రాజశేఖర్‌తో పాటు తహసీల్దార్ యార్ఖాన్, సీఐ కొమ్ముల శ్రీధర్‌కుమార్, ఎస్సై నరేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించి నివేదిక తయారు చేశారు.
ఇదిలా ఉండగా బాణసంచా తయారీ కేంద్రం ఊరికి దూరంగా ఉండటంతో ప్రమాదం జరిగిన రెండు గంటల వరకు తెలియలేదని స్థానికులు చెబుతున్నారు. అధికారులు వెళ్లే సమాయానికే బాణసంచా కేంద్రం వద్ద ప్రమాదానికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు లేకుండా చేసి కేంద్రానికి తాళం వేసి వెళ్లిపోయారు. అయితే బాణసంచా తయారీ కేంద్రం పై కప్పులు పేలుడు ధాటికి పగిలిపోయి ఉన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్న కొంత మంది కేంద్రం వద్ద ఎటువంటి పదార్థాలు లేకుండా కాలిన వస్తువులను కూడా తరలించినట్లు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి అగ్నిమాపక కేంద్రం వెళ్లే సమాయానికే అక్కడ ఏమీ లేకుండా పోవటం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.
ప్రమాదం జరిగిన చాలా సమయం వరకు సమాచారం లేకపోవటంతో ముగ్గురూ తీవ్ర గాయాల పాలైనట్లు స్థానికులు అంటున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ప్రమాదం సంభవించగా 3 గంటల వరకు ప్రమాదం గురించి తెలియకపోవటం గమనార్హం. సాయంత్రం ఐదు గంటల సమయంలో సంఘటనా స్థలానికి వెళ్లిన అధికారులకు బాణసంచా కేంద్రం వద్ద ఎటువంటి అనవాళ్లు లేకపోవటం శోచనీయం. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తు చేయాలని స్థానికులు అంటున్నారు.
ఆదుకోవాలి
కుటుంబ పోషణకు నా కుమారుడు మందుగుండు తయారీ పనికి వెళ్లాడు. వైద్యులు విషమంగా ఉందని తెలిపారు. మా కుమారుడి కుటుంబాన్ని ఆదుకోవాలి.
– పల్లేటి భసవయ్య, క్షతగాత్రుడి తండ్రి
ప్రమాదం ఎలా జరిగిందంటే...వివరాలు సేకరించిన తహసీల్దార్
కరప (కాకినాడ రూరల్): కె.గంగవరంలో శుక్రవారం జరిగిన బాణసంచా పేలుడు ప్రమాదంలో గాయపడినవారందరూ కరప మండలం గొర్రిపూడి గ్రామస్తులని మండల కో ఆప్షన్ సభ్యుడు గండి వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రమాద బాధితులు కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలియడంతో ఆయన తహసీల్దార్ బూసి శ్రీదేవి, ఆర్‌ఐ కె.అనిల్‌కుమార్, వీఆర్వో పితాని సత్యనారాయణతో కలిసి ఆస్పత్రికి వెళ్లారు. తహసీల్దార్ బాధితులను ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. గంగవరంలోని బాణసంచా తయారీ కేంద్రంలో పని చేసేందుకు నెల రోజుల నుంచి వెళుతున్నారు. గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు కటకం తాతాజీ, పల్లేటి సత్తిబాబు, పలివెల రాజు, పలివెల శామ్యూల్, పలివెల సువర్ణరాజు, కటకం నాగేంద్ర శుక్రవారం కూడా పని చేయడానికి వెళ్లారు. అక్కడ డిస్కో చిచ్చుబుడ్డుల తయారీ పని చేస్తున్నారు. చిచ్చుబుడ్డులలో మందు గట్టిగా కూరాలంటూ తయారీ కేంద్రం నిర్వాహకుడు చెప్పడంతో వారు ఆ పని చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించింది. రోజుకూ రూ.700 కూలీ ఇస్తున్నారని, అందుకే ఈ పనికెళ్తున్నామని బాధితులు తహసీల్దార్ శ్రీదేవికి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment