మూడు నెలల తర్వాత మంత్రివర్గం భేటీ
హైదరాబాద్ : రాష్ట్ర విభజన ప్రకటన తర్వాత తొలిసారిగా మంత్రివర్గం భేటీ కానుంది. ఉదయం పదకొండున్నరకు సచివాలయంలో క్యాబినెట్ భేటీ జరగనుంది. ప్రాంతాల వారీగా మంత్రులు విడిపోయి ఉద్యమాల్లో పాల్గొంటున్న సమయంలో జరుగుతున్న మంత్రివర్గ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. విభజనకు ముఖ్యమంత్రి సహా అందరూ సహకరించాలని తెలంగాణ మంత్రులు కోరుతుంటే, .....కలిసి మాట్లాడుకుని పరిష్కరించుకుందామంటూ సీమాంధ్ర మంత్రులు క్యాబినెట్ వేదికగా కోరే అవకాశముంది.
విభజన ప్రకటనకు ముందు జులై నెలలో ఓ సారి మంత్రివర్గం కలిసింది. ఈసారి సమావేశానికి సుమారు నలభై అంశాలు, పరిపాలనా విషయాలతో అధికారులు ఎజెండాను సిద్దం చేసినట్లు సమాచారం. వివిధ సంస్థలకు భూ కేటాయింపులతో పాటు, కొన్ని శాఖలలో ఉద్యోగాల కల్పనను క్యాబినెట్ ఆమోదించనుంది. అయితే విభజన పరమైన రాజకీయ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశముంది.
ఈ నేపథ్యంలో జరుగుతున్న క్యాబినెట్ భేటీలో ఎలాంటి చర్చ జరుగుతుంది. అదే సమయంలో విభజనకు స్వయంగా ముఖ్యమంత్రే అడ్డుపడుతున్నాదని ఆరోపిస్తున్న టి మంత్రులు అందరూ మంత్రివర్గ సమావేశానికి వస్తారా..?? ఇక సమైక్య కోసం రాజీనామా లేఖలు ఇచ్చిన సీమాంధ్ర మంత్రులు అందరూ హాజరవుతారా.. అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.