చిన్ని కృష్ణుడిగా అమ్మవారు
సూర్య, చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించిన పద్మావతి అమ్మవారు
తిరుచానూరు: వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజైన మంగళవారం రాత్రి పద్మావతి అమ్మవారు చంద్రప్రభ వాహనంపై చిన్నికృష్ణుడి అలంకరణలో భక్తులను అనుగ్రహించారు. అమ్మవారిని వేకువనే మేల్కొల్పి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 8 గంటలకు పాండురంగడి అలంకరణలో అమ్మవారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం 12.30కి ఆలయంలో అమ్మవారికి స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 గంటలకు ఆస్థానమండపంలో ఊంజల్ సేవ జరిగాయి. సాయంత్రం 7 గంటలకు అమ్మవారిని వాహనమండపానికి తీసుకొచ్చి చంద్రప్రభ వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అమ్మవారిని ఒక చేతిలో వెన్నపాత్ర, మరో చేతిలో వెన్నముద్ద పెట్టుకున్న నవనీతకృష్ణునిగా అలంకరించారు. రాత్రి 8కి కోలాటాలు, భజన బృందాలు, మంగళవాయిద్యాలు, జియ్యర్ల ప్రబంధ పారాయణం మధ్య అమ్మవారు చంద్రప్రభపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దివ్యదర్శనం కల్పించారు.