ఫిబ్రవరి 29 వరకు పొడిగింపు
► అప్పటివరకు అభ్యంతరాలు, సూచనలు ఇవ్వొచ్చు
► పర్‌స్పెక్టివ్ ప్రణాళిక తుది ప్రణాళిక కాదు
► పది సదస్సులతో అభిప్రాయ సేకరణ
► ప్రకటన విడుదల చేసిన సీఆర్‌డీఏ కమిషనర్
► రైతుల ఆందోళనతో దిగివచ్చిన వైనం
విజయవాడ బ్యూరో : రాజధాని రీజియన్ ప్రణాళికలో ప్రతిపాదించిన వ్యవసాయ పరిరక్షణ జోన్లపై రైతుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. భారీగా అభ్యంతర పత్రాలు దాఖలవుతుండడం, అఖిలపక్షం, రైతు సంఘాలు ఈ నెల 25న సీఆర్‌డీఏ కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వడంతో ఆయా జోన్లను ప్రతిపాదించిన పర్‌స్పెక్టివ్ ప్రణాళిక (రీజియన్ ప్రణాళిక)పై సలహాలు, సూచనల స్వీకరణ గడువును ఫిబ్రవరి 29 వరకు పొడిగించింది. గత నెల 27న ఈ ప్రణాళికను ప్రకటించిన సీఆర్‌డీఏ జనవరి 25 వరకే సూచనలు, సలహాలు, అభ్యంతరాలు స్వీకరిస్తామని పబ్లిక్ నోటీసు జారీ చేసింది. ఈ ప్రణాళికలో పేర్కొన్న వ్యవసాయ పరిరక్షణ జోన్ల వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని ఆలస్యంగా గ్రహించిన కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులు ఎక్కడికక్కడ సమావేశమై ఆందోళన వ్యక్తం చేశారు. సీఆర్‌డీఏ కార్యాలయాలకు భారీగా తరలివెళ్లి తమ అభ్యంతర పత్రాలను దాఖలు చేస్తున్నారు. రైతు సంఘాలు, వైఎస్సార్‌సీపీ, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ తదితర పార్టీలన్నీ కలిసి అఖిలపక్షంగా ఏర్పడి రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహించి మాస్టర్‌ప్లాన్‌లో రైతులకు వ్యతిరేకంగా ఉన్న అంశాలను మార్చాలని, అభ్యంతరాల స్వీకరణ గడువు పొడిగించాలని డిమాండ్ చేశాయి. గురువారం సీఆర్‌డీఏ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించిన అఖిలపక్ష నాయకులు 25లోపు స్పందించకపోతే ఆరోజున సీఆర్‌డీఏ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఫిబ్రవరి 1 నుంచి సదస్సులు...
ఈ నేపథ్యంలో సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్ అభ్యంతరాల స్వీకరణ గడువు పెంచుతున్నట్లు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాజధాని ప్రాంతంలోని 56 మండలాల్లోని ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఫిబ్రవరి ఒకటి నుంచి 20 వరకు ముఖ్య ప్రదేశాల్లో పదిచోట్ల సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. సదస్సుల తేదీలు, వేదికలను త్వరలో వెల్లడిస్తామని, సదస్సుల్లో ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఏ ప్రాంతాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంటే అక్కడ మార్పులు చేస్తామని పేర్కొన్నారు.
గతంలో వీజీటీఎం ఉడా ప్రణాళిక అమలులో ఉన్న ప్రాంతాల్లో పర్‌స్పెక్టివ్ ప్రణాళిక వర్తించదని, గత ప్రణాళిక నిబంధనలే అమలవుతాయని తెలిపారు. వ్యవసాయ జోన్‌లోనూ రెసిడెన్షియల్, వాణిజ్య, పారిశ్రామిక అవసరాల మేరకు భూమిని వినియోగించుకోవచ్చని, వ్యవసాయ జోన్‌ను గ్రీన్‌బెల్ట్‌గా ఊహించుకుని ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. పర్‌స్పెక్టివ్ ప్రణాళికలో గుర్తించిన ఇన్నర్, అవుటర్ రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంట్లు కేవలం ప్రతిపాదనలేనని, ఫైనల్ కాదని పేర్కొన్నారు. వీటిపై సవివరమైన సాధ్యాసాధ్యాల నివేదిక వచ్చిన తర్వాతే ఎలైన్‌మెంట్లు ఖరారవుతాయని, ప్రణాళికలో సూచించిన అంశాలు అభివృద్ధికి మార్గదర్శకాలు మాత్రమేనని తెలిపారు. ప్రజాభిప్రాయం సేకరించిన తర్వాత ప్రజామోదంతోనే తుది ప్రణాళిక విడుదల చేస్తామని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
గ్రీన్‌జోన్ గడువు పెంపు
Published Sat, Jan 23 2016 3:02 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
Advertisement
Advertisement