పట్టాలెక్కిన ముంబయి రైలు
Published Tue, Feb 4 2014 12:55 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
సాక్షి, గుంటూరు :గుంటూరు డివిజన్ రైల్వే ప్రయాణికుల చిరకాల స్వప్నం నెరవేరింది. గుంటూరు నుంచి నేరుగా ముంబయి వెళ్లేందుకు వీలుగా సోమవారం కొత్త రైలు పట్టాలెక్కింది. వారంలో రెండు రోజుల పాటు గుంటూరు మీదుగా ముంబయి వెళ్లనుంది. సోమవారం ఉదయం 10 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరిన కాకినాడ-లోకమాన్యతిలక్ టెర్మినల్ ఎక్స్‌ప్రెస్ (17221) మధ్యాహ్నం 3.15 గంటలకు గుంటూరు చేరుకుంది.
గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు, రైల్వే అధికారులు ఈ ఎక్స్‌ప్రెస్‌కు పచ్చజెండా ఊపి ఘన స్వాగతం పలికారు. మొదటి ప్లాట్‌ఫాంపై ఆగిన ఈ బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్లను ఎంపీ పలకరించి వారికి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా జనరల్ కోచ్‌లోనికి ప్రవేశించి ప్రయాణికులకు ఎంపీ రాయపాటి స్వీట్లు పంచారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎంపీ వెంట కాంగ్రెస్ నాయకులు పిచ్చేశ్వరరావు, సూర్యదేవర రవికుమార్, సత్యంసింగ్, మోహన్, చంద్రశేఖర్, వాసు, ఏటుకూరి భాస్కర్, మంత్రి మస్తాన్‌రావులతో పాటు రైల్వే సీనియర్ డీసీఎం రామకృష్ణ, ఏసీఎం వెంకటేశన్, కమర్షియల్ ఇనస్పెక్టర్లు శ్రీనివాస్, స్టేషన్ మేనేజర్లు వీరాంజనేయులు, పాషా ఉన్నారు.
8 నుంచి వారానికి రెండు రోజులు..
గుంటూరు నగరం నుంచి ముంబయి వెళ్లేందుకు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలును మంజూరు చేయాలని ఎంపీ రాయపాటి పలుమార్లు రైల్వే ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఎట్టకేలకు రైల్వే అధికారులు బడ్జెట్‌లో ఇచ్చిన హామీ మేరకు ముంబయికి ప్రత్యేక రైలును వారంలో రెండు రోజులు (బుధ, శనివారాలు) గుంటూరు మీదగా నడిపేందుకు అంగీకరించారు. సోమవారం కాకినాడ నుంచి ముంబయికి బయలుదేరిన ఎక్స్‌ప్రెస్ 8వ తేదీ నుంచి ప్రతి బుధ, శనివారాల్లో గుంటూరు మీదగా నడుస్తుంది.
Advertisement
Advertisement