హోటళ్లకు రూ.2.25 లక్షల జరిమానా
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్:ప్రభుత్వ నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లపై నమోదైన కేసులను విచారించిన జాయింట్ కలెక్టర్ రామారావు రూ.2.25 లక్షలు జరిమానా విధిస్తూ తన కోర్టులో మంగళవారం తీర్పు ఇచ్చారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లు, కిరాణా దుకాణాలపై ఆహార భద్రతాధికారి ఎస్‌వీ వీరభద్రరావు నమోదు చేసిన కేసులను రెండు రోజుల పాటు జేసీ కోర్టులో విచారించారు. అనంతరం పై విధంగా జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఇటీవల జిల్లాలోని పలు దుకాణాలు, హోటళ్లపై ఆహార భద్రతాధికారి వీరభద్రరావు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. నమోదైన కేసుల నివేదికలను జేసీ పరిశీలించారు.
నాణ్యతా ప్రమాణాలు పాటించని నాలుగు హోటళ్లు, ఒక కిరాణా దుకాణదారునికి అపరాధ రుసుం విధించారు. ఎస్.కోటలోని హోటల్ ముంతాజ్‌లో పెరుగు తదితర పదార్ధాలు నాణ్యత లేకపోవడంతో కేసు నమోదు చేయగా రూ.50 వేలు జరిమానాను విధించారు. నెల్లిమర్లలోని మండాల బంగార్రాజు కిరాణా దుకాణంలో శనగపప్పు కల్తీ చేసి విక్రయిస్తుండగా కేసు నమోదు చేయగా రూ.50 వేలు జరిమానా విధించారు. విజయనగరంలోని హోటల్ మురళీకృష్ణలో నాసిరకమైన కందిపప్పు వినియోగిస్తున్నందుకు రూ.50 వేలు జరిమానా విధించారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న హోటల్ శ్రీమహాలక్ష్మిలో నాసిరకమైన పదార్ధాలను వినియోగదారులకు పెట్టినందుకు గుర్తించిన అధికారులు కేసు నమోదు చేయగా ఆ హోటల్ యజమానికి రూ.50 వేలు జరిమానా విధించారు. విజయనగరంలోని హోటల్ న్యూలేఖనలో పెరుగు తదితర భోజన పదార్ధాలను నాసిరకమైనవి పెట్టడంతో రూ.25 వేలు జరిమానా విధించారు.
కల్తీ చేస్తే రూ.10 లక్షల వరకు జరిమానా...
ఆహార పదార్ధాల కల్తీకి సంబంధించి కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ బి.రామారావు హెచ్చరించారు. నాసిరకం వస్తువులు విక్రయించడం ఉపేక్షించరాదని ఇటువంటి కేసులపై రూ.2 లక్షల నుంచి పది లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. ఇకపై ఇటువంటి కేసులపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. మరోసారి ఇటువంటి తప్పులు చేసి పట్టుబడితే అధిక మొత్తంలో జరిమానా విధిస్తామన్నారు. వినియోగదారులు నాసిరకం వస్తువుల సరఫరా, కల్తీ సరుకుల విక్రయూల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. వీటిని గుర్తిస్తే ఆహార భద్రతాధికారికిగానీ.. లేదా 9959994092 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయూలని సూచించారు. ఇకపై ఇటువంటి హొటళ్లు, కిరాణా షాపులు, నిత్యావసర దుకాణాలు, మార్కెట్లు, పాల విక్రయ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని జేసీ స్పష్టం చేశారు.