మంత్రి పి.నారాయణ
హైదరాబాద్: గుంటూరు - విజయవాడల మధ్యే రాష్ట్ర రాజధాని నిర్మిస్తామనరి తాము అనలేదని ఏపి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ అన్నారు. రాజధాని నిర్మించే ప్రాంతాన్ని సూచించడానికి కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసిన తరువాత నారాయణ విలేకరులతో మాట్లాడారు. శివరామకృష్ణన్ కమిటీ అడిగితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున తమ ఆలోచనలు చెప్పినట్లు తెలిపారు. గుంటూరు - కృష్ణా - పశ్చిమగోదావరి జిల్లాల ప్రాంతం రాష్ట్రానికి మధ్యలో ఉందని ఆయన వివరించారు. శివరామకృష్ణన్ కమిటీ కొన్ని ప్రతిపాదనలు సూచించిందని చెప్పారు. ప్రపంచంలోని ఉత్తమ రాజధానులను కమిటీ పరిశీలిస్తామని చెప్పినట్లు తెలిపారు. ఇస్లామాబాద్, పుత్రజయ, షాంఘై, మలేషియాలను ఉత్తమ రాజధానులుగా కమిటీ సూచించినట్లు చెప్పారు.
రైలు, రోడ్డు, వాయు రవాణా ఉండేవిధంగా రాజధాని నిర్మాణం ఉంటుందన్నారు. రాజ్‌భవన్, సచివాలయం నిర్మించేందుకు అనువైన ప్రదేశాల్లోనే రాజధాని నిర్మాణం ఉంటుదని తెలిపారు. మండలి, అసెంబ్లీ, కమిషనరేట్లు అన్నీ నిర్మించేందుకు అనువైన ప్రదేశంలోనే రాజధాని నిర్మాణం అని చెప్పారు. కర్నూలుకు ట్రిపుల్ ఐటీ, అనంతపురంకు ఎన్‌ఐటీ, తిరుపతికి ఐఐటీ కేటాయించినట్లు మంత్రి నారాయణ వివరించారు.
శివరామకృష్ణన్ కమిటీ ఇంకా 5 జిల్లాల్లో పర్యటించవలసి ఉందని తెలిపారు. వచ్చే నెల 20తేదీలోగా శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇస్తుందన్నారు. ఈ కమిటీ త్వరలో నెల్లూరు, విజయనగరం, శ్రీకాకుళం, కడప జిల్లాల్లో పర్యటిస్తుందని తెలిపారు.