పక్క ఫొటోలో ఉన్నది కుర్‌కురే ప్యాకెట్లు ఉన్న బస్తా. పౌష్టికాహారంగా పిల్లలకు పెడుతుంటారు. బస్తాను జాగ్రత్తగా గమనిస్తే 30-10-13న వీటిని తయారు చేసినట్లు, 30-12-13వరకు కాలపరిమితి ఉన్నట్లు కనిపిస్తుంది. కాలం చెల్లిన ఈ కుర్‌కురే ప్యాకెట్లను మైదుకూరులోని కొన్ని కేంద్రాలలో ఇప్పటికీ సరఫరా చేస్తున్నారు. వీటిని తింటున్న పిల్లలు వాంతులు చేసుకుని అనారోగ్యానికి గురవుతున్నారు. ఇంకో విషయం.. మైదుకూరులో డిసెంబర్ 2న అమృతహస్తం ప్రారంభించారు. అప్పటి నుంచి పాలు సరఫరా చేస్తున్నారు. ఇప్పటి వరకు పాలబిల్లులు చెల్లించలేదు. డిసెంబరు 13 నుంచి జనవరి 6 వరకు కోడిగుడ్ల సరఫరా ఆగిపోయింది. ప్రస్తుతం ఇస్తున్నారు. ఇవి చాలా చిన్నవిగా ఉన్నాయి.
సాక్షి, కడప: జిల్లాలో 3615 అంగన్‌వాడీ సెంటర్లు ఉన్నాయి. వీటిలో దాదాపు రెండు లక్షలమంది పిల్లలు ఉన్నారు. దాదాపు అన్ని సెంటర్లలో హాజరుపట్టీలోని సంఖ్యకు, పిల్లల హాజరుకు ఏ మాత్రం పొంతన ఉండటం లేదు. తప్పుడు పేర్లు, గ్రామాల్లో స్థానికంగా నివాసం లేని గర్భిణులు, పిల్లల పేర్లను కూడా చేరుస్తున్నారు. కొన్నిసెంటర్లకు కార్యకర్తలు హాజరుకావడం లేదు. ఆయాలు మాత్రమే సెంటర్‌ను నడిపిస్తున్నారు. పౌష్టికాహారం అందించడమే కాదు...సెంటర్‌కు వచ్చే పిల్లలు నెమ్మదిగా పాఠశాలలకు వెళ్లేలా చూడాల్సిన బాధ్యత కూడా వర్కర్లదే.
సమన్వయ లోపం:
అమృతహస్తం అమలయ్యే సెంటర్లలో పాలు, కూరగాయలకు సంబంధించిన డబ్బులను ఐకేపీ వీవోల అకౌంట్‌లలో జమ చేస్తున్నారు. తమకు సరిపడ పాలు, కూరగాయలు అందించడం లేదని అంగన్‌వాడీ వర్కర్లు ఆరోపిస్తున్నారు. వీరిద్దరి మధ్య సమన్వయలోపం చాలా సెంటర్ల పరిధిలో కనిపిస్తోంది. దీంతో పిల్లలు, గర్భిణీలకు అందాల్సిన పోషకాహారంలో కోత పడుతోంది.
ఇదేం పౌష్టికాహారం:
గతేడాది డిసెంబర్ 17 నుంచి పిల్లలకు రోజుకు 15గ్రాముల శనగలు పంపిణీ చేస్తున్నారు. 15గ్రాములంటే 5-7 గింజలు మాత్రమే వస్తాయి. డిసెంబర్ 30తో ఇది ఆగిపోయింది. అలాగే ప్రతి సెంటర్‌లో ఒక్కొక్క గర్భిణీకి 18గ్రాముల నూనె, 40 గ్రాముల కందిపప్పు, 120 గ్రాముల బియ్యం సరఫరా చేస్తున్నారు. ఈ లెక్కన నెలరోజులకు సరిపడా సరఫరా చేస్తున్నారు. ఇవి వారం రోజులకు కూడా సరిపోవని, వీటి ద్వారా ఏ మాత్రం పోషకవిలువలు వచ్చే పరిస్థితి లేదని గర్భిణీలు చెబుతున్నారు. నిజంగా పోషకాహారం అందించాలనుకుంటే నాణ్యమైన ఆహారం అందించాలని కోరుతున్నారు.
తక్షణ చర్యలు తీసుకుంటాం: లీలావతి, ప్రాజెక్టు డెరైక్టర్, స్త్రీ, శిశుసంక్షేమశాఖ.
మైదుకూరులో పాలబిల్లులు త్వరలోనే ఇస్తాం. కుర్‌కురే ప్యాకెట్లు ఏపీఫుడ్స్ నుంచి సరఫరా అవుతున్నాయి. కాలంచెల్లిన ప్యాకెట్లు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. చిన్నకోడిగుడ్లను ఎవరు సరఫరా చేస్తున్నారో పరిశీలిస్తాం. కార్యకర్తల హాజరు, హాజరుపట్టీలోని అవకతవకలను పరిశీలించి బాధ్యులైతే చర్యలు తీసుకుంటాం.
ఎర్రగుంట్లలోని వలసపల్లెరోడ్డులో ఉన్న అంగన్‌వాడీ సెంటర్‌కు గురువారం కార్యకర్త హాజరు కాలేదు. ఆయా మాత్రమే వచ్చారు. రాణివనం సెంటర్ తలుపులు మూసేశారు. చిలంకూరులోని 3వ నెంబరు సెంటర్‌లో కార్యకర్తతో పాటు ముగ్గురు పిల్లలే ఉన్నారు. ఇదేంటని అడిగితే భోజనం చేసి ఇంటికెళ్లారన్నారు. నాలుగో సెంటర్‌లో ఆయా మాత్రమే ఉంది. కార్యకర్త లేదు. పైన పేర్కొన్న నాలుగు సెంటర్లకు కనీసం బోర్డులు కూడా లేవు.
ఐఛీడీఎస్
Published Fri, Jan 10 2014 1:54 AM | Last Updated on Sat, Jun 2 2018 8:36 PM
Advertisement
Advertisement