అదనంగా 10వేల ఎంబీబీఎస్ సీట్లు
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం
ఒక్కో సీటుకు రూ.1.20 కోట్లు వ్యయం
70 శాతం నుంచి 90 శాతం నిధులివ్వనున్న కేంద్రం
ఈ ఏడాది ప్రతిపాదనలు పంపించింది ఏడు రాష్ట్రాలే
తెలుగు రాష్ట్రాల నుంచి అదనపు సీట్లకు ప్రతిపాదనలు లేవు
హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అదనంగా 10వేల ఎంబీబీఎస్ సీట్లను పెంచేందుకు కేంద్రం ముందుకొచ్చింది. 12వ పంచవర్ష ప్రణాళిక ముగింపు నాటికి ఈ సీట్ల పెంపు పూర్తవ్వాలనేది కేంద్రం లక్ష్యం. వీటికయ్యే ఖర్చును 70 శాతం తామే భరించడానికి కూడా కేంద్రం ఆమోదించింది. కేంద్ర ప్రాయోజిత పథకం కింద ఈ సీట్లకు నిధులిస్తారు. ఒక్కో ఎంబీబీఎస్ సీటుకు గరిష్టంగా రూ.1.20 కోట్లు ఖర్చవుతున్నట్టు కేంద్రం అంచనా వేసింది. ఇందులో ఆయా రాష్ట్రాలు 30 శాతం నిధులు ఇస్తే మిగతా 70 శాతం నిధులను కేంద్రం భరిస్తుంది. అదే స్పెషల్ స్టేటస్ ఉన్న రాష్ట్రాల్లో అయితే 90 శాతం నిధులు కేంద్రం భరిస్తే, 10 శాతం నిధులు మాత్రమే రాష్ట్రాలు భరించాలి. వచ్చే విద్యా సంవత్సరానికి ఈ సీట్ల ఏర్పాటు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఒక అధికారి పేర్కొన్నారు. తొలి దశలో కొన్ని రాష్ట్రాలకు అవకాశమిచ్చామని, ఈ ఏడాది మరికొన్ని రాష్ట్రాలకు అదనపు సీట్లు ఇస్తున్నట్టు తెలిపారు. అదనపు సీట్లను ఇవ్వడం వల్ల భవిష్యత్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకూ వైద్యుల కొరత లేకుండా చూడటమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. కొత్తగా ఎంబీబీఎస్ సీట్లకోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి ఈ ఏడాది ప్రతిపాదనలే పంపలేదు. ప్రతిపాదనలు పంపిన పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు, చత్తీస్‌గఢ్, జమ్ము అండ్ కాశ్మీర్, ఒడిశా, ఉత్తరాఖండ్‌లు పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్)ను ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది.
గరిష్టంగా సీట్లు తెచ్చుకున్నాం
- డా.వెంకటేష్, అదనపు వైద్యవిద్య సంచాలకులు, ఆంధ్రప్రదేశ్
2014-15 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌లో గరిష్టంగా సీట్లు తెచ్చుకున్నాం. చాలా కళాశాలల్లో 200 సీట్లకు చేరుకున్నాం. అనంతపురం వైద్య కళాశాలతోపాటు శ్రీకాకుళం, ఒంగోలు రిమ్స్ కళాశాలకు దరఖాస్తు చేయాల్సి ఉంది. కానీ ఆయా కళాశాలల్లో అదనపు సీట్లకు కావాల్సిన పరిస్థితులు లేవు. అందుకే ప్రతిపాదనలు పంపించలేదు.
కొత్త కళాశాలలకు ప్రతిపాదనలు పంపాం
- డా.పుట్టా శ్రీనివాస్, వైద్య విద్యా సంచాలకులు, తెలంగాణ
తెలంగాణలో ఉన్న మూడు కళాశాలలకు అదనపు సీట్లు వచ్చాయి. ఉస్మానియా, గాంధీ, ఎంజీఎం వరంగల్ కళాశాలలకు వచ్చాయి. నిజామాబాద్, ఆదిలాబాద్ రిమ్స్ ప్రతిపాదనలు పంపలేదు. అయితే జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటులో భాగంగా మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు ఇచ్చాం.
ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేసేందుకు జారీచేసిన మార్గదర్శకాలు ఇప్పటికున్న కళాశాలకే సీట్లు అవకాశం 50-100 సీట్లు, 150-200 సీట్లు, గరిష్టం గా 200- 250 సీట్లకు మాత్రమే అవకాశం. సీట్లను ఏ కళాశాలల్లో పెంచాలో కేంద్ర అధికారుల బృందమే నిర్ణయిస్తుంది.
ఆయా కళాశాలల్లో సీట్లను భారతీయ వైద్యమండలి నిబంధనలమేరకే పెంచుతారు. ఎంబీబీఎస్ సీట్లనుపెంచేందుకు కావాల్సిన మౌలిక వసతులు, పరికరాలు, సిబ్బంది నియామకం తదితర విషయాల్లోనూ కేంద్రం రాష్ట్రాలు నిధుల భాగస్వామ్యంతో వెళ్లాలి. కేంద్రం నుంచి వచ్చే నిధులు నాలుగు దఫాలుగా మంజూరు చేస్తుంది.