పాలమూరు వాసికి ఇన్ఫోసిస్ అవార్డు
ఐరాస మాజీ కార్యదర్శి కోఫీ అన్నన్ చేతుల మీదుగా ప్రదానం
కొల్లాపూర్ (మహబూబ్‌నగర్), న్యూస్‌లైన్: నానో టెక్నాలజీ రంగంలో విశేష కృషి చేస్తున్న మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన వలిపె రాంగోపాల్‌రావు ప్రతిష్టాత్మక ఇన్ఫోసిస్ అవార్డును అందుకున్నారు. శనివారం బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్ చేతుల మీదుగా రాంగోపాల్‌రావు ఈ అవార్డును అందుకున్నారు. తక్కువ ఖర్చుతోనే ఎక్కువ ఫలితాలనిచ్చే నానో టెక్నాలజీ పరికరాల ఆవిష్కరణలో ప్రతిభ చాటిన రాంగోపాల్‌రావుకు 2013లో ఈ అవార్డును ప్రకటించారు. అవార్డు కింద రూ. 55 ల క్షల నగదును కూడా అందజేశారు.
ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా 2005లో శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డును కూడా రాంగోపాల్‌రావు అందుకున్నారు. రూ. 100 ఖర్చుతోనే సొంతంగా గుండెజబ్బులను తెలుసుకునే ప్రత్యేక సెన్సర్‌ను ఆయన రూపొందించారు. పోలీసు జాగిలాల సహాయం లేకుండానే పేలుడుపదార్థాలను గుర్తించే ఈ-డాగ్ అనే సెన్సర్‌నూ ఆవిష్కరించారు. వ్యవసాయ పరంగా రైతులకు ఉపయుక్తంగా ఉండే పలు పరిశోధనలు కూడా కొనసాగిస్తున్నారు.