అమ్మ, నాన్నలైనా అందని ప్రోత్సాహకం
కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ఇంటా, బయటే కాదు ప్రభుత్వం నుంచి కూడా నిష్టూరాలే ఎదురవుతున్నాయి. ప్రోత్సాహకాలతో అండగా ఉంటాం అని భరోసా ఇచ్చిన సర్కారే మొండి చేయి చూపించడంతో నవ వధూవరులు కాస్తా అమ్మానాన్నలుగా మారినా ఆశించిన నగదు మాత్రం చేతికి అందలేదు. ఇదేమని ప్రశ్నించినా సంబంధితాధికారుల నుంచి నిర్లక్ష్యమే సమాధానమవుతోంది తప్ప సమస్య పరిష్కారం కావడం లేదు.
ఒంగోలు సెంట్రల్ : కులాలు, మతాలు కట్టుబాట్లను తెంచుకుని ఆదర్శ వివాహం చేసుకున్న జంటలకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం అందని ద్రాక్ష పండులా మారింది. ఈ జంటలకు ఇద్దరేసి పిల్లలు పుట్టిన తరువాత కూడా ప్రోత్సాహం అందటంలేదంటే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఎంతగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రోత్సాహ నగదును రూ. 50,000 పెంచుతున్నట్టు ప్రకటించినా ఆచరణలో మాత్రం నిధులు విడుదలకు ప్రభుత్వం చొరవ చూపించడం లేదన్న విమర్శలున్నాయి. కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ప్రభుత్వం మాత్రం ప్రతి సంవత్సరం కేవలం రూ. 20,000 మంజూరు చేసి చేతులు దులుపుకుంటోంది. గిరిజన సంక్షేమ శాఖకు 2006 నుంచి 15 మంది జంటలు దరఖాస్తులు చేసుకోగా కేవలం ఇద్దరికి మాత్రమే పాత జీఓ ప్రకారం ఒక్కొక్కరికి రూ. 10,000 చొప్పున పంపిణీ చేశారు. మరో ఇద్దరికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తాజాగా మరో జంట దరఖాస్తు చేసుకుంది. దీంతో పన్నెండు జంటలు కాళ్లరిగేలా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. వీరికి ఆరు లక్షల రూపాయలు ప్రోత్సాహకాల కింద చెల్లించాల్సి ఉంది.
పద్ధతి ఇలా...
వివాహ వయస్సు వచ్చిన అమ్మాయి, అబ్బాయి హిందూ వివాహ చట్టం ప్రకారం ఇష్ట పూర్వకంగా కులాంతర వివాహం చేసుకుంటే ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తుంది. ఇందుకు సంబంధించిన వివాహ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. ఎస్సీ,ఎస్టీలకి రూ.10 వేలు,బి.సిలకు రూ. 5 వేలు ప్రోత్సాహకంగా అందిస్తుంది. తాజాగా ఎస్సీ,ఎస్టీలకు రూ. 50 వేలు, బి.సిలకు రూ. 10 వేలుగా పారితోషకం పెంచారు. వివాహమై ఐదారు సంవత్సరాలు గడిచినా పిల్లలు పుట్టి, పెద్దవారైనా నేటికీ ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలు అండడంలేదు. సాధారణంగా ఈ ప్రోత్సాహకాలను గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాల్లో అందిస్తారు.
గిరిజన సంక్షేమ శాఖ అధికారి: జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎం. కమల
నిధులు విడుదలకాకపోవడంతో ఉన్నంత వరకూ లబ్ధిదారులకు విడుదల చేస్తున్నాం. దరఖాస్తు చేసుకున్న జంటల వివరాలు ఉన్నతాధికారులకు తెలియజేస్తాం.