ఓటర్ల జాబితా సక్రమంగా రూపొందించాలి
Published Sun, Dec 8 2013 1:04 AM | Last Updated on Wed, Sep 5 2018 3:24 PM
కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌లైన్ : పొరపాట్లకు తావులేకుండా ఓటర్ల జాబితాను రూపొందించాలని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి భన్వర్‌లాల్ ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఓటర్ల జాబితా సవరణపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014లో జరిగే పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల నేపథ్యంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటును నమోదు చేయించుకునేలా చూడాలన్నారు. ఈనెల 8, 15 తేదీలలోప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు నిర్వహించాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద బూత్ స్థాయి అధికారి విధిగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి పాల్గొన్న కలెక్టర్ నీతూ ప్రసాద్ మాట్లాడుతూ యువత ప్రతి ఒక్కరినీ ఓటర్లుగా నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో సమావేశాలు నిర్వహించి ఓటరు నమోదు ఫారాలను అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ముత్యాలరాజు, రంపచోడవరం సబ్ కలెక్టర్ గంధం చంద్రుడు, డీఆర్వో యాదగిరి, ఆర్డీవోలు జవహర్‌లాల్ నెహ్రూ, వేణుగోపాలరెడ్డి, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదులపై సకాలంలో స్పందించాలి
ఈ-పరిష్కారం కాల్ సెంటర్ ద్వారా డయల్ యువర్ జాయింట్ కలెక్టర్‌కు ప్రజల నుంచి వచ్చే వివిధ ఫిర్యాదులపై సకాలంలో స్పందించి పరిష్కార చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు. ఈ-పరిష్కారం టోల్ ఫ్రీ నంబర్ కాల్ సెంటర్ ద్వారా శనివారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకూ రెవెన్యూ, పౌరసరఫరాల శాఖల అంశాలపై కలెక్టరేట్ నుంచి డయల్ యువర్ జాయింట్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 26 మంది ఫోన్ చేసి సమస్యలు వివరించగా వాటికి సమాధానం ఇచ్చారు. వీటిలో అధికంగా గ్యాస్ వినియోగదారుల సమస్యలపై వచ్చాయి. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదు రికార్డు అవుతోందని, సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి యాదగిరి, డీఎస్‌వో రవికిరణ్, డీఎం గంగాధరకుమార్, ఏఎస్‌వోలు సురేష్, కృష్ణప్రసాద్, సూరపరాజు పాల్గొన్నారు.
Advertisement