యమపాశాలు
{పాణాలు తీస్తున్న విద్యుత్ తీగలు
అధికారుల లెక్కలకు మించి మరణాలు
మృతుల్లో అధికంగా అన్నదాతలు
ఆదాయంపైనే అధికారులు దృష్టి
విద్యుత్ తీగలు అమాయకుల ప్రాణాలు తీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) పరిధిలోని ఐదు జిల్లాల్లో గత ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ 96 మంది విద్యుత్ షాక్‌తో ప్రాణాలు వదిలారు. వీరిలో 65 మంది మరణాలకు విద్యుత్ శాఖ తప్పిదం లేదని అధికారులు తేల్చారు. మిగిలిన 31 మంది చనిపోవడానికి సంస్థ తప్పిదాలే కారణమనినిర్ధారించారు. ఇంత వరకూ వీరికుటుంబాల్లో 18 కుటుంబాలకు రూ.2లక్షలు చొప్పున పరిహారం అందించారు. వారసత్వ ధ్రువీకరణ పత్రం(లీగల్ హయర్) ఇవ్వని కారణంగా 13 కేసులు పెండింగ్‌లో ఉంచారు.
- సాక్షి, విశాఖపట్నం
నిజానికి విద్యుత్ షాక్‌తో జరిగే మరణాలన్నిటినీ తమ తప్పులుగా విద్యుత్ శాఖ ఒప్పుకోదు. ఎమ్మార్వో ధ్రువీకరణ పత్రం, వైద్యులు అందించే పోస్ట్‌మార్టం రిపోర్ట్, లీగల్ హయర్ అంటూ సవాలక్ష సర్టిఫికెట్లు తీసుకుని సంస్థ ఈ-సేవా కేంద్రంలో దరఖాస్తు చేయాలి. అన్నీ సక్రమంగా ఉంటే ఇదిగో అదిగో అంటూ బాధితులను అధికారులు తమ చుట్టూ తిప్పించుకుంటున్నారు. గ్రామీణులకు ఈ సర్టిఫికెట్ల గురించి పెద్దగా అవగాహన లేకపోవడంతో ప్రమాదం జరిగిన వెంటనే తగు ఏర్పాట్లు చేసుకోలేకపోతున్నారు. పోస్టుమార్టం చేయించాలని కూడా తెలియక వదిలేస్తున్నారు. దీంతో అన్ని మరణాలు రికార్డులకు ఎక్కడం లేదు.
సిబ్బంది నిర్లక్ష్యం : ఇటీవల సీఎం చంద్రబాబు విశాఖ నగరంలో పర్యటించినప్పడు దసపల్లా హిల్స్ దగ్గర అస్తవ్యస్త వైర్లతో నిండి ఉన్న విద్యుత్ స్తంభాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అక్కడ ఉన్న ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఆర్.ముత్యాలరాజును పిలిచి వెంటనే వైర్లు సరిచేయాల్సిందిగా ఆదేశించారు. ఇంత వరకూ అక్కడ పరిస్థితి అలాగే ఉంది. ఇలాంటి దృశ్యాలు నగరంలోనూ, గ్రామాల్లోనే కాదు జిల్లా అంతటా కనిపిస్తున్నాయి. భవనాల మీదుగా వెళుతున్న విద్యుత్ తీగలు చేతులకు తగులుతున్నాయి. వాటిని తాకి చిన్నపిల్లలు మృత్యువాత పడుతున్నారు. వైరింగ్, ఎర్తింగ్ విషయంలో విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల లో-ఓల్టేజ్, హై-ఓల్టేజ్‌లు ఏర్పడి గృహోపకరణాలు కాలిపోతున్నాయి. ఒక్కోసారి అవే ప్రాణాలు తీస్తున్నాయి.
అన్నదాతలే అధికం : విద్యుత్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోతున్న వారిలో రైతులు ఎక్కువగా ఉంటున్నారు. ఖరీఫ్, రబీ సీజన్‌లో సాగునీటి అవసరాలకు బోర్లను ఉపయోగించే రైతులు వేళాపాళా లేని విద్యుత్ సరఫరా వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వ్యవసాయానికి 9 గంటలు పగటి వేళ విద్యుత్ సరఫరా చేస్తామని ఎన్నికల ముందు టీడీపీ హామీ ఇచ్చినా నేటికీ అది నెరవేర్చలేదు. దీంతో రోజుకు 7గంటలే విద్యుత్ అందుతోంది. అది కూడా రెండు, మూడు విడతల్లో అందిస్తున్నారు. రాత్రి వేళ విద్యుత్ ఇస్తున్నారు. దీంతో రైతులు చీకట్లో పంట చేలల్లో బోర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఆ సమయంలో వైర్లు కనిపించక, స్విచ్‌లు సరిగ్గా లేక అన్నదాతలు మృత్యువాత పడుతున్నారు.