దళితుల భూములను అపాచీకి ధారాదత్తం చేసేందుకు అధికారులు, పాలకులు యత్నిస్తున్నారు. పేదలకు భూములిచ్చినట్టే ఇచ్చి పారిశ్రామివేత్తల ప్రాపకం కోసం లాగేసుకుంటున్నారు. దీంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే మాత్రం ఈ భూముల్లో 300 ఎకరాలు అపాచీకి కేటాయించినట్లు చెబుతుంటే.. అధికారులు పొంతన లేని ప్రకటనలు చేస్తుండటంతో లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు.
కొడవలూరు: మండలంలోని బొడ్డువారిపాళెం రెవెన్యూ పరిధిలో జాతీయ రహదారికి పక్కన ఉన్న సీజేఎఫ్‌ఎస్ భూమిని గతేడాదిలో 200 మంది దళితులకు పంపిణీ చేశారు. లబ్ధిదారుల్లో ఆ భూములకు ఆనుకునే ఉన్న చంద్రశేఖరపురం దళితవాడకు చెందిన వారు 70 మంది కాగా, దక్షిణ దళితవాడకు చెందిన వారు 130 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి 60 సెంట్ల భూమి వంతున పంపిణీ చేసి పట్టాలు కూడా ఇచ్చారు. ఆ సమయంలో వెంటనే సాగు ఆరంభించమని అధికారులు సూచించారు. ముస్లింల దైవకార్యక్రమమైన ‘ఇస్తిమా’కు ఆ స్థలం వినియోగించుకునేందుకు లబ్ధిదారులు అంగీకరించారు. ఆ సమయంలో ఎడగారు సాగు చేయలేకపోయారు. ఇపుడు రబీకి సిద్ధమయ్యేందుకు భూములు దున్నుతుండగా రెవెన్యూ అధికారులు అడ్డుకుని సాగు ఆపమని ఆదేశాలు జారీ చేశారు.
ఈ భూమిలో 300 ఎకరాలను అపాచీ షూ కంపెనీకి ఇస్తున్నట్లు జన్మభూమి కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రకటించారు. అయితే అక్కడుండేది 270 ఎకరాలు మాత్రమే. ఇందులో 132 ఎకరాలు దళితులకు పంపిణీ చేశారు. దీన్నిబట్టి దళితులకు ఇచ్చిన భూములు మొత్తం షూ కంపెనీకి ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. స్థానిక అధికారులేమో పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. సాగు ఆపమన్నది వాస్తవమేనని అయితే వారి భూములకు ఢోకా ఉండదంటున్నారు. షూ కంపెనీకి 150 ఎకరాలే ఇస్తున్నామని కూడా చెబుతున్నారు. నేతలు, అధికారుల పొంతన లేని సమాధానాలతో దళితుల్లో ఆందోళన నెలకొంది. మా భూములు పోతే మా పరిస్థితేమిటని లబోదిబోమంటున్నారు.
భూమి స్వరూపం ఇదీ..
చంద్రశేఖరపురం వద్ద 370 ఎకరాల సీజేఎఫ్‌ఎస్ భూములు ఉన్నాయి. వీటిలో 20 ఎకరాలను గిరిజన బాలికల గురుకుల కళాశాలకు కేటాయించగా ఆ స్థలంలో అది నడుస్తోంది. 20 ఎకరాలను రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు కేటాయించగా అక్కడ గిడ్డంగులు నిర్మించారు. ఇఫ్కో కర్మాగారానికి 5 ఎకరాలు ఇచ్చారు. జాతీయ రహదారి పనులకు గ్రావెల్ నిమిత్తం 35 ఎకరాల వరకు కేటాయించారు. మరో 20 ఎకరాల వరకు ప్రభుత్వ అవసరాలకు గ్రావెల్ తవ్వకాలు జరిగాయి. గ్రావెల్‌కు ఉపయోగించిన 55 ఎకరాల్లో 30 నుంచి 40 అడుగుల లోతులో భారీ గుంతలున్నందున ఆ భూములు వినియోగించలేని పరిస్థితి నెలకొంది. ఇకపోతే కేవలం 270 ఎకరాలు మాత్రమే నికరంగా ఉంది. ఆ స్థలంలో షూ కంపెనీ వస్తుందని పురపాలకశాఖ మంత్రి నారాయణ కూడా ప్రకటించారు.
చట్టం ఏంచెబుతోంది :
లబ్ధిదారులకు పంపిణీ చేసిన భూములు సీజేఎఫ్‌ఎస్ భూములైనందున లబ్ధిదారులు మూడేళ్ల పాటు సాగు చేయని పక్షంలో ఎలాంటి పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. కానీ దళితులకు గతేడాదిలోనే పంపిణీ చేసి ఉన్నందున ఆ విధంగానూ తీసుకోవడం దళితులను మోసం చేయడమే. సీజేఎఫ్‌ఎస్ భూముల్లో దళితులు పెట్టుబడి పెట్టి సాగు చేసి ఉంటే ప్రభుత్వ అవసరాలకు ఆ భూమి తీసుకుంటే వారి పెట్టుబడి తిరిగి ఇవ్వబడదని కూడా నిబంధనల్లో ఉంది. ఇదే జరిగితే దళితులు రోడ్డున పడే అవకాశం ఉంది.
దళితుల భూములు అపాచీకి ధారాదత్తం
Published Wed, Dec 3 2014 1:23 AM | Last Updated on Sat, Sep 2 2017 5:30 PM
Advertisement
Advertisement