ఆ నవ్వును బతికిద్ద్దాం... | majji Ganesh Cancer | Sakshi
Sakshi News home page

ఆ నవ్వును బతికిద్ద్దాం...

Published Fri, Jan 15 2016 12:12 AM | Last Updated on Sun, Sep 3 2017 3:41 PM

majji Ganesh Cancer

తొమ్మిదేళ్లు... కష్టాల గురించి కలలో కూడా తలవని వయసు... ఆనందం తప్ప లోకంలో
 ఇంకేమీ లేదని అనిపించే వయసు... భవిష్యత్‌పై బెంగ లేకుండా, గతం తాలూకు భయాలు
 లేకుండా హాయిగా నవ్వేసే ప్రాయం. కానీ గుర్ల మండలం గూడేం గ్రామానికి చెందిన ఓ
 తొమ్మిదేళ్ల కుర్రాడు అందరిలా గుండెల నిండా నవ్వలేకపోతున్నాడు. రేపటి గురించి కలలు
 కనలేకపోతున్నాడు. క్యాన్సర్ మహమ్మారితో నిత్యం యుద్ధం చేస్తున్నాడు. మరోవైపు ఆ
 కుటుంబం అహర్నిశలు ఆ బాలుడిని రక్షించడానికి ప్రయత్నిస్తోంది. అందుకు శక్తి సరిపోక
 కాసింత సాయం అడుగుతోంది. తండ్రి ఆలనకు నోచుకోని తన బిడ్డ పెదాలపై నవ్వును
 కాపాడేందుకు తనకు కాసింత చేయూతనివ్వాలని ఆ తల్లి కోరుతోంది.
 - గుర్ల
 
 గుర్ల మండలం గూడేం గ్రామానికి చెందిన మజ్జి గౌరి, సూర్యనారాయణల కుమారుడు మజ్జి గణేష్(9) క్యాన్సర్ బారిన పడి ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. ఈ కుర్రాడు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. కుర్రాడి తండ్రి సూర్యనారాయణ సరిగ్గా ఏడాది కిందట విద్యుదాఘాతానికి బలైపోయారు. అప్పటి నుంచి గణేష్ తల్లి గౌరి కూలీ నాలీ పనులు చేసుకుంటూ పిల్లలిద్దరినీ పోషిస్తున్నారు. గణేష్‌కు క్యాన్సర్ అని తెలిసినప్పటి నుంచి ఆ తల్లి కాళ్లు చేతులు ఆడడం లేదు. బిడ్డ వైద్య చికిత్స కోసం విజయనగరం కేంద్రాస్పత్రి, విశాఖపట్టణంలోని కింగ్‌జార్జి ఆస్పత్రిని ఆశ్రయించారు.
 
 అయితే ప్రభుత్వాస్పత్రిలో క్యాన్సర్‌కు తగిన చికిత్స లేకపోవడంతో ఆరోగ్యశ్రీ ద్వారా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గణేష్‌కు చికిత్సనందిస్తున్నారు. వైద్య చికిత్సలకయ్యే ఖర్చులను ప్రభుత్వం భరించిన్పటికీ ప్రయాణం, నివాసం తదితర వాటికి నానా అవస్థలు పడుతున్నారు. ఇన్ని ఇబ్బందుల మధ్య మరో బిడ్డ రమ్యను చదివించడం ఆ తల్లికి కష్టంగా మారుతోంది. ఈ మేరకు గ్రామ పెద్దలు వారిని వైద్యచికిత్స చేయించడంలో సహకరించినప్పటికీ ఆర్థికంగా ఇంకా వారు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. విజయనగరానికి చెందిన అమ్మా సేవాసొసైటీ ప్రతినిధి, నల్లచెరువు ప్రాథమిక ప్రధానోపాధ్యాయుడు అల్లం పురుషోత్తమరావు విద్యార్థి వైద్య చికిత్స కోసం తమ సొసైటీ నుంచి రూ. 5వేలును అందజేశారు.
 
 అలాగే మాజీ ఎంపీపీ వరదా ఈశ్వరరావు కూడా తన వంతు సాయమందించారు. అయితే విద్యార్థి కోసం ప్రతి పది రోజుకోసారి చికిత్స కోసం హైదరాబాద్‌కు వెళ్లడం అక్కడే పదిహేను రోజుల పాటు ఉండటంతో కుటుంబ పోషణ కష్టమవుతోంది. దాతలు స్పందించి గణేష్‌కు వైద్య చికిత్సల కోసం సహకరించాలని ఆ తల్లి కోరుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement