మాతాశిశు సంక్షేమంలోనూ కాసుల కక్కుర్తి | Matasisu equilibrium welfare groups | Sakshi
Sakshi News home page

మాతాశిశు సంక్షేమంలోనూ కాసుల కక్కుర్తి

Published Mon, Jan 27 2014 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM

మాతాశిశు సంక్షేమంలోనూ కాసుల కక్కుర్తి

మాతాశిశు సంక్షేమంలోనూ కాసుల కక్కుర్తి

  • గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అరకొరే
  •  అక్కరకు రాని అంగన్‌వాడీలు
  •  తల్లీబిడ్డల ఆరోగ్యానికి కనిపించని భరోసా
  •  
    మాతాశిశు సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు లోపభూయిష్టంగా మారాయి. ఫలితంగా తల్లీబిడ్డ క్షేమం ప్రశ్నార్థకమవుతోంది. ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చేందుకు గర్భిణులకు అందించే పౌష్టికాహారాన్ని సైతం అక్రమార్కులు బొక్కేస్తున్నారు. ఆరోగ్యశాఖ అందించాల్సిన వైద్య సేవల్లోనూ కాసుల కక్కుర్తి కొనసాగుతోంది. శిశుమరణాలు తగ్గించేందుకు ఆస్పత్రి కాన్పులను ప్రోత్సహిస్తూ బాలింతలకు అందించే రూ.1000 లోనూ కమీషన్ల కోతలు తప్పడం లేదు.
     
    సాక్షి, మచిలీపట్నం : తల్లీబిడ్డల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. గర్భిణులకు అందించే పౌష్టికాహారం దశలోనే అనేక అవకతవకలు జరుగుతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో పాటు గర్భిణులకు అందించే ఆహారం కూడా అరకొరగానే ఉంటోంది. దీంతో జిల్లాలో ఏటా వేలాదిమంది గర్భిణులు కష్టాల ప్రసవ వేదన అనుభవిస్తున్నారు.

    జిల్లాలో 3,556 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటి ద్వారా సుమారు 32 వేల 119 మంది గర్భిణులు, 32 వేల 560 మంది బాలింతలకు పౌష్టికాహారం అందించాల్సి ఉంది. మొత్తం 64 వేల 679 మందిలో ఒక్కొక్కరికి అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా నెలకు కిలో కందిపప్పు, మూడు కిలోల బియ్యం, వారానికి నాలుగు కోడిగుడ్లు, నెలకు 450 గ్రాముల ఆయిల్ ఇవ్వాల్సి ఉంది. మిగిలిన సరకులు అరకొరగా ఇస్తుండగా చాలా కేంద్రాల్లో గుడ్లు ఇవ్వడం లేదు. గతంలో ఇచ్చే పెసరపప్పు, గోధుమరవ్వ, బియ్యం, బెల్లం, ఆకు కూరలు వంటివి ఇవ్వడమే మానేశారు.
     
    దవాఖానాల్లోనూ దోపిడీయే...
     
    తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం వైద్య ఆరోగ్య శాఖ అందించాల్సిన సేవల్లోనూ కాసుల కక్కుర్తి తప్పడంలేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ గర్భిణులకు ధనుర్వాతం రాకుండా రెండు టీటీ ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉంది. జిల్లాలో కొన్నిచోట్ల టీటీ ఇంజక్షన్లు చేయాలని డబ్బులు వసూలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. గర్భిణులకు బలం కోసం 100 ఐరన్ మాత్రలు ఇవ్వాల్సి ఉండగా, అవి ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులో లేవు.. బయట కొనుక్కోండి అంటూ చీటీ రాసి చేతిలో పెడుతున్నారు. వారికి ఉచితంగా నిర్వహించాల్సిన రక్త, హెచ్‌ఐవీ తదితర పరీక్షలకు సైతం డబ్బులు దండుకుంటున్నారు. డబ్బులెందుకు ఇవ్వాలని అడిగితే అవే పరీక్షలు బయట ల్యాబరేటరీల్లో చేయించుకోమని రాసి ఇస్తున్నారు.
     
    ప్రోత్సాహకాల్లోనూ కోత...
     
    ఆస్పత్రి కాన్పులను ప్రోత్సహించేందుకు ఇచ్చే రూ.1000 సొమ్ము విషయంలోనూ కక్కుర్తికి పాల్పడుతున్నారు. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) నుంచి ఇచ్చే ఈ పారితోషికం గతంలో కాన్పు అయిన వెంటనే ఆయా ఆస్పత్రుల్లోనే నేరుగా ఇచ్చేవారు. నేరుగా నగదు పంపిణీ చేయడం వల్ల అక్రమాలు జరుగుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం ఆ తర్వాత చెక్కులు ఇస్తోంది. ఇటీవల గర్భిణుల పేరుతో బ్యాంకు ఖాతా తెరిపించి ప్రసవం అనంతరం బ్యాంకులో సొమ్ము జమ చేస్తోంది. ఖాతాలు తెరవడంలో వ్యయప్రయాసలకు గురవుతున్న గర్భిణుల నుంచి మాత్రం గ్రామస్థాయి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది రూ.100 నుంచి 200 వరకు వసూలు చేస్తుండటం బాధాకరం.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement