మేఘాల పల్లకిలోనా దిగివచ్చింది ఈ దేవకన్య | Migration Of Foreign Birds To Ichapuram In Rainy Season | Sakshi
Sakshi News home page

మేఘాల పల్లకిలోనా దిగివచ్చింది ఈ దేవకన్య

Published Sun, Jul 14 2019 7:45 AM | Last Updated on Sun, Jul 14 2019 7:45 AM

Migration Of  Foreign Birds To Ichapuram In Rainy Season - Sakshi

సాక్షి, ఇచ్ఛాపురం(శ్రీకాకుళం) : నేస్తాలు వచ్చేశాయి. మేఘాల పల్లకిపై ఉద్దానం వాకిటకు సంతానోత్పత్తి కోసం వేంచేశాయి. ఆడబిడ్డ పురుటి కోసం ఇంటికి వచ్చినంత సంబరంగా స్థానికులు ఈ పక్షి నేస్తాలను ఆహ్వానిస్తున్నారు. రెక్కల చప్పుడుతో చినుకులను వెంట తీసుకువచ్చే విహంగాల సంరక్షణ తమ బాధ్యతని చెబుతుంటారు. ఎక్కడో సుదూర తీరాన ఉన్న సైబీరియా నుంచి ఎగురుకుంటూ ఇచ్ఛాపురం మండలంలోని తేలుకుంచి వరకు ప్రయాణం చేసిన విహంగాలకు ఇక్కడ రెక్కలు విరిగిన వృక్షాలే స్వాగతమిచ్చాయి. గత ఏడాది వరకు తమ చేతులారా ఆహ్వానించిన వృక్ష రాజాలు నేడు మోడువారిన కాండాలనే పక్షి నేస్తాలకు ఆవాసాలుగా మలచనున్నాయి. పక్షుల సందడితో తేలుకుంచి పులకించిపోతోంది. 

కొమ్మకొమ్మకు పురిటి కేంద్రాలు
చెట్లపై కొమ్మలు, రెమ్మలు ఉంటే తప్ప గూడు ఏర్పాటు చేసుకోలేని ఈ పక్షులు గుడ్లు పెట్టేందుకు చెట్లనే ఆశ్రయిస్తుంటాయి. ఒక్కో పక్షి రెండు నుంచి ఆరు గుడ్లు వరకు పెడుతుంది. సుమారు 27 నుంచి 30 రోజుల వరకు తల్లి పక్షి గుడ్లను పొదుగుతుంది. పొదిగిన రోజు నుంచి 36 రోజుల పాటు ఆహారాన్ని తీసుకువచ్చి అందించి సంరక్షిస్తాయి. పిల్ల పక్షులు ఎగిరేంత వరకు తల్లి పక్షి లేదా మగ పక్షి గూళ్లో వీటికి కాపలాగా ఉంటాయి. 

ఆడపడుచుల్లా విదేశీ పక్షులు
శతాబ్దాల నుంచి వలస వచ్చే విదేశీ విహం గాలపై ఈ గ్రామస్తులు చూపిస్తున్న ఆదరాభిమానాలకు హద్దుల్లేవు. నిజానికి వాటిని పురుడు పోసుకునేందుకు వచ్చిన ఆడపడుచుల్లా భావిస్తారు. వాటితో విడదీయరాని అనుబంధం ఈ గ్రామస్తులతో పెనవేసుకుంది. రావాల్సిన సమయంలో పక్షులు గ్రామాని కి చేరకపోతే ఇక్కడ ప్రజలు ఆందోళన పడతారు.

ఏటా జూన్‌ మాసంలో ఈ పక్షుల రాకతోనే నైరుతి పవనాలు ఆరంభమవుతాయని గ్రామస్తుల నమ్మ కం. వీటి రాకతోను తమ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, పంటలు సమృద్ధిగా పండుతాయ ని గ్రామంలో ఉండే వృద్ధులు చెబుతుంటారు. తాము కూర్చున్న చోట, పక్కలో పక్షులు వాలుతాయే తప్ప ఎవ్వరికీ ఎలాంటి హాని చేయవని, వీటిని వేటగాళ్ల బారి నుంచి గ్రామస్తులమే రక్షిస్తుం టామని చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా పక్షులకు హాని తలపెట్టాలని చూస్తే గ్రామ కట్టుబాటు ప్రకారం ఆ వ్యక్తికి గుండు గీయించి ఊరేగిస్తామని హెచ్చరిస్తారు.

పక్షుల ప్రత్యేకతలు
ఏటా తొలకరి జల్లులు కురిసే జూన్‌ నెలలో సైబీరియా నుంచి వస్తున్న ఈ పక్షుల అసలు పేరు ఓపెన్‌ బిల్‌ స్టార్క్స్‌ (నత్తగొట్టు కొంగలు, చిల్లు ముక్కు కొంగలు) అంటారు. వీటి శాస్తీయ నామం ‘అనస్థోమస్‌’. ఈ పక్షులు తూర్పు–దక్షిణాసియా ఖండంలో ముఖ్యంగా భారతదేశం, శ్రీలంక నుంచి మొదలుకొని తూర్పు ప్రాంతంలో విస్తారంగా సంచరిస్తుంటాయి. వీటి జీవిత కాలం సుమారు 30 ఏళ్లు. బాగా ఎదిగిన పక్షి 81 సెంటీమీటర్ల పొడవు, 11 కిలోల బరువు ఉంటుంది. రెక్కలు విప్పారినప్పుడు 149 సెంటీ మీటర్ల వరకు ఉంటుంది.

దవడల మధ్యన (ముక్కు మధ్యలో) ఖాళీ ఉండటం వల్ల వీటిని ఓపెన్‌ బిల్‌ స్టార్క్స్‌ అని అంటారు. పగలంతా తంపర భూముల్లో, వరి చేలల్లో తారుగుతూ చేపలు, నత్తలు, కప్పలు, పురుగులు, ఆల్చిప్పలను ఆహారంగా ఈసుకుంటాయి. ఆరు నెలలు పాటు త మ పిల్లలతో గడిపిన పక్షులు పక్షి పిల్లలు ఎగిరేంత బలం రాగానే డిసెంబర్, జనవరి నెలల్లో తమ ప్రాంతాలకు పయనమవుతుంటాయి. 

సంరక్షణ గాలికి
పక్షులను సంరక్షించాల్సిన అటవీ, పర్యావరణ శాఖాధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో గాయాలపాలైన పక్షులకు ప్రథమ చికిత్స అందించిన అధికారులు అనంతరం వాటిని సంరక్షించాలన్న సంగతిని మరిచారు. గ్రామంలో చెట్లు పెంచా ల్సిన అటవీశాఖ సిబ్బంది జాడే లేకుండా పోయింది. ప్రత్యమ్నయంగా పక్షులు గూళ్లు పెట్టేందుకు ఏర్పాటు చేసిన ఇనుప టవర్‌ పంజరాలు అక్కరకు రాకుండా పోయాయి. ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ మూడేళ్ల కిందట పర్యాటక శాఖ అధికారులతో పర్యటించి రూ.25లక్షలతో సుమారు ఎకరా దేవదాయ భూమిలో పర్యాటక కేంద్రాన్ని నిర్మిస్తానంటూ ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదు. 

విహంగాలకు విడిది లేదు
సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న విహంగాలకు తేలు కుంచిలో విడిది లేని పరిస్థితి నెలకొంది. వరుస తిత్లీ, పైలాన్‌ తుఫాన్‌ తీవ్రతకు చెట్లు నేలకొరిగాయి. అంతే కాకుండా గత తిత్లీ తుఫాన్‌కు వందలాది పక్షులు మృత్యువాత పడ్డాయి. దీంతో ఏడాదికి వీటి సంఖ్య 30–40 శాతం తగ్గుముఖం పట్టా యి. ప్రస్తుతం పక్షులు గూళ్లు పెట్టేందుకు నానాపాట్లు పడుతున్నాయి.

చెట్లనే ఆవాసాలుగా ఏర్పాటు చేసుకునే ఈ పక్షులు ఉండేందుకు చెట్లు లేక గడ్డికుప్పలు, ఇళ్లపై, పంట పొలాల చాటున గూళ్లు పెట్టుకునేందుకు సిద్ధపడుతున్నాయి. రాత్రి సమయాల్లో విష పురుగుల బారిన పడి పక్షులు మృతి చెందుతున్నాయని స్థానికులు ఆవేద న వ్యక్తం చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement