సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘జిల్లాలో 1000కి పైగా బెల్ట్‌షాపులు ఉన్నాయి.. వీటి వల్ల మద్యం వినియోగం పెరిగి నేరాలు అధికమవుతున్నాయి.. జిల్లాలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు బెల్ట్‌షాపులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ క్రమంలో వచ్చేవారంలో ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి జిల్లావ్యాప్తంగా దాడులు నిర్వహించి బెల్ట్‌షాపులను తొలగిస్తాం. దీంతోపాటు సారా తయారీదారులపైనా చర్య తీసుకుంటాం. సారాబెల్లం విక్రయించే హోల్‌సేల్ వ్యాపారులపై కేసులు పెట్టే విషయం పరిశీలనలో ఉంది.’ అని ఎస్పీ ఆవుల వెంటక రంగనాథ్ చెప్పారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.
భూవివాదాలు సివిల్ పంచాయితీలు కాదని, ప్రతిదానిని సివిల్‌కు ముడి పెట్టి పెండింగ్‌లో ఉంచటం సరికాదని అన్నారు. ఫిర్యాదులోని తీవ్రత ఆధారంగా సివిల్ వివాదాలను కూడా కేసులుగా నమోదుచేస్తామని, ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు మాత్రమే సివిల్ కేసులు, మిగిలినవన్నీ మామూలు కేసులేనని చెప్పారు. జిల్లాలో ఎక్కువ కేసులు సివిల్ వివాదాల ముసుగులో పంచాయితీలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై సీరియస్‌గా స్పందిస్తామని తెలిపారు. ప్రతి వారం జరిగే ప్రజా దివస్‌లో ఎక్కువగా పోలీసుల తీరుపైనే ఫిర్యాదులు వస్తున్నాయని, ఫిర్యాదును విచారించి వాస్తవమని తేలితే శాఖాపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు దొంగతనాల నివారణకు చేపట్టిన చర్యలు, శాఖాపరంగా నిర్వహించబోయే నూతన కార్యక్రమాల గురించి వివరించారు. అవి ఆయన మాటల్లోనే...
పనిచేయకుంటే ఇంటికే....
సమర్థవంతంగా పనిచేయాలని ప్రతి పోలీసుకు రొటీన్‌గా చెబుతాం. అయినా పని చేయకుంటే ఎంతటివారైనా ఇంటికి వెళ్లక తప్పదు. శాంతిభద్రతల్ని పరిరక్షించటం, దొంగతనాలను తగ్గించటం రెండు ప్రధాన విధులు. వీటిలో ఏమాత్రం తేడా వచ్చినా మెమోలు, షోకాజ్‌లు కాదు.. నేరుగా సస్పెన్షన్లే ఉంటాయి. జిల్లాలో గడిచిన రెండు నెలలుగా దొంగతనాలు అధికంగా జరుగుతన్నాయి. వీటి నియంత్రణకు ప్రత్యేక కసరత్తు ప్రారంభించాం. ప్రతిస్టేషన్ పరిధిలో సీఐ నేత్రుత్వంలో ఐడీ పార్టీ పనిచేస్తుంది. దీంతోపాటు ఆయా స్టేషన్‌ల సీఐలు కూడా మఫ్టీలో తిరిగాలని ఇప్పటికే ప్రత్యేక ఆదేశాలు జారీ చేశాం. తద్వారా దొంగల్ని గుర్తించి అరెస్ట్ చేయటం కొంత మేరకు సులువు అవుతుందని దీనిని అమలులోకి తెచ్చాం. గతవారం క్రైం రివ్యూలో జిల్లాలో నేరాలు, దొంగతనాలపై సమీక్ష నిర్వహించాం. గతం కంటే దొంగతనాల కేసులు పూర్తి చేయటం, రికవరీల్లో కొంత పురోగతి ఉంది. స్టేషన్‌ల పరిధిలో దొంగతనాలు జరగకుండా రాత్రి గస్తీని రెట్టింపు చేయాలని సీఐలకు ఆదేశాలు ఇచ్చాం. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కేసుల సంఖ్య కొంతమేరకు తగ్గింది. గతంలో ప్రతి వివాదానికి ఈ చట్టాన్ని ఉపయోగించి ఫిర్యాదు చేసేవారు. ఇప్పుడు పోలీసులు సునిశిత పరిశీలనతో తగ్గింది. గతంలో ఎక్కువ భూతగాదాల్లో ఈచట్టం కింద ఫిర్యాదు చేయటంతో సమస్య జఠిలంగా మారేది. ఇప్పుడు ఆ పరిస్ధితి తగ్గింది.
ప్రజాదివస్‌లో....
ప్రజాదివస్ ద్వారా ప్రజలతో నేరుగా సమస్యలపై మాట్లాడే అవకాశం వస్తుంది. పోలీసుపరంగా ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్, ఐడీ పార్టీలు ఉన్నప్పటికీ ప్రజలను నేనే నేరుగా కలవటం వల్ల మరింతగా సమస్యపై అవగాహన రావటం, స్టేషన్‌కు వచ్చే బాధితునికి పూర్తిస్ధాయిలో న్యాయం జరుగుతుందా లేదా అని పర్యవేక్షించే ఆవకాశం కలుగుతోంది. దివస్‌లో ఎక్కువగా సీఐలు, ఎస్సైలపైనే ఫిర్యాదులు వస్తున్నాయి. కొన్ని కేసుల్లో పక్షపాతంగా వ్యవహరించటం, మరికొన్ని కేసుల్లో ప్రలోభాలకు లొంగుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. వీటన్నింటిని విచారిస్తున్నాం. ఆరోపణలు రుజువయితే చర్యలు తీసుకుంటాం. జిల్లాలో నిర్ణీత పదవీకాలం ముగిసిన సీఐలు నలుగురు ఉన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను అనుసరించి వారికి కొద్దిరోజుల్లోనే రేంజ్ పరిధిలో బదిలీలు ఉంటాయి.
మహిళా సమస్యలపై...
జిల్లాలో మహిళలకు సంబంధించిన సమస్యలపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. అలాగే తరుచూ లైంగికదాడులు ఇతర ఘటనలు జిల్లాలో చోటుచేసుకుంటున్నాయి. ఈక్రమంలో మహిళలు స్వీయరక్షణ పొందటానికి వారి కోసం రూపొందించిన చట్టాలపై అవగాహన కల్పించటానికి సదస్సు నిర్వహిస్తాం. పోలీసులతో పాటు మహిళా సంఘాలు, సైకాలజీ నిపుణులు, ఇతర నిపుణులు సదస్సులో పాల్గొంటారు. ముఖ్యంగా ఇటీవల చట్టంగా మారిన ‘నిర్భయ’పై అవగాహన కల్పిస్తాం.
‘బెల్ట్’పై ఉక్కుపాదం
Published Fri, Nov 15 2013 5:00 AM | Last Updated on Sat, Sep 2 2017 12:36 AM
Advertisement
Advertisement