ఎంఎల్‌ఎస్ @ మల్టీ లెవల్ స్కాం | Multi Level Scam at MLS | Sakshi
Sakshi News home page

ఎంఎల్‌ఎస్ @ మల్టీ లెవల్ స్కాం

Published Sat, Sep 12 2015 4:27 AM | Last Updated on Sun, Sep 3 2017 9:12 AM

ఎంఎల్‌ఎస్ @ మల్టీ లెవల్ స్కాం

ఎంఎల్‌ఎస్ @ మల్టీ లెవల్ స్కాం

ఎంఎల్‌ఎస్ పాయింట్.. అంటే మండల లెవల్ స్టాక్ పాయింట్. ప్రభుత్వం నుంచి వచ్చిన నిత్యావసరాలను రేషన్ డీలర్లకు సరఫరా చేసే కేంద్రమన్నమాట! డీలర్లు నెలనెలా ఇక్కడి నుంచే నిత్యావసరాలు తీసుకెళ్లి కార్డుదారులకు పంచుతారు. కొందరు అధికారులు ఎంఎల్‌ఎస్ పాయింట్ అర్థాన్ని ‘మల్టీ లెవల్ స్కాం’గా మార్చి డీలర్లను యథేచ్చగా దోచుకుంటున్నారు. ఇప్పటికే ఒకపక్క ఈ- పాస్ విధానంతో డీలర్ల పరిస్థితి నోట్లో పచ్చి వెలక్కాయపడ్డట్లు ఉండగా..
మరోపక్క ఎంఎల్‌ఎస్ పాయింట్ ఇన్‌చార్జి బలవంతపు దక్షిణ వారిని ఆర్థికంగా కుంగదీస్తోంది.
- టంగుటూరు ఎంఎల్‌ఎస్ పాయింట్ అర్థాన్నే మార్చిన అధికారులు
- అన్ని నిత్యావసరాల్లో కోత విధించి సరఫరా చేస్తున్న గోడోన్ ఇన్‌చార్జి
- ప్రశ్నించిన డీలర్లకు గోడౌన్ ఇన్‌చార్జితో సయోధ్య కుదిర్చిన అక్రమార్కుడు
- ఇప్పటికే ఈ-పాస్ విధానంతో ఆర్థిక వెసులుబాటు కోల్పోయి డీలా పడిన డీలర్లు
టంగుటూరు :
రేషన్ బియ్యం పంపిణీలో జరిగిన సమూల మార్పులతో డీలర్ల అవినీతికి చెక్ పడగా గోడౌన్ ఇన్‌చార్జి దోపిడీ యథావిధిగా కొనసాగుతోంది. ఒక పక్క అదనపు ఆదాయం లేక డీలాపడిన డీలర్లు.. గోడౌన్ ఇన్‌చార్జి దోపిడీతో విలవిల్లాడుతున్నారు. తెల్లరేషన్ కార్డుదారులకు అందించే బియ్యం పంపిణీలో ప్రభుత్వం సమూల మార్పులు చేసింది. ప్రతి రేషన్ షాపునకు ఈ-పాస్ మిషన్లు, ఈ-పాస్ కాటా సరఫరా చేసింది. డీలర్లు వాటి ద్వారే బియ్యంతో పాటు ఇతర నిత్యావసరాలు పేదలకు పంపిణీ చేయాల్సి ఉంది. జిల్లాలో ఈ-పాస్ విధానం ఇప్పటికే సగం గ్రామాల్లో అమలు చేస్తుండగా మరో నెల్లో అన్ని గ్రామాలకు విస్తరించనుంది.

ఇప్పటికే రేషన్‌కార్డుల వివరాలు లబ్ధిదారుల ఆధార్‌తో అనుసంధానం చేశారు. కార్డులోని ప్రతి వ్యక్తి వివరాలు ఆధార్ నంబర్లకు అనుసంధానం చే శారు. ఈ-పాస్ విధానంతో ప్రతి షాపు వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. ప్రతి నెలా రేషన్‌షాపులకు గోడౌన్ నుంచి సరఫరా అయ్యే నిత్యావసరాల వివరాలన్నీ అన్‌లైన్‌లో ఉంటాయి. వీటి వివరాలు ఎప్పటికప్పుడు పౌరసరఫరాలశాఖ అధికారులు చూసుకునే వెసులుబాటు ఉంది. రేషన్‌షాపులన్నింటినీ అధికారులు తమ కార్యాలయంలో కూర్చొని ఆపరేట్ చేయగల అవకాశం ఉంది. ఈ మొత్తం నేపథ్యంలో డీలర్ల అక్రమాలకు అడ్డుకట్ట పడ్డట్టయింది.
 
ఎంఎల్‌ఎస్ పాయింట్‌లోనిలువు దోపిడీ
మండల కేంద్రం టంగుటూరులో ఎంఎల్‌ఎస్ పాయింట్ (మండల లెవల్ స్టాకు పాయింట్) ఉంది. ఈ పాయింట్ నుంచే టంగుటూరుతో పాటు జరుగుమల్లి, కొండపి మండలాలకు బియ్యం, ఇతర సరుకులు సరఫరా అవుతాయి. టంగుటూరు మండలంలో 48 రేషన్ షాపులు, కొండపిలో 30, జరుగుమల్లి మండలంలో 21 షాపుల చొప్పున ఉన్నాయి. డీలర్లను దోచుకునేందుకు ఎంఎల్‌ఎస్ పాయింట్ కేంద్ర బిందువుగా మారింది. సెప్టెంబర్ కోటా కింద మూడు మండలాలకు కలిపి 615 టన్నుల బియ్యం అలాట్‌మెంట్ జరిగింది.

అంటే కేజీల్లో చూస్తే 6.15 లక్షల కేజీలు. ఇవి 50 కేజీల బ స్తాల్లోకి మారిస్తే 12,300 బస్తాలు. ఈ 12,300 బస్తాల్లో బస్తాకు అరకేజీ వంతున గూడౌన్ ఇన్‌చార్జి దోచుకుంటున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం కేజీ బియ్యం ధర రూ.27లు. ఒక్క నెలలోనే గోడౌన్ ఇన్‌చార్జి దోపిడీ రూ.లక్షలో ఉంది. ఈ-పాస్ విధానంతో రెవెన్యూ అధికారుల మామూళ్ల బెడద తొలగిపోగా గోడౌన్ ఇన్‌చార్జి దోపీడీ పోలేదని డీలర్లు వాపోతున్నారు. ఇటీవల బియ్యం త గ్గించేందుకు డీలర్ల అంగీకరించకపోవడంతో బియ్యం అక్రమ వ్యాపారంలో రాటు దేలిన డీలర్ ఒకరు మధ్యవర్తిగా వ్యవహరించి ఈ సారికి పాత పద్ధతినే అవలంబించాలని ఇన్‌చార్జి-డీలర్ల మధ్య సయోధ్య కుదిర్చినట్లు సమాచారం.
 
గోడౌన్ ఇన్‌చార్జి దక్షిణ..బస్తాకు అరకేజీ!
ఈ-పాస్ విధానం, అన్‌లైన్ పద్ధతులతో అవినీతికి అవకాశాలు సన్నగిల్లి దిగాలు పడిన డీలర్లను గోడౌన్ ఇన్‌చార్జి యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. ప్రతి కట్ట బియ్యాని(50 కేజీలు)కి అరకేజీ తగ్గించి డీలర్లకు సరఫరా చేస్తున్నారు. ఈ దోపిడీ ఎంతో కాలంగా కొనసాగుతోంది. పట్టించుకునే దిక్కు లేదు. ఉదాహరణకు ఒక డీలర్‌కు 100 కట్టలు పంపిస్తుంటే అందులో కట్ట తగ్గిస్తారు. ఈ భారం డీలర్ భరించాల్సిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement