సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడికి అధికారమే పరమావధిగా మారిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అధికారం నిలబెట్టుకోడానికి రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేశారని విమర్శించారు. అనంతపురం, కడప, కర్నూలు, నరసారావుపేట బీజేపీ బూత్ లెవల్ కార్యకర్తలతో ఆదివారం నమో యాప్ ద్వారా మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై పార్టీ కేడర్‌కి దిశానిర్దేశం చేశారు. మోదీ మాట్లాడుతూ.. చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. సొంత మామను రెండుసార్లు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి నుంచి ఇంతకంటే ఏం ఆశించగలమని ఆయన వ్యాఖ్యానించారు.
అధికారం కోసం కాంగ్రెస్ కాళ్లపై చంద్రబాబు సాగిలపడ్డారని విమర్శించారు. ముఖ్యమంత్రిగా ఘోరంగా విఫలమైన చంద్రబాబు... దేశానికి ప్రధాని కావాలని పగటి కలలు కంటున్నారని మోదీ ఎద్దేవా చేశారు. కొడుకుని పైకి తీసుకురావడానికి, అవినీతితో రాష్ట్రం అస్తమయ దశకు చేరినా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఎన్టీఆర్ విలువలను కాలరాసిన చంద్రబాబుని చిత్తు చిత్తుగా ఓడించినప్పుడే తెలుగుప్రజల ఆత్మగౌరవం నిలబడుతుందని మోదీ పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment