ఫుల్లుగా తాగారు
డిసెంబర్ 31న జిల్లాలో రూ.7 కోట్ల మేర విక్రయాలు
నగరంలో అత్యధికంగా రూ.3 కోట్ల వ్యాపారం
నూతన సంవత్సరానికి ఘనస్వాగతం పలికిన మందుబాబులు
విజయవాడ : డిసెంబర్ 31వ తేదీన జిల్లాలోని మందుబాబులు రికార్డు స్థాయి లో తాగేశారు. ఎన్నడూ లేని విధంగా నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ఒక్కరోజులోనే రూ.7కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ మొత్తంలో రూ.3కోట్ల విలువైన మద్యం నగరంలోనే విక్రయించారు. సాధారణంగా మూడు రోజుల్లో విక్రయించే మద్యం డిసెంబర్ 31న ఒక్క రోజులోనే అయిపోయింది. దీంతో ఎక్సైజ్ శాఖకు ఆదాయం భారీగా పెరగటంతోపాటు ప్రతి మద్యం షాపులోనూ అధిక ధరలకు విక్రయించడంతో వ్యాపారులకు కూడా లాభాలు వచ్చాయి. జిల్లాలో 20 ఎక్సైజ్ సర్కిళ్లు ఉన్నాయి. వీటి పరిధిలో 301 మద్యం షాపులు, 156 బార్లు ఉన్నాయి. గత ఏడాది జూలై ఒకటో తేదీ నుంచి కొత్త మద్యం లెసైన్స్‌ల కాలపరిమితి ప్రారంభమైంది. నెలకు సగటున రూ.100 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. వ్యాపారులు, అధికారులకు మధ్య కుదిరిన ఒప్పందం మేరకు క్వార్టర్ సీసాకు ఐదు రూపాయలు చొప్పున అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని అన్ని మద్యం షాపులు, బార్లలో రూ.3 కోట్లు, వారాంతాల్లో రూ.4 కోట్ల వరకు విక్రయాలు జరుగుతుంటాయి. అయితే, నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ డిసెంబర్ 31న జిల్లా వ్యాప్తంగా భారీగా పార్టీలు ఏర్పాటుచేశారు. అక్కడ మద్యం తాగడం సాధారణ విషయంగా మారింది. స్నేహితులు కలిసి పెద్దఎత్తున మద్యం కొనుగోలు చేశారు. దీంతో ఒక్క రోజులోనే రూ.7కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలకు అనుమతివ్వడం కూడా వ్యాపారులకు కలిసివచ్చింది.
ముందుగానే నిల్వలు
నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని మద్యం వ్యాపారులు గత నెల 27వ తేదీ నుంచే సరుకు కొనుగోలు చేసి నిల్వ ఉంచారు. మరోవైపు 31వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా మద్యం డిపోల నుంచి వ్యాపారులు భారీగా కొనుగోలుచేశారు. విజయవాడ ఎక్సైజ్ డివిజన్‌లో అత్యధికంగా రూ.5.2 కోట్ల విలువైన 12,986 కేసుల మద్యం విక్రయించారు. మచిలీపట్నం డివిజన్‌లో సుమారు రూ.2 కోట్ల విలువైన 5వేల కేసుల మద్యం విక్రయాలు జరిగాయి. ఇవి అధికారికంగా డిసెంబర్ 27 నుంచి 31 మధ్య జరిగిన విక్రయాలు మాత్రమే. అప్పటికే షాపుల్లో ఉన్న స్టాక్ కూడా సుమారు రూ.50 లక్షల వరకు విక్రయించినట్లు సమాచారం.
నగరంలో రూ.3కోట్లకు పైగా వ్యాపారం
విజయవాడ ఎక్సైజ్ డివిజన్‌లో వ్యాపారులు కొనుగోలు చేసిన మద్యంలో 70 శాతం నగరంలో విక్రయించారు. జిల్లావ్యాప్తంగా జరిగిన విక్రయాల్లో కూడా 40 శాతం నగరంలోనే అమ్మినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2013 డిసెంబర్ నెలలో రూ.92 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. 2014లో మాత్రం రూ.102 కోట్ల మద్యం విక్రయించారు. మద్యం విక్రయాలు గతేడాది కన్నా పెరిగాయని ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్ జి.జోసఫ్ ‘సాక్షి’కి తెలిపారు. జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా ముగిశాయని, ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని చెప్పారు.