భయమెందుకు? | NHRC state police questioning on the encounter shesachalam | Sakshi
Sakshi News home page

భయమెందుకు?

Published Fri, Apr 24 2015 2:24 AM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM

భయమెందుకు? - Sakshi

భయమెందుకు?

తప్పు చేయనప్పుడు విచారణకు ఎందుకు జంకుతున్నారు
శేషాచలం ఎన్‌కౌంటర్‌పై రాష్ట్ర పోలీసుల్ని ప్రశ్నించిన ఎన్‌హెచ్‌ఆర్సీ

ఘటనలో పాల్గొన్న పోలీసులు, అటవీ అధికారుల వివరాలెందుకు ఇవ్వలేదని నిలదీత
ఘటనాస్థలికి ప్రత్యేక కమిటీని పంపాలని కమిషన్ నిర్ణయం

 
హైదరాబాద్: శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్ ఘటనలో తప్పు చేశామన్న భయం లేనప్పుడు ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌తో మెజిస్టీరియల్ విచారణ చేయించకుండా రెవెన్యూ అధికారులతో ఎందుకు చేయిస్తున్నారని జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్‌ఆర్సీ) రాష్ట్ర పోలీసు అధికారులను సూటిగా ప్రశ్నించింది. ఇలాంటి ఘటనల్లో ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌తోనే విచారణ చేయించాలన్న నిబంధనను ఎందుకు పట్టించుకోలేదని నిలదీసింది. తక్షణం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఎన్‌హెచ్‌ఆర్సీ చైర్మన్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలోని ఫుల్‌బెంచ్ శేషాచలం ఎన్‌కౌంటర్ ఘటనలపై గురువారం గంటన్నరకుపైగా విచారించింది. కమిషన్‌లో జస్టిస్ డి.మురుగేశన్, జస్టిస్ సి.జోసెఫ్‌లతోపాటు సభ్యుడు ఎస్సీ సిన్హా విచారణలో పాల్గొన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న అటవీ-పోలీసు అధికారుల పూర్తి వివరాలు ఈ నెల 22లోపు సమర్పించాలంటూ 13న జారీచేసిన ఆదేశాలను ప్రస్తావించిన కమిషన్.. ఇప్పటివరకు ఎందుకు పట్టించుకోలేదని తప్పుపట్టింది. ఈ ఘటనపై సంబంధిత వివరాలను ఎక్కడా వెల్లడించవద్దని హైకోర్టు ఆదేశించిందని పోలీసు విభాగం అదనపు డీజీ(లీగల్) వినయ్ రంజన్ రే, డీజీపీ కార్యాలయం ప్రధాన న్యాయసలహాదారు ఎం.నాగరఘు కమిషన్ ముందు చెప్పారు.

మెజిస్టీరియల్ విచారణకు ప్రభుత్వం ఆదేశించాల్సి ఉంటుందని అన్నారు. హైకోర్టు ఉత్తర్వుల్ని పరిశీలించిన కమిషన్ తామడిగిన వివరాలివ్వడంలో న్యాయస్థానానికి అభ్యంతరం లేదని, మీరే ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. ‘‘ఘటన తెల్లవారుజామున జరిగితే ప్రాథమిక సమాచార నివేదిక(ఎఫ్‌ఐఆర్)ను మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఎందుకు నమోదు చేయలేదు? కూలీల దాడిలో గాయపడిన టాస్క్‌ఫోర్స్ పోలీసులను ఆరోజు ఉదయం 11 గంటలకే.. అది కూడా ఎఫ్‌ఐఆర్ లేకుండానే తీసుకెళ్లారా? ఎఫ్‌ఐఆర్ నమోదుకు పోలీస్‌స్టేషన్ పరిధి విషయంలో గందరగోళం తలెత్తినప్పుడు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి.. తర్వాత బదిలీ చేసుకునే అవకాశాన్ని ఎందుకు పట్టించుకోలేదు?’’ అని కమిషన్ పోలీసు అధికారుల్ని ప్రశ్నించింది.

ఘటనాస్థలికి ప్రత్యేక కమిటీ...: శేషాచలంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి వారం రోజుల్లోగా కమిషన్‌ద్వారా ప్రత్యేక కమిటీని ఘటనాస్థలికి పంపాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ నిర్ణయించింది. ఈ కమిటీ ఘటనాస్థలిని సందర్శించిన అనంతరం రెండు వారాల్లోగా నివేదిక సమర్పిస్తుందని పేర్కొంది. పోలీసు అధికారులు రెండువారాల్లోగా ఉదంతానికి సంబంధించిన జనరల్ డైరీ ఎంట్రీ, అధికారుల వాహనాల కదలికలకు సంబంధించిన లాగ్‌బుక్, మృతదేహల పోస్టుమార్టం, రీ-పోస్టుమార్టం నివేదికలు, వైర్‌లెస్ కమ్యూనికేషన్ వివరాలు, ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న అధికారుల పేర్లు, సెల్‌ఫోన్ నంబర్లు, వినియోగించిన ఆయుధాల వివరాలు, పోలీసులకైన గాయాల వివరాలు, హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం నమోదు చేసిన 302 కేసు ఎఫ్‌ఐఆర్ కాపీలను తమ ముందుంచాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా ఈ ఘటనపై వివరిస్తూ ఆరో తేదీ అర్ధరాత్రి(ఇంటర్వెన్షన్ నైట్ ఆఫ్ 6/7) అని అదనపు డీజీ వినయ్ రంజన్‌రే పేర్కొనగా, మృతుల తరఫున హాజరైన స్వచ్ఛంద సంస్థ పీపుల్స్‌వాచ్‌కు చెందిన హెన్రీ టొమంగో.. ‘పోలీసు రికార్డుల ప్రకారం ఎన్‌కౌంటర్ ఏడో తేదీ తెల్లవారుజామున జరిగినట్లు ఉంది. ఇప్పుడు అధికారులు నోరు జారి అసలు విషయం చెప్పారు. కూలీలను ఒకచోట అదుపులోకి తీసుకుని మరోచోట చిత్రహింసలకు గురిచేసి, విచక్షణారహితంగా కాల్చి చంపారనడానికి ఇది బలాన్నిస్తోంది’’ అని ఆరోపించారు.
 
ఎన్‌కౌంటర్ చేయించింది చంద్రబాబే: హెన్రీ

ఏప్రిల్ 6న ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తిరుపతిలో పర్యటించారు. ఆ రోజు ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు, పోలీసు ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు. ఎన్‌కౌంటర్ చేస్తేనే ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేయవచ్చునంటూ సీఎం వారికి సూచనలిచ్చారు. ఆ ఒత్తిడి మేరకు ఆరోతేదీ సాయంత్రం తమిళ కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకుని.. హింసించి, కాల్చిచంపారు. కూలీల్ని పోలీసులు హత్య చేయడానికి ప్రధాన కారకుడు చంద్రబాబే. ఇదే అంశాన్ని ఎన్‌హెచ్‌ఆర్సీ దృష్టికి తీసుకెళ్లా. చంద్రబాబు 6న తిరుపతిలో ఉన్నారో లేదో.. సంబంధిత రికార్డుల ద్వారా పరిశీలించాలని కోరా. చంద్రబాబుపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేయాలి.    - హెన్రీ టొమంగో, హ్యూమన్ రైట్స్ ఫోరమ్-పీపుల్స్‌వాచ్ ప్రతినిధి
 
ఏం చేసినా చెల్లుతుందనే..

జస్టిస్ వెంకటాచలయ్య నేతృత్వంలో ఎన్‌హెచ్‌ఆర్సీ కమిషన్ 1996లో హైదరాబాద్‌కు వచ్చినప్పుడు.. ఏపీలో ఎన్‌కౌంటర్‌ల అంశాన్ని లేవనెత్తాం. అరెస్టు చేసి, హింసించాక పిట్టల్ని కాల్చినట్లు కాల్చి చంపుతున్నారని చెప్పాం. మా వాదనతో ఏకీభవించిన కమిషన్.. ఎన్‌కౌంటర్ జరిగితే అందులో పాల్గొన్న పోలీసులపై 302 సెక్షన్ కింద కేసు పెట్టి.. స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను ఏపీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇదే అలుసుగా పోలీసులు ఇష్టారాజ్యంగా ఎన్‌కౌంటర్‌లు చేస్తూ మానవహక్కుల్ని ఉల్లంఘిస్తున్నారు. మానవహక్కుల్ని ఉల్లంఘించే వారికి గుణపాఠం చెప్పాలని కమిషన్‌ను కోరాం.
 - జీవన్‌కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ హ్యూమన్ రైట్స్ ఫోరమ్
 
నిబంధనల మేరకే దర్యాప్తు

ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్నాక నిబంధనల మేరకే కేసు దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పుడు ఈ కేసు దర్యాప్తును హైకోర్టు స్వయంగా పర్యవేక్షిస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు వివరాలను వెల్లడించలేం. ఇదే అంశాన్ని కమిషన్‌కు చెప్పాం.
 - ఆర్‌పీ ఠాకూర్, అదనపు డీజీ(శాంతిభద్రతలు)
 
కాల్చిచంపారని  భావించవచ్చా?
 
‘‘ఈ ఘటన జాతీయస్థాయిలో సంచలనమైంది. అనేక స్వచ్ఛంద సంస్థలు, మానవ హక్కుల సంఘాలు కూలీలను పట్టుకుని కాల్చి చంపారని ఆరోపిస్తున్నాయి. దీనిపై పోలీసులవైపు నుంచి స్పందన లేదంటే... మీపై వస్తున్న ఆరోపణలు నిజమేనని భావించవచ్చా?’’ అని కమిషన్ ప్రశ్నించింది. ‘‘ఈ ఘటనలో పోలీసులకైన గాయాల వివరాలెందుకు ఇవ్వలేదు? వారిలో ఒక్కరికైనా తూటా గాయాలయ్యాయా?’’ అని నిలదీసింది. మొత్తం 11 మందికి గాయాలయ్యాయని, వీరిలో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయని పోలీసులు చెప్పారు. తీవ్రగాయాలంటే ఏంటో వివరాలు సమర్పించాలని కమిషన్ ఆదేశించింది. ఎన్‌కౌంటర్ జరగడానికి ముందు-ఆ తర్వాత  టాస్క్‌ఫోర్స్ అధికారులకు సంబంధించిన వైర్‌లెస్ కమ్యూనికేషన్ అంశాలనూ తమ ముందుంచాలంది. ప్రత్యక్ష సాక్షులు శేఖర్, బాలానందన్, ఎం.ఇలాంగోలను తమిళనాడులో న్యాయమూర్తి సమక్షంలో 164 స్టేట్‌మెంట్ రికార్డుకు ప్రయత్నాలు చేయాలని పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement