జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యం
జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యం
సాక్షి, నరసరావుపేట
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే మనందరి లక్ష్యమని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి అన్నారు. పట్టణంలోని పెరల్స్ కల్యాణ మండపంలో శుక్రవారం జరిగిన అసెంబ్లీ నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశానికి పట్టణ కన్వీనర్ ఎస్‌ఏ హనీఫ్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా అయోధ్యరామిరెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని భావించి దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యవసాయానికి పెద్దపీట వేశారన్నారు. ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ పథకాల ద్వారా నిరుపేద కుటుంబాలకు సైతం లబ్ధిచేకూర్చిన ఘనత మహానేత వైఎస్‌కే దక్కిందన్నారు. రాజన్న పాలన తిరిగి తేవాలంటే అది ఒక్క వైఎస్ జగన్‌కే సాధ్యమని చెప్పారు. క్రమశిక్షణ, మనోస్థైర్యం, స్పూర్తినిచ్చే జగన్‌మోహన్‌రెడ్డి లాంటి నాయకుడున్న వైఎస్సార్ సీపీలో పనిచేస్తున్న మనమంతా గర్వపడాలన్నారు. వ్యాపార రంగాన్ని ఎంచుకున్న తాను రాజకీయాల్లోకి వస్తానని కలలో కూడా ఊహించలేదని, నీతి, నిజాయితీ, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలిచేందుకు ఇబ్బందులను ఎదిరించి వచ్చానని వివరించారు. జగన్‌కు అండగా నిలిచిన తమవంటి వారిపై సీబీఐ, ఈడీ వంటి అనేక కేసులు పెట్టినా భయపడకుండా జగన్‌మోహన్‌రెడ్డి వెంటే నడిచేందుకు నిర్ణయించుకున్నామన్నారు. నరసరావుపేటను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని, రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచేలా చేస్తానన్నారు. ఇక్కడి నాయకులు బాంబులెస్తారట... పిస్టల్‌తో పేలుస్తారట... ఈ ఉడత ఊపులకు బెదిరేది లేదని, కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
= వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ నాయకులు వైఎస్ జగన్‌ను నేరుగా ఎదుర్కోలేక ఆయనపై అసత్య ప్రచారాలకు దిగుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తనపై ఉన్న సీబీఐ కేసు నుంచి బయటపడేందుకు సోనియా కాళ్లు పట్టుకొని కేసులు ఎత్తివేయించుకున్నారని విమర్శించారు. వైఎస్సార్ సీపీకి అండగా ఉన్న కార్యకర్తలంతా మరో మూడు నెల లు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.
= అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తలే కొండంత బలమని, పార్టీకి ఓట్లు ఉన్నాయని వాటిని బూత్‌ల దాకా తీసుకొచ్చి ఓటు వేయించగలిగితే భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. డాక్టర్ కదా మెత్తగా ఉన్నాడులే అని భావిస్తే పొరపాటేనని, ఎన్నికల్లో దేనికైనా తాను సిద్ధమంటూ కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఆ ఓటు మురిగిపోయినట్లేనని, కాంగ్రెస్ పూర్తిగా మట్టికరుచుకు పోయిందన్నారు.
= వైఎస్సార్ సీపీ జిల్లా ఎన్నికల పరిశీలకులు గుదిబండి చినవెంకటరెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రజలపై చూపే ఆప్యాయత ప్రతిపక్షాలకు అహంకారంలా కనిపిస్తుందా అంటూ ప్రశ్నించారు. అమ్మఒడి పథకం ద్వారా రాష్ట్రంలో ప్రతిపేద విద్యార్థి చదువుకునే అవకాశం జగన్‌మోహన్‌రెడ్డి కల్పిస్తారని చెప్పారు. కార్యకర్తలు వైఎస్ జగన్‌కు కొండంత అండ అని, ప్రజల అండ ఉన్న నాయకుడిని ఎవరూ ఏమి చేయలే రన్నారు. తొలుత పట్టణంలోని బీసీ కాలనీ నుంచి కల్యాణ మండపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో ఆళ్ళ పేరిరెడ్డి, మైనార్టీ విభాగం జిల్లా కన్వీనర్ సయ్యద్ మాబు, డాక్టర్ గజ్జల పరమేశ్వరరెడ్డి, జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ గానుగపంట ఉత్తమ్‌రెడ్డి, నరసరావుపేట, రొంపిచర్ల మండల కన్వీనర్లు శంకర్‌యాదవ్, పిల్లి ఓబుల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.