పేదోడి గుండెపై పెద్ద బండ | Patients are not geting arogyasri treatments at free of cost | Sakshi
Sakshi News home page

పేదోడి గుండెపై పెద్ద బండ

Published Wed, Nov 22 2017 4:40 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

Patients are not geting arogyasri treatments at free of cost - Sakshi - Sakshi

నా బిడ్డ కోసం అష్టకష్టాలు

‘‘నా కుమారుడి పేరు విష్ణువర్దన్‌. ఆరేళ్ల వయసు. ఐదేళ్ల కిందటే థలసీమియా వ్యాధి వచ్చింది. ప్రతినెలా రక్తం మార్పించాల్సిందే. గతంలో హైదరాబాద్‌లో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా రక్తమార్పిడి చేసేవాళ్లు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఎత్తేశారు, ఉచితంగా చికిత్స చెయ్య లేమని హాస్పిటల్‌ వాళ్లు చెబుతున్నారు. ప్రతినెలా హైదరాబాద్‌కు వెళ్లి సొంత డబ్బులతో రక్తమార్పిడి చేయిస్తున్నాం. కొడుకును బతికించుకునేం దుకు అష్టకష్టాలు పడుతున్నాం. హైదరాబాద్‌లో ఏపీ ప్రజలకు ఆరోగ్యశ్రీని ఎత్తేయ డంతో చాలామంది థలసీమియా బాధితులు తల్లడిల్లుతున్నారు. ఈ ప్రభుత్వానికి చేతులెత్తి మొక్కుతున్నా హైదరాబాద్‌లో ఆరోగ్యశ్రీని అమలు చేయాలి’’
– అరవ నరసింహులు, ఆదోని, కర్నూలు జిల్లా


సాక్షి, అమరావతి: పుష్పలీల, సుబ్బారావు, గౌస్‌బాషా లాంటి బాధితులు రాష్ట్రంలో వేలాది మంది ఉన్నారు. సొంత రాష్ట్రంలో వైద్య సదుపాయాలు లేక, హైదరాబాద్‌లోని ప్రముఖ ఆసుపత్రులకు వెళ్దామంటే ఆరోగ్యశ్రీ పథకం వర్తించక, తమ కష్టం ఎవరికి చెప్పుకోవాలో తెలియక తల్లడిల్లుతున్నారు. ఏపీ ప్రజలకు ఆరోగ్యశ్రీ హైదరాబాద్‌లో వర్తించదంటూ రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల క్రితం తీసుకున్న అడ్డగోలు నిర్ణయం వేలాది కుటుంబాలను దుఃఖసాగరంలో ముంచుతోంది. గుండె జబ్బులు, కేన్సర్‌ వ్యాధులున్న పద్దెనిమిదేళ్ల లోపు వారికి మాత్రమే హైదరాబాద్‌లో ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందుతుందని, మిగతా 1,042 వ్యాధులకు ఈ పథకం వర్తించదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తేల్చేసింది. ఈ నిర్ణయం పేద రోగుల పాలిట పిడుగుపాటులా మారింది. 

రాష్ట్రంలో నాణ్యమైన వైద్య సేవలు కరువే 
హైదరాబాద్‌లో చికిత్సల కోసం వెళ్తున్న రోగులు నిరాశతో వెనుతిరిగి వస్తున్న దృశ్యాలు నిత్యం కనిపిస్తున్నాయి. అధిక శాతం వైద్య చికిత్సలు హైదరాబాద్‌లోనే లభ్యమవుతున్నాయని, ఆంధ్రప్రదేశ్‌లో పలు జబ్బులకు ఇప్పటికీ స్పెషలిస్టులే లేరని బాధితులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ పథకంలో హైదరాబాద్‌లోని మరిన్ని ఆసుపత్రులను చేర్చాల్సింది పోయి వైద్యమే లేకుండా చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిడ్నీ, న్యూరో(నరాల జబ్బులు), గుండె, కాలేయం, మూత్రపిండాల జబ్బులకు ఏపీలో నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో లేవని అంటున్నారు. 

బధిరులకు కోలుకోలేని దెబ్బ
పుట్టుకతోనే మూగ, చెవుడు (బధిరులు) బాధితులు మరింత వేదనకు గురవుతున్నారు. ఆరోగ్యశ్రీ కింద ఆరున్నర లక్షల రూపాయల ఆపరేషన్‌ చేయించుకోవచ్చు. తెలంగాణలో వాసవి, అపోలో ఆసుపత్రుల్లో బధిరులకు ఆపరేషన్లు చేసేవారు. సర్కారు నిర్ణయంతో తెలంగాణలో వైద్యానికి ఏపీ బధిరులు అనర్హులుగా మారారు. ఇక ఉన్నది గుంటూరులోని బయ్యా శ్రీనివాసరావు ఆసుపత్రి ఒక్కటే. నెలకు ఒకటి కంటే ఎక్కువ కేసులు తీసుకోవద్దని ఈ ఆసుపత్రిని ఆదేశించినట్లు సమాచారం. దీంతో బధిరుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.  

నిధులు మిగుల్చుకునేందుకు కక్కుర్తి చర్యలు 
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రుల ఒత్తిళ్లతోపాటు నిధులు మిగుల్చుకునేందుకే ప్రభుత్వం హైదరాబాద్‌లో వైద్యానికి కత్తెర వేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆసుపత్రుల యాజమాన్యాలు సంబంధిత మంత్రిపై ఒత్తిడి పెంచడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కర్ణాటక, తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాలు తమ వద్ద లేని వైద్య సేవలను ఇతర రాష్ట్రాల్లో పొందడానికి అనుమతి ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆ సౌకర్యాన్ని ఎత్తేశారు. కనీసం నిమ్స్‌లో అయినా వైద్యానికి అనుమతి ఇవ్వాలని కోరగా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఓ అధికారి వాపోయారు. 

ఏపీలో స్పెషలిస్టులేరీ?
హైదరాబాద్‌లో గత మూడు దశాబ్దాలుగా ప్రైవేట్‌ ఆసుపత్రులు శరవేగంగా అభివృద్ధి చెందాయి. ప్రపంచస్థాయి అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. చికిత్సల కోసం విదేశాల నుంచి కూడా రోగులు వస్తుంటారు. హైదరాబాద్‌లో లభించే చాలా వైద్య చికిత్సలు ఆంధ్రప్రదేశ్‌లో లభ్యం కావడం లేదు. ఏపీలో ప్రభుత్వ పరిధిలో క్యాన్సర్‌ ఆసుపత్రులే లేవు. ఏపీలోని ప్రైవేట్‌ హాస్పిటళ్లలో గుండె, మూత్రపిండాలు, కాలేయం, న్యూరో, గ్యాస్ట్రో ఎంటరాలజీ, హెమటాలజీ, ఆంకాలజీ విభాగాల్లో స్పెషలిస్టులు లేరు. రాష్ట్రంలో ఎవరికైనా ప్రమాదకరమైన జబ్బులు సోకితే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు వెళ్తుండేవారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా చికిత్స పొందేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేయాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం అందులో భాగంగా హైదరాబాద్‌లో ఈ పథకం కింద వైద్యాన్ని తొలగించిందని నిపుణులు పేర్కొంటున్నారు. 

హైదరాబాద్‌లో కర్ణాటక ఆరోగ్యశ్రీ అమలు 
కర్ణాటక రోగులు హైదరాబాద్‌లోని ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్సలు చేయించుకుంటున్నారు. తమ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ కింద ఈ వైద్య సేవలు పొందుతున్నారు. కర్ణాటక ప్రభుత్వం హైదరాబాద్‌ నాంపల్లిలోని కేర్‌ హాస్పిటల్, గచ్చిబౌలిలోని సిటిజెన్స్‌ ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకుంది. తమ రాష్ట్రానికి చెందిన రోగులను ఆయా ఆసుపత్రులకు పంపిస్తోంది. ఇదిలా ఉండగా కర్ణాటక సర్కారు బకాయిలను కూడా ఎప్పటికప్పుడు సక్రమంగా చెల్లిస్తోందని ఆసుపత్రుల వర్గాలు తెలిపాయి.  

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన పుష్పలీలకు ప్రాణాంతకమైన క్యాన్సర్‌ వ్యాధి సోకింది. ఆమెకు ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారు. వైద్య చికిత్స కోసం హైదరాబాద్‌లోని ‘నిమ్స్‌’కు వెళ్లగా రూ.2.60 లక్షలు ఖర్చవుతుందన్నారు. దీంతో పుష్పలీల పిఠాపురం ఎమ్మెల్యే నుంచి సిఫార్సు లేఖ తీసుకెళ్లింది. ఆ లేఖను చూపించగా నిమ్స్‌ అధికారులు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు హైదరాబాద్‌లో ఆరోగ్యశ్రీ పథకం వర్తించదు, ఎమ్మెల్యేలు లేఖలు ఇస్తే చెల్లదమ్మా అన్నారు. ఆ తర్వాత రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడిని కలిస్తే ఆయన కూడా సిఫార్సు లేఖ ఇచ్చారు. ఆ లేఖను నిమ్స్‌ అధికారులకు చూపించగా... ‘‘అమ్మా.. ఇక్కడ ఏపీ ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసేసిన విషయం వాళ్లకు కూడా తెలుసు. అయినా లేఖలు ఇస్తున్నారు. అవి చెల్లవు. చికిత్స కోసం డబ్బులు కట్టాల్సిందే’’ అని తేల్చిచెప్పారు. దీంతో బాధితురాలు ప్రాణాలు నిలబెట్టుకునేందుకు తన ఇల్లు అమ్మేసింది. ప్రస్తుతం నిమ్స్‌లోని ఆర్థోపెడిక్‌ ఫీమేల్‌ వార్డులో(4వ వార్డు) చికిత్స పొందుతోంది.

తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం కరకుదురు గ్రామానికి చెందిన కె.సుబ్బారావు మెదడులో కణతులు రావడంతో కాకినాడ పెద్దాసుపత్రికి వెళ్లాడు. కణతిని తొలగించాలంటే ఇక్కడ వసతులు లేవని వైద్యులు బదులిచ్చారు. దాంతో కాకినాడలోనే మరో ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ కూడా ఈ ఆపరేషన్‌కు కావాల్సిన పరికరాలు, డాక్టర్లు లేరని, హైదరాబాద్‌లోని నిమ్స్‌కు గానీ, మరేదైనా కార్పొరేట్‌ ఆసుపత్రికి వెళ్లాలని సలహా ఇచ్చారు. చేసేది లేక సుబ్బారావు హైదరాబాద్‌లోని నిమ్స్‌ వైద్యులను సంప్రదించాడు. వైద్యం ఉంది గానీ ఆరోగ్యశ్రీ పథకం వర్తించదని చెప్పారు. ఇక ఏం చేయాలో, ఎక్కడికెళ్లాలో తెలియక సుబ్బారావు తలపట్టుకుంటున్నాడు. 

కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గం సంజామల గ్రామానికి చెందిన గౌస్‌బాషా ఈ నెల 7వ తేదీన హైదరాబాద్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళితే ఆంధ్రప్రదేశ్‌ రోగులకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయడం కుదరదన్నారు. గౌస్‌బాషా ప్రస్తుతం ప్రైవేట్‌ ఆసుపత్రిలో సొంత ఖర్చుతో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటిదాకా రూ.లక్షకు పైగానే ఖర్చయిందని భోరున విలపించాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement