సాక్షి, విజయవాడ: గత టీడీపీ పాలనలో ప్రచారార్భాటమే తప్ప.. ప్రజలకు సంక్షేమ ఫలాలు ఇవ్వలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఆదివారం వైఎస్సార్‌సీపీ విజయవాడ పార్లమెంట్ జిల్లా, నగర బీసీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు ఫూలే, దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహాల ఆవిష్కరణ సభలో పెద్దిరెడ్డితో పాటు మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, శంకర్ నారాయణ, ఎమ్మెల్యేలు జోగి రమేష్, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, వైఎస్సార్‌సీపీ నగర అర్బన్ అధ్యక్షులు బొప్పన భవకుమార్, తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ఏలూరు బీసీ డిక్లరేషన్ సభలో చెప్పిన విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మాట నిలుపుకున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారని చెప్పారు. టీడీపీకి వెన్నెముక లంటూ బీసీలను చంద్రబాబు కేవలం ప్రచార్భాటానికే వాడుకున్నారని మండిపడ్డారు. బీసీలకు వైఎస్ జగన్ చేసిన విధంగా చంద్రబాబు చేశారా అని ప్రశ్నించారు. బీసీలకు సీఎం జగన్ పెద్దపీట వేశారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. కృష్ణ లంక లోని ప్రజల ఇళ్ళ పట్టాలు సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.
తండ్రి బాటలో జగన్ నడుస్తున్నారు..
విద్యకు ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి ఫూలే అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. సీఎం వైఎస్ జగన్..విద్యను పటిష్టం చేసేలా పాఠశాల దశ నుంచే చర్యలు చేపట్టారన్నారు. పేదల బిడ్డల చదువుకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పెట్టిన ఘనత వైఎస్సార్‌ది అని.. ఆయన తనయుడు వైఎస్ జగన్ ఆయన బాటలోనే నడుస్తూ ఫూలే ఆశయాలను నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు.
ఆ ఘనత ఆయనకే దక్కుతుంది..
ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీలకు క్యాబినెట్‌లో 60 శాతం మంత్రి పదవులు ఇచ్చి సీఎం జగన్ తన చిత్తశుద్ధిని నిలుపుకున్నారని మంత్రి శంకర్ నారాయణ అన్నారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. 2024లో మళ్లీ సీఎం జగన్‌ను ముఖ్యమంత్రి చేసుకునేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆదర్శనీయుడు జ్యోతిరావు ఫూలే..
బడుగు, బలహీన వర్గాల ప్రజలకు జ్యోతిరావు ఫూలే ఆదర్శనీయుడని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. అధికారికంగా ఫూలే వర్ధంతిని నిర్వహించిన ఘనత వైఎస్ జగన్‌దేనన్నారు. అణగారిన వర్గాలకు సీఎం 50 శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు.
సీఎం జగన్ సామాజిక న్యాయం చేశారు..
ఇద్దరు మహానుభావుల విగ్రహాలను ఆవిష్కరించడం శుభపరిణామం అని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. బడుగు బలహీన వర్గాలకు సామాజిక స్ఫూర్తి నింపిన వ్యక్తి ఫూలే అని పేర్కొన్నారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీలకు వైఎస్సార్ పెద్దపీట వేశారని.. ఆయన మరణంతో ఆగిన గుండెల్లో అత్యధికులు ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకే చెందిన వారేనని తెలిపారు. సచివాలయ వ్యవస్థ ద్వారా సీఎం జగన్ సామాజిక న్యాయం చేశారన్నారు. 60 శాతం ఉద్యోగాలు ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ వర్గాలకే వచ్చాయని చెప్పారు. రాష్ట్రంలో జ్యోతిరావు ఫూలే స్మృతివనం ఏర్పాటు చేయాలని జంగా కృష్ణమూర్తి ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment