పెట్రో పిడుగు
విజయనగరం కంటోన్మెంట్ : రైలు ప్రయాణ ఛార్జీలు పెరిగి వారం కూడా గడవకముందే కేంద్రప్రభుత్వ సూచనలతో పెట్రో ధరలు కూడా భగ్గుమన్నాయి. పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుతూ సోమవారం రాత్రి ఆయిల్ కంపెనీలు పెట్రోల్ బంక్‌లకు ఉత్తర్వులు విడుదల చేశాయి. పెరిగిన ధరలు, పన్నులెంత వసూలు చేయాలనే సూచనలున్న మెసేజ్‌లు పంపాయి. ఈ ధరల పెంపు సోమవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వస్తున్నాయని ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. పెట్రో ధరల పెంపు వల్ల జిల్లా వాసులు నెలకు రూ. అరకోటికి పైగా భారాన్ని మోయాల్సి వస్తోంది.
పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వల్ల సమాంతరంగా రవాణా ఛార్జీలు పెరిగి నిత్యావసరాల ధరలు, ఇతర ప్రయాణ ఛార్జీలు పెరిగి సామాన్య జీవనం ఆర్థికంగా కుంగిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. సామాన్యుడి నడ్డి విరవడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పాలన సాగిస్తోందన్న విమర్శలు అప్పుడే వెల్లువెత్తున్నాయి. గత నెల 25నుంచే రైలు ఛార్జీలు పెరిగాయి. వాటిని ప్రజలు ఇంకా మర్చిపోకపోకముందే పెట్రో ధరలు పెంచడంతో ప్రజలపై తీవ్ర ఆర్థికభారం పడనుంది. జిల్లాలో 95 పెట్రోల్ బంక్‌లున్నాయి. వీటి ద్వారా ప్రతీ రోజూ 48 వేల నుంచి 50 వేల లీటర్ల దాకా పెట్రోల్ విక్రయాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పెంచిన ఛార్జీలను పరిశీలిస్తే పెట్రోల్ లీటరుకు రూ. 1:69 పైసలు పెరిగింది. దీనికి వ్యాట్ అదనంగా ఉంటుంది. వ్యాట్ పెట్రోల్‌పై 31 శాతం వసూలు చేస్తారు.
వ్యాట్‌తో కలిపి లీటర్ పెట్రోల్ ధర 2.20 రూపాయలకు చేరుకోనుంది. దీంతో రోజుకు 50 వేల లీటర్ల పెట్రోల్ విక్రయాల ప్రకారం నెలకు రూ. 33 లక్షల భారం పడుతోంది. అదేవిధంగా డీజిల్ ధరలు కూడా లీటరుకు 50 పైసల చొప్పున పెరిగింది. దీనికి వ్యాట్ 28 శాతం వసూలు చేస్తారు. దీంతో లీటరుకు వినియోగదారునిపై 62 పైసల భారం పడుతుంది. ప్రతీ నెలా జిల్లాలోని అన్ని బంకుల్లో కలిపి లక్షా 20 వేల లీటర్ల డీజెల్ విక్రయాలు జరుగుతాయి. ఈ లెక్కన ప్రతీ నెలా రూ.21.60 లక్షల భారం పడుతోంది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వల్ల వినియోగదారులపై ప్రతీ నెలా రూ.54.60 లక్షల భారం పడుతోంది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సమాంతరంగా పలు నిత్యావసర సరుకుల ధరలు, ప్రయాణ ఛార్జీలు పెరిగిపోతాయని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
విక్రయాలు నిలిపివేసిన బంక్ యజమానులు
పెట్రో ధరలు పెరగడంతో బంక్ యజమానులు సోమవారం రాత్రి నుంచి విక్రయాలను నిలిపివేశారు. లీటరుకు 2రూపాయల 20 పైసలు పెరగడంతో కనీసం ఎంతో కొంత లాభపడొచ్చనే ఉద్దేశంతో అర్ధరాత్రికి ముందుగానే పెట్రోల్ అమ్మకాలను ఆపేశారు. దీంతో చాలామంది వినియోగదారులు, ద్విచక్రవాహన దారులు ఇబ్బందులు పడ్డారు.