వామ్మో.. పోలీసోళ్లు | Police Neglect case | Sakshi
Sakshi News home page

వామ్మో.. పోలీసోళ్లు

Published Thu, Dec 25 2014 12:49 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM

వామ్మో.. పోలీసోళ్లు - Sakshi

వామ్మో.. పోలీసోళ్లు

 ఏలూరు (వన్‌టౌన్) : ‘పోలీసులంటే మీకు స్నేహితులే.. మీ కష్టాలను నిర్భయంగా చెప్పుకోండి.. నేరస్తులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు.. సమాజ భద్రత కోసం పోలీసులు అహర్నిశలు మీ కోసమే శ్రమిస్తూ, మీకు అనుక్షణం అందుబాటులో ఉంటారు’.. ఇవీ పోలీసులు ప్రజల లోకి వెళ్లినపుడు చెప్పే మాటలు. కానీ జిల్లాలోని కొన్ని పోలీస్‌స్టేషన్లలో వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఫలానా వ్యక్తి వల్ల తనకు అన్యాయం జరిగిందని ఎవరైనా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే, రెండు రోజుల తర్వాత అదే పోలీస్‌స్టేషన్ నుంచి కబురువస్తుంది. ‘ఏంటి మరి.. అవతలి వ్యక్తి కూడా కేసు పెట్టాడు ఏం చేద్దాం.. పోనీ రాజీ పడిపోండి’ అంటూ కొన్ని పోలీస్‌స్టేషన్లలో నిజమైన బాధితులకు ఖాకీలు ఉచిత సలహాలు ఇస్తున్నారు.
 
 దీంతో పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయిస్తున్న బాధితులకు న్యాయం సంగతేమో గాని అన్యా యం జరుగుతుండటంతో వారి ఆవేదన అంతా ఇంతా కాదు. ఫ్రెండ్లీ పోలీస్, డయల్ యువర్ ఎస్పీ వంటి కార్యక్రమాలతో ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి ప్రజల్లోకి వెళుతున్నా.. కిందిస్థాయి సిబ్బంది వీటిని పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా ఒక వ్యక్తి అలాంటి స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేస్తే ఎఫ్‌ఐఆర్ కాదు కదా.. కనీసం రశీదు కూడా ఇవ్వడంలేదు. పైగా రాజకీయ ఒత్తిళ్లతో ఆయా స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలు రాజీ చేసుకోవాలని బాధితులను బెదిరిస్తున్న దాఖలాలు ఉన్నాయి. ఒకవేళ వినకపోతే అవతలి వర్గం నుంచి కౌంటర్ కేసులు దాఖలు చేయిస్తూ ఇరువర్గాలను అరెస్ట్ చేస్తాం అంటూ కన్నెర్ర చేస్తున్న ఎస్‌హెచ్‌వోలు లేకపోలేదు.
 
 అలాగే చార్జిషీటు రూపొందించడంలో దర్యాప్తు అధికారుల పాత్ర నామమాత్రంగా ఉంటోందని, ఆంగ్లభాషపై పట్టులేని కిందిస్థాయి సిబ్బంది ప్రైవేట్ వ్యక్తుల సహకారంతో వీటిని తయారుచేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. రాత్రివేళ అనుమానితులు కనబడితే వారిపై బైండోవర్ కేసులు నమోదు చేయకుండా సిఫార్సులకు తలొంచి వదిలేస్తున్నారని అంటున్నారు. అదేవిధంగా మహిళ పోలీస్‌స్టేషన్‌కు డీఎస్పీగా మహిళనే నియమిస్తే తమగోడు చెప్పుకోవడానికి వీలుగా ఉంటుందని మహిళలు కోరుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించే దిశగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని పోలీసు శాఖను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు.
 
 ఇటీవల తాడేపల్లిగూడెం రూరల్ పరిధిలో మాధవరం గ్రామానికి చెందిన ఇంజినీర్ ఓ కేసుకు సంబంధించి ఫిర్యాదు చేయగా అవతలి వ్యక్తి బీజేపీ కార్యకర్త మంత్రికి సన్నిహితుడనే ప్రచారం ఉండటంతో పోలీసులు తిరిగి ఇంజినీర్‌పైనే ఎదురు కేసు పెట్టారు. ఇదేమిటని అడిగితే అతనితో రాజీ చేసుకోవాలని, కొత్త ఇబ్బందులు తెచ్చుకోవద్దని పోలీసులే బెదిరించడంతో ఆ ఇంజినీరు కంగుతిన్నాడు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement