మద్దిలి దరువు!
Published Sun, Jan 26 2014 3:16 AM | Last Updated on Mon, Sep 17 2018 4:56 PM
నువ్వు ఒక్కటిస్తే.. నేను రెండిస్తా.. అన్నట్లుంది టీడీపీలో ఆధిపత్య పోరు. జిల్లాలో కింజరాపు వర్గంపై పైచేయి సాధించేందుకు కళా వర్గం వేస్తున్న ఎత్తులకు.. ఈ విషయంలో గౌతు శివాజీ అనుసరిస్తున్న తటస్థ వైఖరికి చెక్ పెట్టేందుకు ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా కింజరాపు వర్గం కొత్త ఎత్తులు వేస్తోంది. ఇంతవరకు గౌతే రౌతు అనుకుంటున్న పలాస నియోజకవర్గంలో కొత్త ముఖాన్ని ఫ్లెక్సీలకెక్కించి సరికొత్త రాజకీయానికి తెర తీశారు. ‘మద్దిలి’తో రెండువైపులా దరువు వేసేందుకు సిద్ధమయ్యారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పలాసలో శనివారం హఠాత్తుగా వెలసిన ఫ్లెక్సీలు రాజకీయ కలకలం సృష్టిస్తున్నాయి. పలాస నియోజకవర్గంతోపాటు జిల్లా టీడీపీలో తాజా వర్గపోరును రచ్చకెక్కించిన ఈ ఫ్లెక్సీల వెనుక పెద్ద రాజకీయ తంత్రమే ఉంది. పలాస టీడీపీకి గౌతే ఏకైక రౌతు కాదని తేల్చిచెప్పేందుకు కింజరాపు వర్గం వేసిన ఎత్తుగడే దీని వెనుక ఉన్నట్లు తెలుస్తోంది. కిమిడి కళా వెంకట్రావు విషయంలో తటస్థ వైఖరి అవలంభిస్తున్న శివాజీకి షాక్ ఇచ్చేం దుకు అచ్చెన్నాయుడు పన్నిన వ్యూహంలో ఇదో భాగమని అంటున్నారు.
శివాజీకి పక్కలో బల్లెం!
టీడీపీలో కింజరాపు, కళా వర్గాల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు సెగ గౌతు శివాజీకి తగిలింది. కింజరాపు కుటుంబానికి సన్నిహితుడైన వజ్రపుకొత్తూరు మాజీ ఎంపీపీ మద్దిలి చిన్నయ్య హఠాత్తుగా పలాస టిక్కెట్టు రేసులోకి వచ్చారు. పలాస అంతటా శనివారం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. దివంగత ఎన్టీరామారావు, ఎర్రన్నాయుడులతోపాటు పార్టీ అధినేత చంద్రబాబు, కింజరాపు రామ్మోహన్ నాయుడు ఫొటోలతో చిన్నయ్య ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అందరి దృష్టిని ఆకర్షించాయి. తనను తాను పలాస నియోజకవర్గ నేతగా పేర్కొంటూ చిన్నయ్య వీటిని ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పలాస టీడీపీ ఇన్‌చార్జిగా గౌతు శివాజీ ఉండగానే ఆయన ఇంతటి రాజకీయ సాహసం చేయడం గమనార్హం. అక్కడితోనే ఆగిపోకుండా పలాస మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో తన అనుచరులతో కలిసి పర్యటించారు. తాను టిక్కెట్టు ఆశిస్తున్నానని స్పష్టం చేశారు. అధినేత చంద్రబాబు టిక్కెట్టు ఇస్తే తన గెలుపునకు కృషి చేయాలని కోరారు. ఇంతకాలం శివాజీ నాయకత్వంలో పనిచేస్తూ వచ్చిన చిన్నయ్య ఒక్కసారిగా ఇలా ప్లేటు ఫిరాయిండం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. దీని వెనుక అసలు కథ మరింత ఆసక్తికరంగా ఉంది.
అచ్చెన్న దండోపాయం
గౌతు శివాజీ వైఖరిపై కొంతకాలంగా కింజరాపు వర్గం గుర్రుగా ఉంది. జిల్లా పార్టీ పెద్దరికం కళా వెంకట్రావుకు కట్టబెట్టాలన్న చంద్రబాబు నిర్ణయాన్ని శివాజీ వ్యతిరేకించకపోవడమే దీనికి ప్రధాన కారణం. భవిష్యత్తు రాజకీయ అవసరాల దృష్ట్యా కళా విషయంలో శివాజీ ప్రస్తుతానికి తటస్థ వైఖరితో ఉన్నారు. రానురాను కళాకు అనుకూలంగా మారాలన్నది ఆయన ఆలోచన. దీన్ని గ్రహించిన కింజ రాపు వర్గం భగ్గుమంటోంది. తమ శిబిరంలోని శివాజీ కళా వైపు మొగ్గు చూపితే తమ ఆధిపత్యం పూర్తిగా దెబ్బతింటుందని ఆందోళన చెందింది. శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో కళా జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదన్నది అచ్చెన్నాయుడు ఉద్దేశం.
అందుకే ఆయన యుద్ధ ప్రాతిపదికన వ్యూహాన్ని అమలు చేశారు. సొంతింటిలో పొగ పెట్టడం ద్వారా శివాజీని ఆత్మరక్షణలో పడేయాలని భావించారు. అందుకే తమకు సన్నిహితుడైన వజ్రపుకొత్తూరు మాజీ ఎంపీపీ మద్దిలి చిన్నయ్యను ఆస్త్రంగా ప్రయోగించారు. వ్యూహాత్మకంగా చిన్నయ్య ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో తన ఫొటో లేకుండా జాగ్రత్త పడ్డా రు. చిన్నయ్య పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో గణనీయంగా ఉన్న యాదవ సామాజికవర్గానికి చెందిన నేత కావడం కూడా అచ్చెన్న వ్యూహానికి బలం చేకూర్చింది. ఆయన్ను పలాస టిక్కెట్టు ఆశావాహుడిగా రంగంలోకి దించారు. అందుకు సమయాన్ని కూడా వ్యూహాత్మకంగా నిర్ణయించారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో బెందాళం అశోక్ ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో కింజరాపు రామ్‌మోహన్‌నాయుడుతో కలసి పాల్గొనాలని శివాజీ ముందుగానే నిర్ణయించుకున్నారు.
అదే సమయంలో పలాసలో శివాజీకి వ్యతిరేకంగా మద్దిలి చిన్నయ్య ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. అంటే ఓ వైపు శివాజీ పక్కనే ఉంటూ మరోవైపు పలాసలో ఆయనకు అసమ్మతి పోటు పొడిచారు. ఒకవేళ దీనిపై చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా తమకేమీ తెలియదని తాము శివాజీతోనే ఉన్నామని చెప్పుకోవడానికి ఇది ఉపయోగపడుతుందన్నది కింజరాపు వర్గం వ్యూహం. ఊహించని ఈ పరిణామాతో శివాజీ వర్గం కంగుతిన్నట్లు కనిపిస్తోంది. దీనిపై ఎలా స్పందించాలో తెలియక ఆయన వర్గం తర్జనభర్జనలు పడుతోంది. ఓ వైపు అచ్చెన్నపై ఆగ్రహంతో రగిలిపోతున్నా ప్రస్తుతానికి వేచిచూసే వైఖరి అవలంభించాలని శివాజీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదను చూసి ఎదురుదాడి చేయాలన్నది ఆయన ఉద్దేశంగా ఉంది. ఈ పరిణామాలతో పలాస నియోజకవర్గంతోపాటు జిల్లా టీడీపీలో వర్గ రాజకీయం ఆసక్తికర మలుపు తిరిగింది.
Advertisement