కరెంటు కష్టాలు తీరేదెన్నడో..!
Published Thu, Aug 22 2013 3:41 AM | Last Updated on Fri, Sep 1 2017 9:59 PM
ఖానాపూర్, న్యూస్‌లైన్ : కాలమేదైనా సరే మూడు మండలాల ప్రజలకు కరెంటు కష్టాలు తప్పడం లేదు. లోవోల్టేజీతో అన్నదాతలు సతమతం అవుతున్నారు. మండల కేంద్రంలో రెండేళ్ల క్రితం చేపట్టిన 133/32 కేవీ సబ్‌స్టేసన్ పనులు కొనసా..గుతుండడంతో కరెంటు కష్టాలు తీరడం లేదు. రూ.8.49 కోట్లతో సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు చేపట్టారు. ఇది పూర్తయితే కడెం, ఖానాపూర్, మామడ మండలాల్లోని గృహ వినియోగదారులు, వ్యాపారులు, రైతుల కరెంటు కష్టాలు తీరుతాయి. రైస్‌మిల్లులు, పిండిగిర్నిలు, నూనెగిర్ని, కంప్యూటర్ సెంటర్లు, పరిశ్రమలు కరెంటు లోవోల్టేజీ ఎదుర్కొంటున్నాయి. గతంలో లోవోల్టేజీ కారణంగా విద్యుత్ మోటార్లు, పిండిగిర్నిల యంత్రాలు, గృహోపకరణాలు, ఇతర సామగ్రి కాలిపోయాయి. కరెంటు సరఫరా సక్రమంగా లేకపోవడంతో కొంతమంది రైతులు పొలాలను బీడుగా వదిలేశారు. ఈ సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తయితే ఆయా మండలాల్లో ఏడుకు పైగా 33/11కేవీ సబ్‌స్టేషన్లను 133/32 కేవీ సబ్‌స్టేషన్‌కు అనుసంధానం చేస్తారు. ఇంకా దగ్గరిలోని గ్రామాలకు చెందిన 33/11కేవీ సబ్‌స్టేషన్లకు సైతం అనుసంధానం చేసే అవకాశం ఉందని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కాగా, పనులు పూర్తి కావాలంటే మరో ఐదు నెలలు పట్టే అవకాశం ఉంది.
త్వరలో పనులు పూర్తవుతాయి
- ట్రాన్స్‌కో ఏఈ రమేశ్
2011 జనవరిలో పనులు ప్రారంభమయ్యాయి. వర్షాల కారణంగా పనులు ఆలస్యం అయ్యాయి. ఈ సంవత్సరం డిసెంబర్ వరకు పూర్తయ్యే అవకాశం ఉంది. అందుకు కావల్సిన పనులు ముమ్మరంగానే సాగుతున్నాయి.
పనులు పూర్తి చేయాలి
విద్యుత్ శాఖ అధికారులు సబ్‌స్టేషన్ పనులు పూర్తి చేయడంపై దృష్టి సారించాలి. విద్యుత్ సౌకర్యం లేక ఎంతో మంది రైతులు పొలాలను బీడుగా వదిలేశారు. సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తయితే విద్యుత్ సరఫరాలో అంతరాయం తగ్గి బీడు భూములు సాగులోకి వస్తాయి.
- చిలుకూరి మురళి, వైఎస్సార్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు
విద్యుత్ కోతతో ఇబ్బందులు
విద్యుత్ కోతల కారణంగా ఆర్థికంగా నష్టపోతున్నాం. వేలాది రూపాయల పెట్టుబడి పెట్టిన వ్యాపారంలో కరెంటు లేక నష్టాలు చవిచూస్తున్నాం. అధికారుల దగ్గరికి వెళ్తే సమస్య నిర్మల్‌లో ఉందనేవారు. 133/32 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తయితే మా కష్టాలు తీరుతాయి.
- రవి, వెల్డింగ్ దుకాణం యజమాని, ఖానాపూర్
మరో 31 టవర్లు వేయాల్సి ఉంది
ఇప్పటికే 82 టవర్లు పూర్తయ్యాయి. మరో 31 టవర్లు వేయాల్సి ఉంది. నవంబర్ వరకు పనులు పూర్తి చేసి ఏపీ ట్రాన్స్‌కోకు అప్పగించాలి. పం ట పొలాల కారణంగా రెండు నెలలు అదనంగా సమయం పడుతుంది.
- నాగేశ్‌రెడ్డి, కంపెనీ సైట్ ఇంజినీర్
Advertisement