‘నాందేడ్’ ఎక్స్‌ప్రెస్‌పై సదరన్ రైల్వే సేఫ్టీ కమిషన్ చైర్మన్
పుట్టపర్తి టౌన్/హైదరాబాద్ న్యూస్‌లైన్: అనంతపురం జిల్లా కొత్తచెరువు వద్ద నాందేడ్ ఎక్స్‌ప్రెస్ బీ1 బోగీ ఘోర అగ్ని ప్రమాదానికి గురైన ఘటనపై సదరన్ రైల్వే రీజియన్ సేఫ్టీ కమిషన్ చైర్మన్ సతీష్‌కుమార్ మిట్టల్ మంగళవారం విచారణ ప్రారంభించారు. ప్రశాంతి నిలయం రైల్వేస్టేషన్‌లోని అధికారుల విశ్రాంతి భవనంలో బహిరంగ విచారణ ప్రారంభించిన మిట్టల్.. అంతకుముందు రెల్వే అధికారులతో కలసి ప్రమాదం జరిగిన కొత్తచెరువు రైల్వే గేటు ప్రాంతంలోని ట్రాక్‌ను పరిశీలించారు. ప్రమాదానికి గురైన రైలు బోగీని క్రేన్ సాయంతో పైకి ఎత్తించి ఏ భాగం అధికంగా దెబ్బతిన్నదో పరిశీలించారు. ఇన్‌వర్టర్స్ ఆయిల్ బాక్స్ నుంచి లీకేజీ గుర్తించి.. ఆ భాగాన్ని ఆయన చాలాసేపు పరిశీలించారు. విద్యుత్ జంక్షన్ బాక్స్ ఏమాత్రం దెబ్బతినకపోవడాన్ని చూసి ఆశ్చర్యపోతూ.. షార్ట్ సర్క్యూట్ జరిగితే ఈ బాక్స్ దెబ్బతినాలి కదా అని ఏసీ బోగీ ఎలక్ట్రికల్ అధికారులను ప్రశ్నించారు. బోగీలోని ఏడు, నాలుగవ నంబర్ సీట్లను సునిశితంగా పరిశీలించారు. ఏడవ బెర్త్ వద్ద ప్రమాదం మొదలైతే నాలుగవ బెర్త్త్ ఏమాత్రం కాలకపోవడాన్ని ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీర్లతో ప్రస్తావించినట్లు తెలిసింది. అనంతరం బహిరంగ విచారణలో తొలిరోజు రైల్వేలోని వివిధ విభాగాలతో పాటు సహాయక చర్యల్లో పాల్గొన్న పోలీస్, 108 సిబ్బంది తదితర విభాగాలకు చెందిన 39 మంది నుంచి వివరాలు సేకరించారు. అన్ని కోణాలలో సమగ్ర విచారణ జరిపి, రైల్వే మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పిస్తామని విచారణ అనంతరం విలేకరులకు తెలిపారు. ప్రమాద కారణాన్ని ఇపుడే చెప్పలేమన్నారు. స్వీయ విచారణ, క్షేత్ర స్థాయి పరిశీలనలో వెల్లడైన విషయాలు, ఫోరెన్సిక్ నివేదికను క్రోడీకరించి.. ఘటనకు గల కారణాలపై ఓ అంచనాకు వస్తామన్నారు.
మంటలకు పేలుడు పదార్ధాలు కారణం కాదు
బెంగళూరు-నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలకు పేలుడు పదార్ధాలు కారణం కాదని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. ప్రమాద ఘటనపై రాష్ట్ర ఫొరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ డెరైక్టర్ శారద నేతృత్వంలో నిపుణుల బృందాలు మూడు రోజులపాటు క్షుణ్ణంగా పరిశీలన జరిపి ఈ మేరకు నిర్ధారించారు. షార్ట్ సర్క్యూట్ కావచ్చన్న వాదనపై కూడా పరిశీలన జరుగుతోంది. కాగా బెంగళూరు-నాందేడ్ రైలు బోగీలో 26 మంది సజీవ దహనం దుర్ఘటనకు సంబంధించి డీఎన్‌ఏ పరీక్షలు పూర్తయ్యాయి. బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో మంగళవారం లలిత-బెంగళూరు రాజరాజేశ్వరి నగర(61), పద్మిని-బెంగళూరు కెంగేరి(61), ఇబ్రహీం రహీ-రాయచూరు(31), డాక్టర్ అస్రా-రాయచూరు(32), మహమ్మద్ రఫీ-రాయచూరు(2), రాహుల్-ఔరంగాబాద్(25)ల మృతదేహాలను బంధువులకు అప్పగించారు. ఇప్పటి వరకు 20 మృతదేహాలను అప్పగించారు.
ప్రమాద కారణం ఇప్పుడే చెప్పలేం
Published Wed, Jan 1 2014 1:34 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement