ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రెవెన్యూ - పోలీసు అధికారుల మధ్య నెలకొన్న వివాదం చినికిచినికి గాలివానగా మారింది. చివరకు ఎన్నికల విధులపై తీవ్ర ప్రభావం చూపనుంది. రెవెన్యూ అధికారులు, సిబ్బందిపై పోలీసు అధికారులు దౌర్జన్యం చేసినా ఇంతవరకు వారిపై చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ రెవెన్యూ కాన్‌ఫెడరేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం వర్క్ టు రూల్ పాటించారు.
ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే విధులు నిర్వర్తించారు. గ్రామ రెవెన్యూ సహాయకుడి నుంచి తహశీల్దార్ వరకు వర్క్ టు రూల్ పాటించడంతో సాయంత్రానికి రెవెన్యూ కార్యాలయాలు, కలెక్టరేట్‌లోని రెవెన్యూ విభాగాలు ఖాళీగా కనిపించాయి. జిల్లా ఎన్నికల అధికారి స్పందించకుంటే శుక్రవారం కూడా వర్క్ టు రూల్ పాటించాలని రెవెన్యూ కాన్‌ఫెడరేషన్ నిర్ణయించింది.
ఈ నెల 6వ తేదీన జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో మార్కాపురం డివిజన్ బద్వీడు పోలింగ్ కేంద్రంలో ఎన్నికల విధుల్లో ఉన్న పెద్దారవీడు తహశీల్దార్‌తో పాటు సిబ్బందిపై ఒంగోలు టూటౌన్ సీఐ సూర్యనారాయణ దౌర్జన్యానికి దిగడం, అది జరిగి నాలుగు రోజులు తిరగకుండానే కొండపి మండలం ఇలవరలో ఎన్నికల విధుల్లో ఉన్న గ్రామ రెవెన్యూ సహాయకుడిపై సీఐ లక్ష్మణ్ తప్పుడు కేసు బనాయించి ఇబ్బందులకు గురిచేశారని నాయకులు మండిపడుతున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో సీఐ సూర్యనారాయన విధులు నిర్వర్తించడం, విచారణకు సంబంధించిన నివేదికను ఎన్నికల సంఘానికి పంపించకపోవడాన్ని రెవెన్యూ కాన్‌ఫెడరేషన్ తీవ్రంగా పరిగణించింది. అందులో భాగంగా వర్క్ టు రూల్‌కు సిద్ధమైంది.
నిలిచిన పోస్టల్ బ్యాలెట్ వెరిఫికేషన్
మరో 12 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. పూర్తి స్థాయిలో ఎన్నికల విధుల్లో నిమగ్నమైన సమయంలో వర్క్ టు రూల్‌తో తీవ్ర ఆటంకం కలిగింది. పోస్టల్ బ్యాలెట్ వెరిఫికేషన్ నిలిచిపోయింది.
శుక్రవారం కూడా వర్క్ టు రూల్ పాటించేందుకు రెవెన్యూ కాన్‌ఫెడరేషన్ సన్నద్ధం అవుతోంది. జిల్లా ఎన్నికల అధికారి వెంటనే జోక్యం చేసుకోకుంటే ఎన్నికల విధులకు విఘాతం కలిగే అవకాశం ఉంది.
రెవెన్యూ ఉద్యోగుల వర్క్ టు రూల్
Published Fri, Apr 25 2014 2:47 AM | Last Updated on Sat, Sep 2 2017 6:28 AM
Advertisement
Advertisement