దేవుడికే శఠగోపం!
అనంతపురం కల్చరల్ : దేవుళ్లకే శఠగోపం పెడుతున్నారు. దేవుని మాన్యాలు రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. వాటిని కాపాడాల్సిన దేవాదాయ శాఖ అధికారులు కూడా రాజకీయ నాయకులకు దాసోహం అంటున్నారు.
ఫలితంగా అనేక ఆలయాలు ఆదాయం లేక ధూప, దీప, నైవేద్యాలకు దూరమయ్యాయి. జిల్లాలో ప్రసిద్ధి చెందిన 36 ఆలయాలకు 35,472.8 ఎకరాలకు పైగా భూములున్నాయి. ఇందులో 1,247.45 ఎకరాలు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. అయితే.. 200 ఎకరాల పై చిలుకు మాత్రమే అన్యాక్రాంతమయ్యాయని, వీటిపై కోర్టులో కేసులు నడుస్తున్నాయని దేవాదాయశాఖ అధికారులు అంటున్నారు. కదిరి, కసాపురం ఆలయాల పరిధిలో కబ్జా వివరాలే తెలీవని చెబుతున్నారు.
కబ్జా కోరల్లో పంపనూరు
ఆత్మకూరు మండలంలోని పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం భక్తజన సందోహంతో పోటెత్తుతూ ఉంటుంది. ఈ ఆలయానికి సర్వే నంబర్ 488లో మూడెకరాల 92 సెంట్ల భూమి ఉంది. ఎకరా 20 సెంట్లు కబ్జాకు గురైనా అడిగేవారు లేరు.
పెన్నోబిలేసునికే పంగనామాలు
ఉరవకొండ మండలంలోని పెన్నహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. జిల్లాలో ఏ దేవునికీ లేనన్ని ఆస్తులు ఈ స్వామికి ఉన్నాయి. ఆలయానికి దాదాపు 12,600 ఎకరాల భూములు ఉన్నాయి. దేవాదాయ శాఖ మాత్రం 1,700 ఎకరాలనే చూపిస్తోంది. వీటి నుంచి వచ్చే ఆదాయం కూడా స్వామికి నామమాత్రంగానే అందుతోంది. 600 ఎకరాలను మాజీ ఎమ్మెల్యే అనుచరులు కబ్జా చేశారు. నిబంధనల మేరకు ప్రతియేటా ఆలయ భూములకు వేలం పాట నిర్వహించాలి. కోనాపురం, మోపిడి, ఇంద్రావతి, చిన్నముష్టూరు, పెద్ద ముష్టూరు, ఆమిద్యాల తదితర గ్రామాల రైతులు వేలం పాటలో పాల్గొనవచ్చు. అయితే.. 17 ఏళ్ల నుంచి భూములకు వేలం నిర్వహించలేదంటే.. ఏ విధంగా అన్యాక్రాంతం అవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
అనంతపురంలోనూ ఇదే పరిస్థితి
జిల్లా కేంద్రం అనంతపురంలోనూ దేవుని భూములు కబ్జాకు గురయ్యాయి. పాతూరులోని పేట బసవేశ్వరుని ఆలయానికి రూ.వందల కోట్లు విలువజేసే ఆస్తులున్నాయి. పాతూరులోని సున్నంగేరి నుంచి సంగమేశ్ నగర్ వరకు భూములున్నట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం ఇవి కబ్జాకు గురయ్యాయి. వాటిలో వ్యాపార సముదాయాలు, గృహనిర్మాణాలు నిరాటంకంగా సాగిపోతున్నాయి. సర్వే నంబర్ 178/2లో గల ఒక ఎకరా 46 సెంట్ల భూమిలో ‘తారక రామారావు’ కాలనీ వెలసింది. దీనిని ప్రస్తుతం బసవేశ్వరనగర్‌గా మార్చారు. ప్రాచీన చెన్నకేశవాలయానిది మరో దుస్థితి. నీరుగంటి వీధి 2081/9 సర్వే నంబర్‌లో దాదాపు 64 సెంట్లు, అంబారపు వీధిలోని 2097/6 సర్వేనంబర్‌లో 68 సెంట్ల ఆలయ భూమి కబ్జాకు గురైంది. ఆలయానికి సంబంధించి ఒకప్పుడు జిల్లాలో దాదాపు 64 సత్రాలు ఉండేవని రికార్డులు చెపుతున్నా..ప్రస్తుతం అవి నామారూపాలు లేకుండా పోయాయి. ఇక అనంతపురం రూరల్ మండలంలో పలు ఆలయాలకు సంబంధించి 450 ఎకరాల భూమి ఉంది. వీటిలో 340 ఎకరాల వరకు కబ్జాకు గురైనట్లు తెలుస్తోంది. పండమేరు వెంకటేశ్వరస్వామి ఆలయ భూముల్లో ఇప్పటికే 16 ఎకరాలు కబ్జాకు గురైనట్లు దేవాదాయ శాఖ అధికారులే చెబుతున్నారు.
అలుపెరుగని పోరాటం
కోట్ల రూపాయల విలువ జేసే ఆలయ భూములు కబ్జాకోరల్లో చిక్కున్నాయి. వీటి పరిరక్షణకు విశ్వహిందూపరిషత్తు దశాబ్దాలుగా పోరాడుతోంది. నగరంలో ఒకప్పుడున్న సత్రాలు నామమాత్రంగా కూడా కన్పించడం లేదు. దేవునికి చేరకపోయినా నిజమైన పేదవాడికైనా లాభం కలిగితే మా పోరాటం ఫలించినట్లే.
- మఠం ఆనందకుమార్,
విశ్వహిందూపరిషత్తు, అనంతపురం
హైకోర్టు, ట్రైబ్యునల్‌లో
కేసులు వేశాం
జిల్లాలో అన్యాక్రాంతమైన 240 ఎకరాల భూములు తిరిగి స్వాధీనం చేసుకోవడానికి హైకోర్టు, ట్రైబ్యునల్‌లో కేసులు వేశాం. పరిష్కారమైనవెంటనే తిరిగి స్వాధీనం చేసుకుంటాం. కొన్ని ఆలయ భూములకు సంబంధించి ప్రతియేటా వేలం పాటలు నిర్వహించడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. వేలం పాటల నిర్వహణ బాధ్యత ఆలయ కమిటీలదే. ఎక్కడైనా భూములు అన్యాక్రాంతమైనట్లు ఫిర్యాదు అందితే వెంటనే స్పందిస్తాం.
- మల్లికార్జున, అసిస్టెంట్ కమిషనర్,
దేవాదాయశాఖ