60 ఏళ్ల తరువాత అనుకోని అతిథి..
తిరుపతి: అర్ధరాత్రి వేళ విధుల్లో ఉన్న తలకోన బీట్ అటవీ సిబ్బందికి అనుకోని అతిథి కనిపించింది. రాజసం ఒలికిసూతు రోడ్డు దాటుతున్న ఆ జంతువును చూసి ఆశ్యర్యపోయారు. శేషాచలంలో చాలా ఏళ్లుగా కనిపించని ఆ జంతువు మరలా కనిపించింది. తర్వాత తేరుకుని ఆ ప్రదేశానికి వెళ్లి జంతువు అడుగుజాడలు పరిశీలించారు. అవి రాయల్ బెంగాల్ టైగర్ అడుగులుగా గమనించారు. ఒకటికి రెండుసార్లు పరిశీలించుకున్నారు. తాము ఊహించించదే నిజమని వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. నిర్ధారించేందుకు పాదముద్రలను బయోల్యాబ్‌కు పంపారు.
శేషాచలం అడవుల్లో ఎప్పుడో 1955కు ముందు ఒకసారి పెద్దపులి కనిపించినట్లు అధికారులు గుర్తుచేసుకున్నారు. అయితే దానికి సంబంధించిన ఆధారాలు మాత్రం లేవు. తాజాగా తిరుపతి వన్యప్రాణి డివిజన్ పరిధిలోని బీట్‌లో తలకోనకు వెళ్లే ప్రధాన రోడ్డును దాటుతున్న పెద్దపులిని వారం క్రితం సిబ్బంది చూశారు. అడుగుజాడల ప్రకారం తలకోనకు చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ల దూరంలోనే అది సంచరిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీశైలం టైగర్ ప్రాజెక్టు నుంచి వేంపల్లి, దిన్నెల, కడప కారిడర్ మీదుగా టైగర్ శేషాచలం చేరినట్లు అధికారులు పేర్కొంటున్నారు. నివాసానికి అనువైన ప్రాంతం, జింకలు,అడవిపంది వంటి జంతువులు అధికంగా ఉండటం, నీటి సౌకర్యం సమృద్ధిగా ఉండటం వల్లే పులి ఇక్కడికి చేరినట్లు వారు భావిస్తున్నారు.