చెమట చుక్కల పదునులో విత్తనాలు నాటి.. నెత్తుటి చుక్కల్ని పిచికారీ చేసి పంటలు పండించే అన్నదాతలు సర్కారు తీరుపై రగిలిపోతున్నారు. రుణమాఫీ ఫలాలు చేతికి రాలేదు. పెట్టుబడి కోసం రుణాలూ అందలేదు. కష్టాలు, నష్టాలను పంటిబిగువన భరిస్తూ రబీ సాగు కోసం ఏరువాక చేపట్టిన అన్నదాతలు పాలకులు రచిస్తున్న కుట్రలపై పోరువాక సాగించేందుకు సన్నద్ధమవుతున్నారు.
ఒద్దికగా ఒదిగిన గింజలతో తలదించుకుని పుడమి తల్లి ఒడిలో సేదతీరేందుకు తహతహలాడే కంకుల మాదిరి చేలగట్ల చుట్టూ తిరుగాడే అన్నదాతల పిడికిళ్లు బిగుస్తున్నాయ్. పట్టిసీమ వద్ద ఎత్తిపోతల పథకం నిర్మిస్తే.. సర్కారు పునాదులను సైతం పెకలిస్తామని వారి గళాలు గర్జిస్తున్నాయ్. కాళీపట్నం రైతు పోరాటం.. కాల్ధరి ఉద్యమ తరహాలో మరో పోరాటం నిర్వహించేందుకు ఉభయ గోదావరి జిల్లాల కర్షకులు సమాయత్తమవుతున్నారు.
సర్కారుపై సమరానికి సమాయత్తమవుతున్న కర్షకులు
భీమవరం/పోలవరం : గోదావరి జిల్లాల రైతులు మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు. పంట చేలో పచ్చదనాన్ని కాపాడుకునేందుకు పోరుబాట పడుతున్నారు. గురువారం జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టిసీమ వద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి తీరుతామని ప్రకటించడం.. ఆ వెనుకే రూ.1,300 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడటంపై అన్నదాతలు రగిలిపోతున్నారు.
పచ్చని గోదావరి జిల్లాలను ఎడారిగా మార్చేందుకు సాక్షాత్తు ముఖ్యమంత్రి పూనుకోవడంపై నిప్పులు చెరుగుతున్నారు. అన్నపూర్ణగా పేరొందిన గోదావరి జిల్లాలను కరువు ప్రాంతాలుగా మార్చే హక్కు ఎవరిచ్చారంటూ గర్జిస్తున్నారు. పట్టిసీమ వద్ద ఎట్టి పరిస్థితుల్లో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించనిచ్చేది లేదంటూ రణ నినాదం చేస్తున్నారు. ఈ పథకం విషయంలో ఇప్పటివరకు రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తూ వచ్చిన సీఎం చంద్రబాబు గురువారం జిల్లా పర్యటన సందర్భంగా పట్టిసీమ వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించి రాయలసీమ ప్రాంతానికి గోదావరి జలాలను తరలిస్తామని బహిరంగంగా ప్రకటన చేయడంతో రైతులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.
ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పక్కన పెట్టి హడావుడిగా ఎత్తిపోతల పథకం నిర్మించడం వెనుక ప్రభుత్వ పెద్దల ఆంతర్యం ఏమిటని, ఈ పథకానికి ఎకాఎకిన రూ.1,300 కోట్లను కేటారుుస్తూ జీవో జారీ చేయడం వెనుక పన్నాగం ఏమిటని బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై తాడోపేడో తేల్చుకునేందుకు కృష్ణా జిల్లా రైతులతో కలసి ఉభయ గోదావరి జిల్లాల రైతులు ప్రత్యక్ష పోరాటానికి సమాయత్తమవుతున్నారు.
5న కాకినాడ కలెక్టరేట్ ముట్టడి
ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ సర్కారుపై సమరభేరికి సమాయత్తమైన ఉభయగోదావరి జిల్లాల రైతులు ఈనెల 5న తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని కలెక్టరేట్‌ను ముట్టడించడం ద్వారా తొలి నగారా మోగిస్తున్నారు. అనంతరం ఏలూరు నగరాన్ని ముట్టడించేందుకు కార్యాచరణ రూపొం దిస్తున్నారు.
సర్కారుకు ఎందుకింత హడావుడి
గోదావరి జిల్లాల ప్రజల చిరకాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేస్తామని ఇటీవల ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు హడావుడిగా ఎత్తిపోతల పథకం నిర్మాణానికి తలపోయడం వెనుక ఆంతర్యం ఏమిటనేది వెల్లడించాలని రైతు నాయకులతోపాటు గోదావరి జిల్లాల ప్రజలు డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తరుుతే బృహత్తర ప్రయోజనాలు సిద్ధిస్తారుు.
అలాంటప్పుడు ఎత్తిపోతల పథకం నిర్మించి పోలవరం ప్రాజెక్ట్ కుడి కాలువకు అనుసంధానం చేయటం వల్ల ఒనగూరే ప్రయోజనం శూన్యమని నీటి పారుదల, జల వనరుల, ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తిచేసే ఉద్దేశం ఉన్నప్పుడు రూ.1,300 కోట్లు వెచ్చించి ఎత్తిపోతల పథకం నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ పథకం కోసం వినియోగించే నిధులు బూడిదలో పోసిన పన్నీరవుతాయని పేర్కొంటున్నారు.
ఆ నిధులను పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి వినియోగిస్తే పనులు త్వరగా పూర్తవుతాయని, తద్వారా నవ్యాంధ్ర రాష్ట్రానికి మేలు కలుగుతుందని స్పష్టం చేస్తున్నారు. ఎత్తిపోతల పథకం నిర్మాణానికి రూ.1,300 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం హడావుడిగా జారీ చేసిన జీవోఎంఎస్-1లో పేర్కొన్న వివరాలను బట్టి గోదావరి నుంచి ఎత్తిపోతల ద్వారా తరలించే నీటిని తాగు, పారిశ్రామిక అవసరాలకు వినియోగించనున్నట్టు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ పేరు చెప్పి నూతనంగా నిర్మిస్తున్న రాజధాని ప్రాంతంలో పరిశ్రమలకు ఈ నీటిని తరలించే ఎత్తుగడ వేస్తున్నారని రైతు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.
ఎత్తిపోతల ద్వారా 8,500 క్యూసెక్కుల నీటిని పోలవరం కుడి కాలువ ద్వారా పులిచింతల దిగువ ప్రాంతానికి తరలించేందుకు నిర్ణయించారని చెబుతున్నారు. చంద్రబాబును నమ్మి అధికారం కట్టబెట్టిన గోదావరి జిల్లాల ప్రజలను.. ముఖ్యంగా ఇక్కడి రైతులను నట్టేట ముంచి.. ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చేందుకు కుట్రలు పన్నుతున్నారని రైతు సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
గోదారి జిల్లాల గతేంటి
ఉభయ గోదావరి జిల్లాల రైతులు ఇప్పటికే రెండో పంటకు సాగునీరు అందక అవస్థలు పడుతున్నారు. జూన్, జూలై నెలల్లో ధవళేశ్వరం బ్యారేజి వద్ద 8 వేల క్యూసెక్కులకు మించి వరద నీరు రావడం లేదు. అలాంటప్పుడు ఎత్తిపోతల పథకం నిర్మించి ఇక్కడి నీటిని కొత్త రాజధానిలో పారిశ్రామిక అవసరాలకు తరలిస్తే గోదావరి జిల్లాల్లో పంటల పరిస్థితి ఏం కావాలని రైతులు ప్రశ్నిస్తున్నారు.
రగులుతున్న రైతన్న
Published Sat, Jan 3 2015 3:12 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement