ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: గ్రామానికి వారు ప్రథమ పౌరులు. పంచాయతీలో జరిగే అభివృద్ధి పనులన్నీ వారి చేతుల మీదుగానే జరుగుతాయి. ఐదేళ్ల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయాల్సిన పదవి. దాన్ని దక్కించుకునేందుకు ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డుతారు. తీరా వారికిచ్చే గౌరవ వేతనం నామమాత్రం. పంచాయతీ సర్పంచ్‌ల గౌరవ వేతనం మేజర్ పంచాయతీలకైతే రూ. 1500, మైనర్ పంచాయతీలకు వెయ్యి రూపాయలు మాత్రమే. సర్పంచ్ కార్యాలయంలో కూర్చొని ఉంటే..తన తోటి ఉండే వారికి టీ, బిస్కెట్ ఖర్చులే రోజుకు వంద రూపాయల దాకా అవుతాయి. అంటే సర్పంచ్‌కిచ్చే గౌరవ వేతనం సాదా ఖర్చులకు కూడా సరిపోదన్నమాట. తాత్కాలిక పారిశుధ్య కార్మికులు, వాటర్‌మెన్‌లకు ఇచ్చేంత వేతనం కూడా తమకు ఇవ్వడం లేదని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం నుంచి అనేక పథకాల కింద మంజూరయ్యే నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడతారు. ఇతర అవసరాలకు తమ జేబుల నుంచి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. గ్రామంలో జరిగే ఉత్సవాలు, జాతరలు, ఆలయ వార్షికోత్సవాలు, తదితర కార్యక్రమాలకు నిర్వాహుకులు గ్రామ పెద్దగా సర్పంచ్‌ని భావించి అందరికంటే ముందు వారినే విరాళం అడుగుతారు. గ్రామానికి ఎవరైనా ఉన్నతాధికారులు వచ్చినా, ప్రజా ప్రతినిధుల పర్యటనలున్నా ఆయా సందర్భాల్లో ఏర్పాట్ల ఖర్చును సర్పంచ్‌లే భరించాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది వేల రూపాయల్లో ఉంటుంది. అభివృద్ధి చెందిన మేజర్ పంచాయతీలు, ఆర్థికంగా స్థితిమంతులుగా ఉన్న సర్పంచ్‌లయితే ఫర్వాలేదు కానీ రిజర్వుడ్ స్థానాల్లో గెలిచిన సర్పంచ్‌లు, పేద వర్గాల నుంచి ఎన్నికైన వారు ఇటువంటి అవసరాలకు ఖర్చు పెట్టడం తలకు మించిన భారమే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌లు అత్యధికం మంది ఆర్థికంగా స్థితిమంతులు కారు.
‘ప్రస్తుత కాలంలో ఖర్చులన్నీ పెరిగిపోయాయి. కనీసం ఊరు నుంచి ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లాలన్నా, అదే విధంగా పోలీసు స్టేషన్‌లకు వెళ్లాలన్నా దారి ఖర్చులు కనీసం నెలకు రూ. 300 అవుతాయి. ఇక ఊర్లో ఉండే ఖర్చులు సరేసరి. ఈ పరిస్థితుల్లో నెలకు వెయ్యి, రూ. 1500లతో ఏ పని చేయడం సాధ్యం కాదు’ అంటున్నారు సర్పంచ్‌లు. కనీసం నెలకు సర్పంచ్‌ల గౌరవవేతనంగా రూ. 5 వేలన్నా ఇవ్వాలని కోరుతున్నారు.
సర్పంచ్‌ల గౌరవ వేతనం వెయ్యి రూపాయలే
Published Sat, Sep 14 2013 4:07 AM | Last Updated on Fri, Sep 1 2017 10:41 PM
Advertisement