సరుగుడు తోటలో జంట ఆత్మహత్య
* వివాహేతర బంధాన్ని వీడలేకనే..
* పది రోజుల తర్వాత వెలుగులోకి..
* మృతదేహాలను గుర్తించిన బంధువులు
సఖినేటిపల్లి : కొద్ది రోజుల క్రితం కనిపించకుండా పోయిన జంట.. కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాలుగా కనిపించింది. వివాహేతర బంధాన్ని వీడలేక.. వీరు ఇంటికి సమీపంలో ఉన్న సరుగుడు తోటలోకి వెళ్లి, పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పది రోజుల తర్వాత దుర్వాసన వెదజల్లుతూ, కుళ్లిపోయిన పరిస్థితుల్లో వారి మృతదేహాలు వ్యవసాయ కూలీలకు కనిపించాయి. అంతర్వేదికర గ్రామంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఎస్సై కృష్ణభగవాన్, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
గ్రామానికి చెందిన బెల్లంకొండ నర్సింహమూర్తి(34)కి సుమారు 11 ఏళ్ల క్రితం మహాలక్ష్మితో వివాహమైంది. వీరికి చాలాకాలంగా సంతానం లేదు. కొంతకాలం క్రితం నర్సింహమూర్తి గల్ఫ్ వెళ్లి, ఆరు నెలలు క్రితం స్వగ్రామానికి తిరిగొచ్చాడు. అతడి ఇంటి సమీపంలోని కొబ్బరితోటలో నివసిస్తున్న నాగులపల్లి రుక్మిణి(24)తో అతడికి పరిచయం ఏర్పడింది. అదికాస్తా వివాహేదర బంధానికి దారితీసింది. రుక్మిణికి గతంలో రెండు పెళ్లిళ్లయ్యాయి. వివిధ కారణాల వల్ల విడిపోయిన ఆమె తల్లితోనే ఒంటరిగా ఉంటోంది. వేర్వేరు సందర్భాల్లో రుక్మిణి, మహాలక్ష్మి మధ్య గొడవలు జరిగాయి. అలాగే నర్సింహమూర్తి ఇంట్లో కూడా గొడవలు తలెత్తాయి.
ఈ నేపథ్యంలో ఈ నెల 4 నుంచి నర్సింహమూర్తి, రుక్మిణి కనిపించకుండా పోయారు. ఈ మేరకు నర్సింహమూర్తి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరికోసం గాలిస్తుండగా.. శుక్రవారం ఉదయం పొలం పనుల కోసం సముద్ర తీరానికి సమీపంలోని సరుగుడు తోటల్లోకి వెళ్లిన వారు.. అక్కడ వస్తున్న దుర్వాసనను గమనించారు. అటువైపు వెళ్లిచూడగా.. రెండు కుళ్లిపోయిన మృతదేహాలు కనిపించాయి. ఈ విషయాన్ని స్థానికులకు, వీఆర్‌ఓ గుండాబత్తుల మురళికి తెలిపారు.
వీఆర్‌ఓ ఫిర్యాదుతో ఎస్సై కృష్ణభగవాన్ తన సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అక్కడ లభ్యమైన ఆధారాల మేరకు నర్సింహమూర్తి కుటుంబ సభ్యులను ఆరాతీశారు. మృతదేహాల వద్ద ఉన్న దుస్తులు, చెప్పులు, సెల్‌ఫోన్ నర్సింహమూర్తికి చెందినవిగా వారు గుర్తుపట్టారు. అలాగే మరో సెల్‌ఫోన్, చిరిగిన నైటీని కూడా పోలీసులు కనుగొన్నారు. వీటి ఆధారంగా ఆ రెండు మృతదేహాలు నర్సింహమూర్తి, రుక్మిణివిగా పోలీసులు నిర్థారించారు. మృతుల ఇళ్లకు సుమారు అర కి.మీ.దూరంలో మృతదేహాలు పడి ఉన్నాయి.
కొద్దిరోజులుగా మృతదేహాలు అక్కడే ఉండడంతో, కుక్కలు, నక్కలు పీక్కుతిన్న ఆనవాళ్లున్నాయి. మృతదేహాలను లాక్కుని వెళ్లడంతో.. అవి రెండూ కొద్దిదూరంలో పడి ఉన్నాయి. దుస్తులు కూడా చిరిగిపోయి, ఎముకలు బయటపడ్డాయి. మృతదేహాల వద్ద కూల్‌డ్రింక్, పురుగు మందు సీసా, స్టీల్ గ్లాసులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.