వామ్మో..స్కేబిస్‌ | scabies In Anantapur | Sakshi
Sakshi News home page

వామ్మో..స్కేబిస్‌

Published Wed, Aug 29 2018 12:15 PM | Last Updated on Wed, Aug 29 2018 12:15 PM

scabies In Anantapur - Sakshi

చిన్నారులను పరీక్షిస్తున్న వైద్యులు

అనంతపురం న్యూసిటీ: జిల్లా ప్రజలను మొండి వ్యాధులు పట్టిపీడిస్తున్నాయి. చర్మ సంబంధిత వ్యాధులైన స్కేబిస్‌ (గజ్జి), దోమ కాటు వ్యాధులతో చిన్నారుల నుంచి పెద్దల వరకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్వజనాస్పత్రిలోని చర్మవ్యాధి విభాగంలో రోజూ వచ్చే 250 కేసుల్లో 30 శాతం కేసులు ఇవే ఉంటున్నాయి. ఇక జిల్లాలోని వివిధ పీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రుల్లో ఈ అంటు వ్యాధులతో చిన్నారులు, పెద్దలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

భరించలేనినవ్వలు
స్కేబిస్‌ (గజ్జి) ఇది అంటు వ్యాధి. ఒంటిపై దద్దుర్లుగా వచ్చి గుళ్లలుగా వ్యాప్తి చెందుతుంది. భరించలేని నవ్వలు వస్తాయి. దద్దుర్లు వచ్చిన చోట రుద్దడం కారణంగా పుండుగా మారి ఇబ్బంది పెడుతుంది. ప్రధానంగా హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు ఎక్కువగా వస్తుంటుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వారికి మరింత త్వరితగతిన అంటుతుంది. ఒక వ్యక్తికి సోకితే పదిహేను రోజుల్లో వ్యాధి బయటపడుతుంది. వర్షాకాలం సీజన్‌లో అధికంగా ఈ వ్యాధి వస్తుంటుంది. ఇంట్లో ఒకరికి సోకిందంటే మిగతా వారికి దశలవారీగా వ్యాప్తి చెందుతుంది. అలాగే దోమకాటు ద్వారా ఒంటిపై దద్దుర్లు ఏర్పడుతాయి.  

వందల్లో కేసులు
ఈ సీజన్‌లో వందల కేసులు నమోదవుతున్నాయి. వివిధ పీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రి, సీహెచ్‌సీ, జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిలో అధిక సంఖ్యలో రోగులు క్యూకడుతున్నారు. ప్రజా రోగ్యంపై అవగాహన కల్పించాల్సిన అధికారులు నిద్రమత్తులో ఉన్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిన్నపాటి సమస్యనేనంటూ తీసిపారేస్తున్నారు.  

ఇదీ సంగతి
శరీరంలోని చేతులూ కాళ్ల మధ్యలో చిన్న గుళ్లలుగా (పుండ్లు) ఏర్పడి, వ్యాధి ఏమని తెలుసుకునేలోపే ఒంటిపై వ్యాప్తి చెందుతుంది స్కేబిస్‌. శరీరంలో ఏదో ఒక ప్రాంతం నుంచి అన్ని భాగాల్లో గుళ్లలుగా ఏర్పడుతాయి. భరించలేని నవ్వలు. రుద్దుకుంటే (రాపిడి చేస్తే) మరింత నవ్వలు. చివరకు అవి పుండ్లుగా మారి ఇబ్బంది పెడతాయి. వర్షాకాలం సీజన్‌లో ఇలాంటి కేసులు పెరిగిపోతున్నాయి.

ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి
వర్షాకాలంలో  చర్మవ్యాధులైన స్కేబిస్, దోమకాటు వ్యాధులు అధికంగా వస్తాయి.
స్కేబిస్‌ వ్యాధికి గురైన వారు యాంటీ స్కేబిటిక్‌ లోషన్లు (పర్‌మైట్, స్కేబెక్స్‌)వాడాలి.
లోషన్‌ పట్టించిన 24 గంటలకు స్నానం చేసుకోవాలి.
దురదలు అధికంగా ఉంటే సిట్రిజెన్‌ మాత్ర వాడాలి.
పుండుగా మారినప్పుడు వైద్యుడి సలహాతో యాంటీబయాటిక్స్‌ వాడాలి.
వ్యాధి సోకిన వారి వస్త్రాలను మరొకరు ధరించరాదు.
వ్యాధి తగ్గిన వెంటనే వస్త్రాలు వేడి నీటిలో శుభ్రంగా కడుగుకోవాలి.
కుటుంబంలో ఒకరికీ ఈ వ్యాధి సోకితే మిగితా వారు ముందస్తుగా లోషన్‌ పట్టించుకోవాలి.
ఇక దోమకాటు వ్యాధులకు గురికాకుండా పరిశుభ్రత్తకు పెద్ద పీట వేయాలి.
మస్కిటో కాయిల్స్, దోమతెరలు వాడాలి.
వారంలో ఒక రోజు డ్రైడే పాటించాలి.

నెలకు 600 కేసుల పైమాటే
ఇటీవల కాలంలో స్కేబిస్, దోమకాటు వ్యాధులతో వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. నెలకు దాదాపుగా 600 కేసులకుపైగానే ఈ వ్యాధులతో బాధపడేవారు వస్తున్నారు.  ప్రధానంగా స్కేబిస్‌ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలి. దగ్గర్లోని ఆస్పత్రిలో సంప్రదించి వైద్యం పొందాలి. లేని పక్షంలో ఇతరులకు వ్యాíపిస్తుంది.– డాక్టర్‌ బలరామిరెడ్డి, చర్మవ్యాధి నిపుణులు, సర్వజనాస్పత్రి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement