* రామయ్యపేట నిర్వాసితుల ఆందోళన
* గ్రామం ఖాళీ చేసేవరకూ ఆపాలని డిమాండ్
* అయినా వినని అధికారులు
పోలవరం : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రామయ్యపేట గ్రామ సమీపంలో స్పిల్ చానల్ తవ్వకం పనులను శుక్రవారం సాయంత్రం అధికారులు పోలీసు బందోబస్తు మధ్య ప్రారంభించారు. ఈ పనులను అడ్డుకునేందుకు అధిక సంఖ్యలో రామయ్యపేట నిర్వాసితులు తరలివచ్చారు. కొద్దిసేపు పనులను అడ్డుకున్నారు. అధికారులు వారిని హెచ్చరించి వెనక్కు పంపేసి పనులను కొనసాగించారు.
పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామం రామయ్యపేట సమీపంలోని 80 ఎకరాల భూమిలో శుక్రవారం సాయంత్రం స్పిల్‌చానల్ నిర్మాణం కోసం మట్టి తవ్వకం పనులు ప్రారంభించారు. ఈ మట్టిని గ్రామ సమీపంలో డంపింగ్ చేస్తున్నారు. గతంలో అనేకసార్లు నిర్వాసితులు ఈ పనులను అడ్డుకున్నారు. గ్రామం ఖాళీ చేసి వెళ్లే వరకూ ఈ పనులు చేపట్టవద్దని డిమాండ్ చేశారు. దీంతో అధికారులు అప్పట్లో పనులను నిలిపివేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మళ్లీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు స్పీల్‌చానల్ తవ్వకం ప్రారంభించారు.
దీంతో రామయ్యపేట నిర్వాసితులు తరలివచ్చి తమకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజ్ పూర్తిగా అమలు చేయలేదని, కొందరికి ఇళ్లస్థలాలు కేటాయించలేదని, పునరావాస కేంద్రంలో ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి కాలేదని, గ్రామం విడిచి వెళ్లే వరకు పనులు చేయబోమని చెప్పిన అధికారులు ఇప్పుడు ఎలా ప్రారంభించారని ప్రశ్నించారు. గ్రామాన్ని ఖాళీ చేసేవరకూ పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పనులు చేస్తున్న వారికి నిర్వాసితులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది.
ఈ సమయంలో అక్కడికి చేరుకున్న జంగారెడ్డిగుడెం ఆర్డీఓ ఎస్.లవన్న మాట్లాడుతూ ఈ భూములను ఎనిమిదేళ్ల క్రితం సేకరించి ఇరిగేషన్ అధికారులకు అప్పగించామని, ఈ పనులను అడ్డుకోవద్దని హెచ్చరించారు. పోలవరం ఎస్సై కె. శ్రీహరిరావు మాట్లాడుతూ నిర్వాసితులకు సమస్యలు ఉంటే గ్రామంలో అధికారులతో మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని, పనులకు అడ్డురావద్దని స్పష్టం చేశారు. దీంతో నిర్వాసితులు వెనుతిరిగి వెళ్లిపోయారు. సుమారు 50 మంది పోలీసుల బందోబస్తు మధ్య అధికారులు పనులు కొనసాగించారు.
బందోబస్తు మధ్య స్పిల్‌చానల్
Published Sat, Apr 23 2016 12:28 AM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM
Advertisement
Advertisement