సీమాంధ్రలో సకలం బంద్
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్ర విభజన బిల్లుపై అభిప్రా యాన్ని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి నుంచి వచ్చిన వర్తమానాన్ని రాష్ట్రానికి పంపిన తీరును తీవ్రంగా నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం చేపట్టిన బంద్ సంపూర్ణంగా సాగింది. బిల్లుపై చర్చ కోసం శుక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో కేంద్రానికి తమ నిరసనను బంద్ రూపంలో గట్టిగా చాటాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిం చారు. అలాగే, ఏపీఎన్జీవోల సంఘం, వివిధ ప్రజాసంఘాలు, అక్కడక్కడా టీడీపీ శ్రేణులూ బంద్‌లో పాల్గొనడంతో సీమాంధ్ర పూర్తిగా స్తంభించింది. ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. వ్యాపార వాణిజ్య సంస్థలన్నీ మూతపడ్డాయి. కృష్ణాజిల్లా పెడనలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు 216 జాతీయ రహదారిపై బైఠాయించగా, కంచికచర్లలో 65వ నంబరు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు.
హనుమాన్‌జంక్షన్‌లో ప్రధాన కూడలిలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేసి వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. చిత్తూరులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగర మునిసిపల్ కార్యాలయా న్ని ముట్టడించారు. పీలేరులో తెలంగాణ బిల్లు ముసాయిదా ప్రతులను దహనం చేశారు. తిరుపతిలో వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు స్థానిక తెలుగుతల్లి విగ్రహం కూడలిలో రాస్తారోకో నిర్వహించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ఎస్వీయూ, మహిళా, వెటర్నరీ వర్శిటీలలో విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మదనపల్లిలో జేఏసీ, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు.
ప్రకాశం జిల్లా కందుకూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టగా, నేతలను పోలీసులు అరెస్టుచేశారు. ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఎన్జీవోలు ఆందోళన చేస్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని జాతీయ రహదారిపై వైఎస్సార్‌సీపీ నేతలు రాస్తారోకో నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ, ఎన్జీఓలు ఇచ్చిన పిలుపు మేరకు రోడ్లపైకి వచ్చిన ప్రజలను చూసైనా పాలకులు మనసు మార్చు కోవాలని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి హితవు పలికారు.