పథకం పరిధిలోకి పంట కాలువల ప్రక్షాళన
తొలిసారిగా రూ.36 కోట్లతో అంచనాలు
పాలనాపరంగా ఆమోదించిన కలెక్టర్
కాలువలు మూసివేసిన వెంటనే పనులు
212 కిలోమీటర్ల మేర పనులు,
నిత్యం 60 వేల మందికి ఉపాధి
సాక్షి, కాకినాడ : ఏటా పంటకాలువల్లో పూడికతీత ఒక ప్రహసనంగా సాగేది. కాలువలు మూసి వేసే సమయానికే పనులు చేపట్టే విధంగా అంచనాలు రూపొందించాలని రైతులు గగ్గోలు పెట్టడం, కాలువలు కట్టేశాక కూడా ఆ అంచనాలకు ఆమోదం లభించక పోవడం, తిరిగి నీటిని విడుదల చేయడానికి ముందు పనులు ప్రారంభించడం పరిపాటిగా మారింది. దీంతో కాలువలు పూడుకుపోయి శివారు చేలకు నీరందక రైతులు నష్టపోయేవారు.
జిల్లాను సస్యశ్యామలం చేసే పంట కాలువల్లో ఏటా పూడిక తీత పనులను ఇప్పటి వరకు ఇరిగేషన్ శాఖ చేపట్టేది. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేసే ప్రక్రియలో భాగంగా ఈ ఏడాది నుంచి ఆ పనులను కూడా ఈ పథకంలో చే పట్టేందుకు వీలు కల్పించారు. నిరుటి నుంచే ఈ పనులు చేపట్టాలని భావించినా సాంకేతిక సమస్యల వల్ల కార్యరూపం దాల్చలేదు. ఏది ఏమైనా ఈ ఏడాది పంటకాలువల్లోని పూడిక తీతను పూర్తిస్థాయిలో ఉపాధి హామీలో చేపట్టాలని నిర్ణయించారు. డ్వామా పీడీగా బాధ్యతలు చేపట్టిన సంపత్ కుమార్ ఈ పనులపైనే ప్రత్యేకదృష్టి పెట్టారు. తూర్పు, మధ్య డెల్టాల్లో ప్రధానమైన కాలువలకు అనుసంధానంగా పెద్ద సంఖ్యలో పంట కాలువలు ఉన్నాయి. వీటన్నింటిలో పూడికతీత పనులను తొలిసారిగా ఉపాధిహామీ ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. సుమారు 212 కిలోమీటర్ల పొడవు గల ఈ కాలువల్లో పూడిక తీత పనుల కోసం రూ.36 కోట్లతో రూపొందించిన అంచనాలను కలెక్టర్ నీతూ ప్రసాద్ పరిపాలనాపరంగా ఆమోదించారు.
కాలువలు మూసివేసిన మర్నాటి నుంచే పనులు ప్రారంభించేలా పీడీ పి.సంపత్‌కుమార్ ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇరిగేషన్ ఎడ్వయిజరీ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు మార్చి 31న కాలువలు మూసి వే యాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ మొదటివారంలో పనులు చేపట్టేలా ప్రణాళికలు రూపొందించారు. రోజుకు 60 వేల మందికి ఉపాధి కల్పించేలా సుమారు 50 రోజుల పాటు ఈ పనులు చేపట్టనున్నారు. అయితే.. రబీ సాగు ఆలస్యంగా మొదలైన దృష్ట్యా రైతుల చేతికి పంట పూర్తిస్థాయిలో అందాలంటే ఏప్రిల్ నెలాఖరు వరకు కాలువలకు నీరు ఇవ్వాల్సి ఉంటుంది. అదే జరిగితే పూడికతీత పనులు మే నెలలో జరిగే అవకాశముంది.
పూడికతీతకు‘ఉపాధి’ ఊతం
Published Fri, Feb 21 2014 1:06 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement