సాక్షి, అమరావతి : ‘వాట్ ఈజ్ హీ?’ ప్రాజెక్ట్ మేనేజర్ అడిగేలోపే బ్యాక్‌గ్రౌండ్ టీం లీడర్ సోషల్ మీడియాలో సేకరించిన సమాచారం మొత్తం ఆయన ముందుంచాడు. ‘ఫేస్‌బుక్ ప్రొఫైల్... గుడ్. పోస్టింగ్స్... ఇంట్రస్టింగ్. లింక్డ్ ఫ్రెండ్స్.. ఓకే. ట్విట్టర్ రెస్పాన్సింగ్ రేట్.. ఎక్సలెంట్. సోషల్ మీడియా ఇంట్రాక్షన్..యావరేజ్.
సో! కమ్యూనికేషన్ స్కిల్స్ మైనస్ పాయింట్ అన్న మాట’ అభ్యర్థిని ఎంపిక చెయ్యాలా? వద్దా? అనే విషయంలో ప్రాజెక్ట్ మేనేజర్ ఓ నిర్ధారణకొచ్చాడు.. ఇదీ..ప్రస్తుతం పేరున్న కంపెనీలన్నీ తమ సంస్థల్లో ఉద్యోగ నియామకాలు చేసే సమయంలో సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అవలంబిస్తున్న విధానం. నిత్య జీవితంలో సోషల్ మీడియా భాగమైపోయిన ప్రస్తుత తరుణంలో.. స్నేహితుల అకౌంట్‌ను యాడ్ చేసేప్పుడు, పోస్టింగ్స్, ఫొటోలు అప్‌లోడ్ చేసేప్పుడు ఇతర విషయాల్లోనూ జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
మౌస్‌క్లిక్‌లోనే అంతా..
స్నేహితులు, సన్నిహితులను పలకరించడానికే కాదు..ఉద్యోగ నియామకాల్లోనూ ఫేస్‌బుక్, ట్విట్టర్, లింక్డ్ ఇన్, గూగుల్ ప్లస్ వంటి నెట్‌వర్కింగ్ సైట్లు కీలకపాత్ర పోషిస్తున్నాయి. పేరున్న అన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీలు, ప్రైవేటు సంస్థలూ ఇప్పుడు ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాయి.
రెజ్యూమ్ అందగానే ముందుగా ఫీడ్‌బ్యాక్ చూస్తున్నాయి. ఆయా సంస్థలు ఏర్పాటు చేసుకున్న బ్యాక్‌గ్రౌండ్ టీంలకు రెజ్యూమ్‌ను ఫార్వర్డ్ చేస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో అభ్యర్థి నడవడికను బ్యాక్‌గ్రౌండ్ టీం క్షుణ్ణంగా పరిశీలించి సంస్థకు స్పష్టమైన నివేదిక ఇస్తోంది. ఇక్కడొచ్చే మార్కులే అభ్యర్థి భవిష్యత్‌ను నిర్ణయిస్తున్నాయి.
పోస్టింగ్స్... ఫాలోఅప్స్ కీలకం..
సోషల్ మీడియా సర్వేల ప్రకారం గడచిన ఐదేళ్లుగా 65 శాతం ప్రైవేటు కంపెనీల నియామకాలన్నీ సామాజిక మాధ్యమం ఆధారంగా జరుగుతున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ టీంలో సంస్థ సిబ్బందితో ఏమాత్రం సంబంధం లేని వారే ఉంటున్నారు. వీరు ఏదో రకంగా సోషల్ మీడియాతో కనెక్ట్ అవుతారు. సెర్చ్ ఇంజిన్‌లోకెళ్లి ఈ–మెయిల్ సాయంతో వివరాలన్నీ తీసుకుంటారు.
♦ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే చిత్రాలను బట్టి వ్యక్తి అభిరుచి అంచనా వేయడం సాధ్యమని ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీకి చెందిన బ్యాక్ గ్రౌండ్ టీంలో పనిచేస్తున్న నితీష్ తెలిపారు. ఆ వ్యక్తి ప్రొఫైల్‌ను చూస్తే భావాలను అంచనా వేసే వీలుందని, లైక్ చేసే ఫొటోలను పరిశీలిస్తే స్వభావాన్ని గుర్తించవచ్చని వివరించాడు.
వ్యక్తిత్వాన్ని అంచనా వేసేది ఇలానే...
♦ టెక్ట్స్ మెసేజ్‌లను కొన్నింటిని పరిశీలిస్తారు. ట్విట్టర్‌లో ఆయన స్పందించే తీరును బట్టి వ్యక్తిత్వాన్ని తెలుసుకుంటారు. వ్యతిరేక అభిప్రాయం వెలిబుచ్చేప్పుడు కూడా సున్నితంగా స్పందించే తత్వానికి సంస్థలు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాయని సోషల్ డిటెక్టివ్ సంస్థలో పనిచేస్తున్న కొండూరి ఆదిత్య తెలిపాడు.
♦ ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్ ఎవరున్నారు? ఎలాంటి వాళ్లున్నారు? అనేది అతని సామాజిక స్టేటస్‌ను తెలుపుతుందని, అకౌంట్‌కు యాడయ్యే వాళ్లతో జరిగే సంభాషణలు అభ్యర్థి నడవడికను నిర్ధారిస్తుందని సాఫ్ట్‌వేర్ డెవలపర్ దత్తప్రసాద్ తెలిపారు.
♦ వ్యక్తిలోని నాయకత్వ లక్షణాలను పరిశీలించేందుకు సోషల్ మీడియాలో ఫాలోఅప్స్ బాగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.
♦ అభ్యర్థిలోని భాషా పరిజ్ఞానం, ఇంగ్లిష్‌పై పట్టును సామాజిక మాధ్యమాల ద్వారా అంచనా వేస్తున్నారు. ఆంగ్లంలో వచ్చే కామెంట్స్, పోస్టింగ్‌లను అతను ఎలా అర్థం చేసుకుంటాడు. దానికి ఆంగ్లభాషలో ఎలా స్పందిస్తాడనేది నిశితంగా గమనించాల్సిన అవసరం ఉంటుందని బ్యాక్‌గ్రౌండ్ టీంలో అనలైజర్‌గా పనిచేస్తున్న శ్రీవాణి తెలిపింది.
బీ కేర్‌ఫుల్...!
సోషల్ మీడియాలో స్నేహితుల అకౌంట్‌ను యాడ్ చేసేప్పుడు, పోస్టింగ్స్, ఫొటోలు అప్‌లోడ్ చేసేప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. అంతేకాదు.. రెస్యూమ్‌లో అనుభవానికి సంబంధించిన సర్టిఫికెట్స్ తప్పుగా ఉన్నా... సోషల్ మీడియా సెర్చ్‌లో ఇట్టే దొరికిపోతారు. కాబట్టి సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలి
–కె. కిరణ్‌కుమార్, ఐబీఎం ఉద్యోగి, అమెరికా
అప్‌డేట్ అవుతుండాల్సిందే
ఉద్యోగ నియామకాల్లో కంపెనీలు ప్రధానంగా అభ్యర్థి వేగాన్ని పరిగణనలోనికి తీసుకుంటున్నాయి. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్‌డేట్ అయ్యే వాళ్లకే ఇది సాధ్యం. భావ వ్యక్తీకరణ, సామాజిక అంశాలపై తరచూ స్పందించే అలవాటు ఉండాలి. అంతేకాకుండా, ఎంచుకున్న రంగానికి సంబంధించిన పోస్టింగ్స్ కూడా కెరీర్‌లో అతనికున్న ఆసక్తిని చూపిస్తాయి. కాబట్టి సబ్జెక్ట్ పరంగానూ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవ్వాల్సిందే. – దీప, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి
Comments
Please login to add a commentAdd a comment