- ఎస్‌ఐ అరెస్ట్‌తో ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో గుబులు
- సీఐడీ విచారణలో అధికారులు కర్ణాటక, గోవా గ్యాంగ్‌లతో
- వీరి సంబంధాలపై ఆరా
పలమనేరు: జిల్లాలోని ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో మరికొంత మంది ఇంటి దొంగలు ఉన్నట్టు తెలుస్తోంది. తిరుపతిలోని ఐఎంఎల్ (ఇండియన్ మేడ్ లిక్కర్ డిపో)కు చెందిన ఓ రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ శంకరయ్య, అతని బావమరిది ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ విజయకుమార్‌ను సీఐడీ (సిట్) రెండ్రోజుల క్రితం తిరుపతిలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరితో పాటు ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు చెం దిన మరో ఎస్‌ఐతో పాటు హెడ్‌కానిస్టేబుల్ కూడా ఇంటి దొంగల్లో ఉన్నట్లు తెలుస్తోంది. పలమనేరు సమీపంలో సెప్టెంబర్ 15న భారీగా నకిలీ మద్యం బయటపడిన విషయం తెలిసిందే.
ఈ కేసు విషయంగా రంగంలోకి దిగిన పలమనేరు పోలీసులు మునినాథ్ అనే అంతర్రాష్ట్ర స్పిరిట్ స్మగ్లర్‌ను పట్టుకున్నారు. ఇతనికి బెంగళూరు, గోవాకు చెందిన ఆర్‌ఎస్ (రెక్టిఫైడ్ స్పిరిట్) స్మగ్లర్లతో సంబంధాలున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ప్రతినెలా మునినాథ్ ఇక్కడి అధికారులకు స్మగ్లర్ల నుంచి భారీగా మామూళ్లు ఇప్పించేవాడని తెలిసింది. ఇదే సమయంలో సెప్టెంబర్ 18న సాక్షి దినపత్రికలో మునినాథ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌తోనూ లింకులు అనే శీర్షికన కథనం ప్రచురితమైంది.
ప్రస్తుతం సాక్షి కథనం అక్షర సత్యమైంది. సాధారణ ఎన్నికలకు మూడ్రోజుల ముందు పలమనేరు నియోజకవర్గంలోని వి.కోట వద్ద కర్ణాటక సరిహద్దులో భారీగా దాచి ఉన్న గోవా మద్యాన్ని కేజీఎఫ్, బంగారుపేట్, బేతమంగల్ పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఇదే లిక్కర్ జిల్లాలోని పలుచోట్ల పట్టుబడింది. ఒకే గ్యాంగ్ ఎన్నికలకు మద్యం సరఫరా చేసినట్టు ఉన్నతాధికారులు నిర్ధారణకొచ్చారు.
ఇప్పుడు మునినాథ్ నోరు విప్పడంతో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకొచ్చాయి. ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి బదిలీ చేయడంతో ప్రత్యేక విచారణ చేపట్టారు. ఫలితంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌లోని కొందరు ఇంటి దొంగలు ప్రస్తుతం బయటపడ్డారు. ఏదేమైనా సీఐడీ విచారణతో ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లోని ఇంటి దొంగల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.