సాక్షి ప్రతినిధి, వరంగల్ : మంత్రి గారి బంధువు మరోసారి భూదానం చేస్తున్నారహో...! మొన్న ఆర్టీఏ ఆఫీసుకు... ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవనానికి స్థలం ఇస్తున్నారు. నమ్మలేకున్నా ఇది రియల్ వ్యాపారంలో మరో ముందడుగు. సొంత వెంచర్‌లోని ప్లాట్లకు డిమాండ్ పెంచి.. అధిక రేట్లకు అమ్ముకోవచ్చనే ఎత్తుగడలో ఇది రెండో భాగం. జనగామలో ఉండాల్సిన ఆర్టీఏ ఆఫీసుకు.. 3.5 కిలోమీటర్ల దూరంలో పెంబర్తి గ్రామ శివారులోని రియల్ ఎస్టేట్ వెంచర్‌లో రెండెకరాల స్థలాన్ని విరాళంగా ఇచ్చిన వ్యవహారం ఇప్పటికే బట్టబయలైంది. స్వయానా మంత్రి బంధువు ఆ రియల్ ఎస్టేట్ సంస్థకు డెరైక్టర్ కావడంతో ఫైళ్లు చకచకా కది లాయి.
లక్షల్లో విలువైన స్థలాన్ని ఎరగా చూపి కోట్లాది రూపాయలు కొల్లగొట్టేందుకు వేసిన వ్యాపార ఎత్తుగడ.. మంత్రి కనుసన్నల్లో జరిగిన ‘రియల్’ మాయను కళ్లకు కట్టించింది. తాజాగా అదే వెంచర్‌లో మరో ప్రభుత్వ ఆఫీసుకు స్థలం కేటాయించేందుకు ఫైళ్లు కదులుతున్నాయి. ఈసారి జనగామలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు రియల్ ఎస్టేట్ నిర్వాహకులు ఎర వేశారు. ప్రస్తుతం ఈ ఆఫీసు అద్దె భవనంలో ఉంది. శాశ్వత భవన నిర్మాణానికి 600 చదరపు గజాల స్థలం కావాలని సంబంధిత అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.
మీకు స్థలం కావాలంటే... మేం ఉచితంగానే అంతమేర స్థలాన్ని విరాళంగా అందిస్తామంటూ మంత్రి బంధువు మళ్లీ పావులు కదిపినట్లు తెలిసింది. మంత్రి అండదండలు... రాజకీయ పరపతితో రిజిస్ట్రేషన్ విభాగపు రాష్ట్ర కమిషనర్‌కు ఇప్పటికే తమ సమ్మతి లేఖను అందించినట్లు సమాచారం. గతంలో ఆర్టీఏ ఆఫీసుకు కేటాయించిన స్థలాన్ని ఆనుకుని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు సైతం స్థలం ఇవ్వజూపినట్లు వినికిడి. పెంబర్తి సమీపంలోని పద్మావతి సెవెన్‌హిల్స్ డెవెలపర్స్ రియల్ వెంచర్‌లో భవన నిర్మాణానికి స్థలాన్ని ఉచితంగా కేటాయించేందుకు యజమానులు ముందుకు వచ్చిన విషయాన్ని స్థానిక అధికారులు సైతం ధ్రువీకరించారు.
ప్రస్తుతం స్థల సేకరణ అంశం ప్రతిపాదనల దశలో ఉందని, ఉన్నతాధికారుల నుంచి ఇంకా ఆమోదం రాలేదని వివరణ ఇచ్చారు. రూ.60 లక్షల విలువైన ఆర్టీఏ ఆఫీసు భవనంతో పాటు కొత్తగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసును అక్కడికి తరలిస్తే.. వాటికి అనుబంధంగా ఉండే వ్యాపారాలతో ఆ ప్రాంతం ప్రాధాన్యం అంతకంతకు పెరగటం ఖాయం. అదే ప్రచారంతో తమ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కోట్లకు పడగలెత్తించే ఆరాటంలో భాగంగానే మంత్రి బంధుగణం ఈ ఫైళ్లు కదుపుతున్న తీరు.. సొంత నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది.
ఉచితంగా జాగా!
Published Mon, Aug 19 2013 3:00 AM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM
Advertisement
Advertisement