నిడమర్రు:పది పరీక్షలు ముగిసాయి. టెన్త్ తర్వాత విద్యార్థులు ఇంటర్ చదివేందుకు ఆసక్తి చూపడం సహజం. ప్రత్యేక నైపుణ్యాలతో కూడిన మెడికల్ కోర్సులు చేయాలన్నా, ఇంజనీరింగ్‌లాంటి సాంకేతిక కోర్సులు చదవాలన్నా, సంప్రదాయక డిగ్రీలో చేరి ఉన్నత విద్యలో రాణించాలన్నా.. ఇంటర్మీడియట్‌తోనే అరంగేట్రం చేయాల్సిందే. అయితే ఇంటర్‌లో ఉండే గ్రూపులు, వాటి ఎంపికల్లో విద్యార్థికి కొన్ని మార్గదర్శకాలు..
ఉన్నత విద్యకి ఇంటర్ వారధి
ఉన్నత విద్యకు ఇంటర్ ‘వారధి’లాంటిది. అందుకే ఇంటర్‌లో గ్రూపును ఎంచుకోవడమే అత్యంత కీలకమైన అంశం. ఎందుకంటే ఈ గ్రూపు మీదే మిగిలిన(ఉన్నత) విద్య అంతా ఆధారపడి ఉంటుంది. పాఠశాల విద్యకు, ఉన్నత విద్యకూ మధ్య వారధిలాంటి ఇంటర్‌లో చేరేముందు వివిధ గ్రూపుల గురించి తెలుసుకుని, వారు ఏ రంగంలో రాణించగలరో విద్యార్థులు ముందే ఒక నిర్థారణకు రావాలి. ఇంటర్‌లో ఉండే గ్రూపుల గురించి విద్యార్థికి అడ్మిషన్లకు ముందే కొంత పరిజ్ఞానం పొందాలి. అంతకంటే ముందు ఆయా గ్రూపుల్లోని సబ్జెక్ట్‌లపై తన బలాలు, బలహీనతలు బేరీజు వేసుకుని గ్రూపులను ఎంపిక చేసుకోవాలి. విద్యార్థి అభిరుచి, సామర్థ్యం రెండింటిని దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు కూడా ఏ గ్రూపులో చేరాలనే విషయమై అతడికి సలహా ఇవ్వాలి.
పోటీ పరీక్షలకు కొత్తరూపు
కేంద్ర ప్రభుత్వం ఇంజనీరింగ్, మెడికల్ ప్రవేశాలకు ఉమ్మడి పరీక్షలను నిర్వహించేలా ప్రయత్నం నేపథ్యంలో ఎంసెట్ తదితర పరీక్షలపై విద్యార్థి అవగాహన పెంచుకోవాలి. మెడికల్‌కు నీట్, ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు ఐసీట్ లను నిర్వహిస్తున్నందున, రూపు మారుతున్న పోటీ పరీక్షలకు అనుగుణంగా విద్యార్థులు గ్రూపులను ఎంచుకోవాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు.
85 గ్రూపు కాంబినేషన్స్
ఇంటర్ బోర్డు వివిధ కాంబినేషన్లలో సుమారు 85 గ్రూపులను రూపొందించింది. అయితే ఇందులో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ, హెచ్‌ఈసీలు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ/ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ఈ గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. సైకాలజీ, జాగ్రఫీ, పబ్లిక్ అడ్మిస్ట్రేషన్, మ్యూజిక్, కామర్స్, సోషియాలజీ వంటి సబ్జెక్ట్‌లు కొన్ని గ్రూపుల్లో కాంబినేషన్‌గా ఉన్నాయి.
ఎంపీసీ గ్రూప్
ప్రధానంగా ఇంజనీరింగ్ వృత్తిలో స్థిరపడాలనుకునేవారు ఈ గ్రూప్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎంసెట్‌తోపాటు ఐఐటీల్లో ప్రవేశ పరీక్ష జేఈఈ–మెయిన్ రాసేందుకు ఈ గ్రూపులో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి. బిట్స్ పిలానీలో ప్రవేశానికి జరిగే బిట్‌శాట్ రాసేందుకు ఎంపీసీ విద్యార్థులే అర్హులు.
బీఎస్సీ
ఇంటర్ తర్వాత బీఎస్సీలో చేరేటప్పుడు మ్యాథ్స్ –ఫిజిక్స్–కెమిస్ట్రీ కాంబినేషన్స్‌లో వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన గ్రూపుల్లో చేరవచ్చు.
బైపీసీ గ్రూపు
వైద్య సంబంధిత, ఇతర వృత్తులు, ఉద్యోగాల్లో స్థిరపడాలనుకునేవారు బైపీసీ వైపు మొగ్గు చూపుతారు. అగ్రికల్చర్ కోర్సులకూ ఈ గ్రూపే ప్రాతిపదిక. ఓపిగ్గా చదవడం, చక్కగా బొమ్మలు వేయడం ఈ గ్రూపు విద్యార్థులకు ఉండాల్సిన లక్షణాలు. బయోటెక్నాలజీ, ఫార్మసీ, అగ్రికల్చర్, ఆక్వాకల్చర్, జియాలజీ, ఎన్విరాన్‌మెంట్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, ఫారెస్ట్ రేంజర్, జియాలజీ, హార్టీకల్చర్ తదితర రంగాల్లో ఈ గ్రూపు విద్యార్థులకు అవకాశాలు ఉన్నాయి.
ఎంఈసీ, సీఈసీ గ్రూపులు
సేవారంగంవైపు చూసేవారు, సైన్స్, ఆర్ట్స్ గ్రూపులపై పెద్దగా ఆసక్తి లేనివారు లెక్కలు, గణాంకాలు, కామర్స్ సబ్జెక్టులతో కూడిన కామర్స్, ఎకనమిక్స్, సివిక్స్ సబ్జెక్టులున్న ఎంఈసీ, సీఈసీల్లో చేరవచ్చు. చార్టెర్డ్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలు, కమర్షియల్ లాయర్లు, బ్యాంకు మేనేజర్, చార్టెర్డ్ ఫైనాన్షియల్ ఎనాలిస్ట్, ట్యాక్స్ ఆడిటర్ లాంటి వృత్తుల్లో స్థిరపడాలనుకునేవారు, బీమా సంస్థల్లో, స్టాక్ మార్కెట్లలో ఉద్యోగాలు పొందాలనుకునేవారు ఈ గ్రూపులను ఎంచుకోవచ్చు.
∙గణితం, కామర్స్ సబ్జెక్టులు రెండూ అధ్యయనం చేయడం వల్ల మరింత మెరుగైన ఉపాధి అవకాశాలు ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. సీఏ, ఐసీడబ్ల్యూఏ, బిజినెస్ మేనేజ్‌మెంట్, కంప్యూటర్ రంగాలోŠల్ ఉన్నత విద్యకు అవకాశం ఉంది. ఇటీవల ఇంటర్లో కామర్స్ ఒక సబ్జెక్టుగా గ్రూపులు ఎంచుకుంటున్నవారి సంఖ్య పెరుగుతుంది.
ఆర్ట్స్ గ్రూపులు
పోటీ పరీక్షలకు దృష్టిలో పెట్టుకునేవారు గతంలో ఆర్ట్స్ గ్రూపుల్లో చేరేవాళ్లు. కానీ ఐటీ రంగానికి కష్టకాలం రావడం, ఇంజనీరింగ్ చేసినవారిలో నిరుద్యోగత ఎక్కువగా ఉండటం వంటి కారణాలతో మళ్లీ ఆర్ట్స్ గ్రూపులపై మొగ్గు చూపుతున్నారు. కార్పొరేట్ కళాశాలలు సైతం యూపీఎస్‌సీని దృష్టిలో ఉంచుకుని ఇంటర్ నుంచే శిక్షణనిస్తున్నాయి. దీంతో ఆర్ట్స్ గ్రూపులకు ఆదరణ పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. సివిల్స్‌లో రాణించేందుకు కొన్ని పోటీ పరీక్షల్లో మంచి స్కోర్లు సాధించేందుకు ఇంటర్మీడియట్ స్థాయిలో ఈ గ్రూపుల్లో చేరుతున్నారు. డిగ్రీలో సోషల్ సైన్సెస్(సోషల్, కల్చ రల్, పొలిటికల్, ఎకనమిక్స్ సబ్జెక్టుల్లో) చేరేందుకు కూడా ఈ గ్రూపులు అనుకూలం. విదేశీ భాషల్లో పరిజ్ఞానం సాధించడం ద్వారా ఎన్నో అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. చైనీస్, స్పానిష్ లాంటి భాషల్లో ప్రావీణ్యం ఉన్న వారికి అనువాదకులుగా ప్రస్తుతం ఎంతో డిమాండ్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment