జిల్లాలో ఉద్యోగ ఉపాధి అవకాశాలకు పెద్దపీట వేస్తూ పరిశ్రమలు స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పారిశ్రామికవేత్తలు సైతం పరిశ్రమల స్థాపననకు చిత్తూరు జిల్లా అనువైన ప్రాంతంగా గుర్తించారు. అందులో భాగంగా టెక్స్‌టైల్స్ పార్క్స్, వింగ్‌టెక్ ఎల్రక్టానిక్స్, ఇంటెలిజెంట్ సెజ్‌లు రానున్నాయి. ఆయా పారిశ్రామిక వాడల ద్వారా ప్రత్యక్షంగా 25వేల మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: అవినీతి అక్రమాలకు తావు లేకుండా, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ నూతన పారిశ్రామిక కారిడార్‌కు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా భూ సేకరణకు సిద్ధమైంది. గత ప్రభుత్వ హయాంలో భూ సేకరణలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చోటుచేసుకోవడంతో పాత విధానానికి స్వస్తి పలికి.. నూతన పారిశ్రామిక విధానానికి కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ ప్రోత్సాహం, పరిశ్రమల స్థాపనకు అనువైన ప్రాంతం కావడంతో పారిశ్రామికవేత్తల చూపు జిల్లా వైపు పడింది. అరవింద్, రేమాండ్స్, బిన్ని మిల్స్ తదితర ఆరు టెక్స్‌టైల్స్ పార్కులు, వింగ్‌టెక్ ఎల్రక్టానిక్ యూనిట్, ఇంటెలిజెంట్ సెజ్‌లు రానున్నాయి. పరిశ్రమల స్థాపన కోసం జిల్లా వ్యాప్తంగా 24వేల ఎకరాలు భూసేకరణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
నీటి కొరతపై ప్రత్యేక దృష్టి
పారిశ్రామికవాడలకు ఎలాంటి నీటి కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. కండలేరు జలాశయం నుంచి రూ.200కోట్ల వ్యయంతో 6 టీఎంసీల నీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. పైగా తిరుపతి నుంచి వెళ్లే మురుగు నీటిని రూ.20కోట్లు వెచ్చించి శుద్ధి చేసిన జలాలను అందించే ప్రక్రియకు కూడా శ్రీకారం చుట్టింది.
అనువైన ప్రాంతం
చెన్నై, బెంగళూరు మహా నగరాల్లో పరిశ్రమలు నెలకొల్పడం కష్టతరమైంది. అక్కడ భూముల ధరలు ఆకాశానికి చేరాయి. పరిశ్రమ నెలకొల్పేందుకు అనుమతులు తదితర విషయాలతో పోలిస్తే జిల్లా అనువైన ప్రాంతంగా పారిశ్రామికవేత్తలు గుర్తించారు. జిల్లాలో అవసరమైన భూములు, రహదారి సౌకర్యం, రైల్యే మార్గం, నీటి సౌకర్యం, ఆకాశ మార్గంలో రాకపోకలకు అనుకూలంగా రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం, జిల్లాకు అతి సమీపంలో సముద్రతీర ప్రాంతం ఉంది. దీంతో పెట్టుబడులకు పెట్టేందుకు ఇది అనువైన ప్రాంతంగా భావిస్తున్నారు. పైగా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములు, మౌలిక వసతులు కలి్పంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉండడంతో ఔత్సాహికులకు ఆసక్తి పెరిగిందని నిపుణులు వివరిస్తున్నారు.
ఏర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, బుచ్చినాయుడుకండ్రిగ మండలాల పరిధిలోని మొత్తం 34 గ్రామాల్లో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు అనుకూలమైన ప్రాంతంగా గుర్తించారు. అందుకు అవసరమైన భూములు సేకరించేందుకు జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. జిల్లా కలెక్టర్ నారాయణ భరత్‌గుప్త ఆదేశాల మేరకు తిరుపతి ఆర్డీఓ కనకనరసారెడ్డి ఆధ్వర్యంలో 40 మందితో కూడిన బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఇందు కు ఉత్తర, దక్షిణ విభాగాలుగా విభజించారు. ఉత్తర విభాగంలో 11వేల ఎకరాలు, దక్షిణ వి భాగంలో 13వేల ఎకరాలను సేకరించనున్నారు.
ఏపీఐఐసీ ప్రత్యేక చొరవ
పర్యావరణానికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా, ఎక్కడా చెరువులు, కుంటల జోలికి వెళ్లకుండా ఏపీఐఐసీ ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. జిల్లా అధికారులతో పాటు వైజాగ్, కర్నూలు, విజయనగరం నుంచి 11 మంది అధికారులతో ప్రత్యేక కమీటీ ఏర్పాటుచేసి ఏపీఐఐసీ రోజువారి సమీక్షలు, నివేదికలను తీసుకుంటున్నట్లు సమాచారం. రెండు పంట లు పండే భూముల సేకరించరాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలను జారీచేసినట్లు సమాచారం. దీంతో ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. పరిశ్రమలు ఏర్పాటుతో జనావాసానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రణాళికలు సిద్ధం చేసింది.
పారిశ్రామికవాడగా ‘చిత్తూరు’
రేణిగుంట సమీపంలో చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్లు, ఎల్రక్టానిక్ వస్తువుల తయారీ సంస్థ వింగ్‌టెక్ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందనీ అధికారులు వివరిస్తున్నారు. వింక్‌టెక్ ఎల్రక్టానిక్ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 10వేల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. ఏడాదికి 40లక్షల మొబైల్ ఫోన్లు తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. హాంగ్‌కాంగ్‌కు చెందిన ఇంటెలిజెంట్ సెజ్ డెవెలప్‌మెంట్ సంస్థ శ్రీకాళహస్తి సమీపంలో పాదరక్షల తయారీ యూ నిట్‌ను ఏర్పాటుకు సంసిద్ధమైనట్లు సమాచారం. ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ ఆడిడాస్ పాదరక్షలను ఈ సంస్థ తయారీ చేయనుంది. రెండు దశల్లో ఏర్పాటు చేసే ఈ సంస్థలో 10వేల ఉద్యోగాలు దక్కనున్నాయి.
పరిశ్రమల స్థాపనకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యం
పరిశ్రమల కోసం కేటాయించిన భూముల్లో అవసరమైన విద్యుత్, రహదారులు, మంచినీరు వంటి సౌకర్యాలు కలి్పంచడమే మా లక్ష్యం. స్థానికుల నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషిచేస్తాం. ఏవైనా సమస్యలు ఉంటే కలెక్టర్‌ను సంప్రదించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.
–కనకనరసారెడ్డి, ఆర్డీఓ, తిరుపతి.
Comments
Please login to add a commentAdd a comment